ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ ఫిర్యాదు సంగతి బుధవారం (ఫిబ్రవరి 12) పత్రికలు తెలిపారు. తమ నౌకాదళ సైనికులను వెనక్కి రప్పించుకోడానికి తాము అన్ని అవకాశాలు పరిశీలిస్తామని హెచ్చరించారామె. ఇటలీ ఇప్పటికే అనేకసార్లు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. యూరోపియన్ యూనియన్ చేత కూడా హెచ్చరికలు జారీ చేయించింది. ఇవన్నీ పోను ఇప్పుడు ఐరాస ద్వారా మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
“మానవ హక్కుల హై కమిషనర్ మా పిటిషన్ ను పరిశీలించడానికి అంగీకరించారు” అని ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ ను కలిసిన అనంతరం ఇటలీ విదేశీ మంత్రి తెలిపారు. ఈ మేరకు ఇటలీ వార్తా సంస్ధ ANSA సమాచారం ఇచ్చిందని ది హిందు తెలిపింది. తమ నావికా సైనికులపై సముద్ర పైరసీ వ్యతిరేక చట్టం ప్రయోగిస్తే ఇ.యు, ఇటలీలు తగు విధంగా స్పందిస్తాయని ఆ ప్రభుత్వాల అధినేతలు హెచ్చరికలు జారీ చేసిన మరునాడే ఇటలీ ఐరాస గడప తొక్కింది.
“మా మెరైన్లు టెర్రరిస్టులు కాదు. సముద్ర దొంగలు కూడా కాదు. ఇటలీ ప్రభుత్వం తరపున వారు తమ విధులు మాత్రమే నిర్వర్తిస్తున్నారు” అని బొనినో ఇటలీ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాలు మరియు డిఫెన్స్ కమిటీల ముందు సాక్ష్యం ఇస్తూ బొనినో చెప్పినట్లు తెలుస్తోంది. “రాజకీయాల నుండి రాయబారం వరకూ అన్ని మార్గాలను తెరిచి ఉంచాం. మన మెరైన్లు గౌరవంగా స్వదేశం తిరిగి రావడమే మన లక్ష్యం” అని ఆమె ప్రభుత్వ కమిటీలకు చెప్పారు.
మరోవైపు ఇ.యు కూడా స్వరం పెంచుతోంది. ఇటలీ మెరైన్ల కేసులో యూరోపియన్ యూనియన్ ఇండియాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని ఇ.యు విదేశీ విధాన అధిపతి కేధరిన్ యాష్టన్ సభ్య దేశాలను కోరారు. ఇండియా చర్య వలన సముద్ర దొంగతనాలపై ఇ.యు చేస్తున్న పోరాటంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కాబట్టి ఇ.యు కూటమి ఉమ్మడిగా ఇండియాకు తగిన సందేశం పంపాలని ఆమె కోరారు.
“Suppression of Unlawful Acts against Safety of Maritime Navigation And Fixed Platforms on Continental Shelf Act” పేరుతో రూపొందించిన చట్టాన్ని ఇటలీ మెరైన్లపై మోపడానికి ఎన్.ఐ.ఏ కు హోమ్ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ చట్టాన్ని ఎస్.యు.ఎ చట్టం అని పిలుస్తారు. దీని కింద మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే మరణ శిక్ష విధించబోమని భారత ప్రభుత్వం ఇటలీకి హామీ ఇచ్చింది. కాబట్టి కనీసం 10 సం.ల జైలు శిక్ష పడవచ్చని పత్రికలు చెబుతున్నాయి.
ఎస్.యు.ఎ చట్టాన్ని ఇండియా ప్రయోగిస్తున్నందుకు నిరసనగా ఇండియాతో చర్చల్లో ఉన్న వివిధ ఒప్పందాలను స్తంభింపజేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇటలీ చర్యలకు ఇ.యు సభ్య దేశాల మద్దతును కోరుతూ ఇటలీ లేఖలు రాయనుంది. అక్కడితో ఆగకుండా ఇ.యు తో కలిసి అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు కూడా ఇటలీ ప్రయత్నించనుందని ఇటలీ రాయబార వర్గాలను ఉటంకిస్తూ ANSA వార్తా సంస్ధ తెలిపింది.
ఫిబ్రవరి 18 తేదీన తదుపరి హియరింగ్ ఉన్న నేపధ్యంలో ఈ లోపే అందుబాటులో ఉన్న ఆయుధాలను ఇండియాకు చూపడానికి ఇటలీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటలీ చర్యలను భారత ప్రభుత్వం అంత సీరియస్ గా పట్టించుకున్నట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను అటార్నీ జనరల్ వచ్చే హియరింగ్ లో సుప్రీం కోర్టుకు వినిపించిన తర్వాత ఇటలీ, ఇ.యు లు వ్యక్తం చేస్తున్న భయాలు, బాధలు తొలగిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇటలీ మెరైన్ల కేసును సూయి జెనెరిస్ (తనకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక లక్షణాలు కలిగినది) గా విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. పలు అంశాల్లో ఇటలీ, ఇండియాల మధ్య ఏకాభిప్రాయం లేని మాట నిజమే అని ఆయన అంగీకరించారు. మెరైన్ల విచారణపై భారత కోర్టులకు ఉన్న పరిధి, అమలు చేయాల్సిన చట్టం, విచారించాల్సింది కేంద్రమా లేక రాష్ట్రమా… లాంటి అంశాలలో విభేదాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే భారత చట్టాలు వర్తిస్తాయన్నది తమ నిశ్చితాభిప్రాయం అనీ, ఫిబ్రవరి 18 తేదీ నాటికి ఒక స్పష్టత ఇస్తామని తెలిపారు.
అక్బరుద్దీన్ మాటలను బట్టి ఇటలీకి సంతృప్తికరమైన పరిష్కారాన్నే భారత్ ఇవ్వజూపనున్నట్లు కనిపిస్తోంది. బహుశా కేసును తదుపరి ప్రభుత్వం నెత్తిపై మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం తాత్సారం చేసిందన్నా అనుమానాలూ లేకపోలేదు. కానీ టెర్రరిస్టు వ్యతిరేక చట్టం, సముద్ర దొంగల చట్టం ప్రయోగించడమే అంత సానుకూలంగా కనిపించడం లేదు.
