6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు


Expulsion

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా, బి.జె.పి నేత అద్వానీ బిల్లుకు మద్దతు ఇచ్చేదీ లేదని ప్రకటించి కొత్త సంచలనానికి తెర తీశారు.

సీమాంధ్రకు చెందిన తమ ఎం.పిలు, ఎమ్మేల్యేల ద్వారా ఒకపక్క ఆందోళన చేయిస్తూ తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా ఉభయ ప్రాంతాల్లో రాజకీయ లబ్ది పొందుదామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఎత్తుగడలను ప్రతిపక్ష పార్టీలు చివరి నిమిషంలో చిత్తు చేసే పనిలో పడ్డాయి. ‘మీ ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు. మీ ఎం.పిలే సభలను జరగనివ్వడం లేదు. ముందు మీ ఇంటిని చక్కదిడ్డుకోండి. ఆ తర్వాత మద్దతు అడగండి’ అని బి.జె.పి నేతలు స్పష్టం చేస్తున్నారు.

“కాంగ్రెస్ నాటకాలు ఆడుతోంది. 70ల నుండి సభల్లో ఉన్నాను. ఇలాంటి సభను ఎన్నడూ చూడలేదు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదు” అని ఎల్.కె.అద్వానీ తనను కలిసిన తెలంగాణ టి.డి.పి నేతలతో అన్నారని ఛానెళ్లు చెబుతున్నాయి. ఈ సంగతిని టి.టి.డి.పి నేత దయాకర్ ధృవీకరించారు. అయితే తాము అనేక విధాలుగా నచ్చజెప్పిన మీదట ‘కాస్త కూల్’ అయ్యారు అని దయాకర్ తెలిపారు. మరో బి.జె.పి నేత అరుణ్ జైట్లీ మాత్రం తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మరో ఆలోచనకు తావు లేదని చెప్పారని, ఆయనను కలిశాక తమ సంతోషం రెట్టింపు అయిందని దయాకర్ టి.వి9 విలేఖరితో మాట్లాడుతూ చెప్పారు.

మరో టి.టి.డి.పి నేత, లోక్ సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు లోక్ సభ బి.ఎ.సి సమావేశంలో కూడా ‘టేబుల్ ఐటెమ్’ గానే తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లోక్ సభ లో చర్చించనున్న బిల్లులను ప్రవేశపెట్టే అంశాన్ని మొదట అన్ని పార్టీల పార్లమెంటరీ ప్రతినిధులతో కూడిన  ‘బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్’ (బి.ఎ.సి) లో చర్చిస్తారన్న సంగతి తెలిసిందే. కేబినెట్ సమావేశాల ఎజెండాలో తెలంగాణ అంశాన్ని చేర్చకుండా సమావేశం జరుగుతున్నపుడు టేబుల్ ఐటెమ్ గా ప్రవేశపెట్టే సంస్కృతిని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలకు పరిచయం చేసింది. చివరికి బి.ఎ.సి సమావేశంలో కూడా అజెండాలో లేని తెలంగాణ అంశాన్ని టేబుల్ ఐటెమ్ గా కాంగీ ప్రభుత్వం తేవడం స్వల్ప విమర్శలకు దారి తీసింది.

లోక్ సభ బి.ఎ.సి సమావేశంలో పెట్టినందున తెలంగాణ బిల్లును మొదట లోక్ సభలో ప్రవేశపెడుతున్నారన్న సంగతి స్పష్టం అయింది. అయితే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందనీ, బిల్లును ప్రవేశపెట్టేది లోక్ సభ లోనా లేక రాజ్య సభలోనా అన్నది ఈ సమావేశంలో తేల్చుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బి.జె.పి నేత వెంకయ్య నాయుడు చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ బిల్లు ద్రవ్య వినిమయంతో కూడుకుని ఉన్నది గనుక మొదట లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని న్యాయశాఖ సలహా ఇచ్చింది. దానితో రాజ్యసభకు బదులుగా లోక్ సభలో మొదట బిల్లును పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టారు. “వాళ్ళ సి.ఎం గారేమో హైద్రాబాద్ నుండి ఢిల్లీ దాకా దీక్షలు చేస్తారు. వాళ్ళ ఎం.పి లేమో ఉభయ సభల్లోనూ ఆందోళన చేస్తారు. వాళ్ళ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, పేరు ఎందుకులే గానీ టి.వి చూస్తే తెలుస్తుంది, ‘మాకు సమైక్యాంధ్ర కావాలి’ అని ప్లకార్డు పట్టుకుని నిలబడి ఉన్నారు. అంటే, బిల్లు మీరే తెస్తారు. దానికి వ్యతిరేకంగా ఆందోళన మీరే చేస్తారు. మా ప్రతిపక్షాలం మాత్రం నోరు మూసుకుని బిల్లుకు ఓటేయ్యాలా? ఏదో ఒక బిల్లు సభలో పెట్టి బిల్లును పెట్టిన క్రెడిట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలు న్యాయపరమైన చిక్కులను ఎత్తి చూపితే ‘అదిగో చూశారా, ప్రతిపక్షాలే అడ్డుకున్నాయి’ అని మా పైన నెట్టేయడానికి కాంగ్రెస్ చూస్తోంది. కాబట్టి ముందు మీ ఇల్లు చక్కదిద్దుకొండి” అని వెంకయ్య నాయుడు పార్లమెంటు వద్ద విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

ఇంతకీ రాజ్యసభలో ‘WE WANT SAMAIKYA ANDHRA PRADESH” అంటూ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆత్మ బంధువు కె.వి.పి.రామచంద్రరావు. విచిత్రం ఏమిటంటే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్న వ్యక్తి కె.వి.పి. అవిశ్వాస తీర్మానం ఇచ్చినందుకు 6గురు సభ్యులను బహిష్కరించినట్లు చెప్పిన కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో కూడా టికెట్ సంపాదించి సీటు గెలుచుకున్న కె.వి.పి తిరుగుబాటును ఎలా సహిస్తోంది? సీమాంధ్రలో ఆందోళనల నాటకం, తెలంగాణలో టి.ఆర్.ఎస్ విలీనంల ద్వారా ఉభయ ప్రాంతాల్లో రాజకీయ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తెలివి ప్రదర్శిస్తోందన్నది స్పష్టమే. వెంకయ్య నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ ఉభయ భ్రష్టత్వమ్ పొందుతుందా లేక తాను ఆశిస్తున్నట్లు ఉభయ లబ్ది పొందుతుందా అన్నది వేచి చూడాల్సిన విషయం.

బి.జె.పి, టి.డి.పి లు ప్రభావవంతంగా కాంగ్రెస్ ద్వంద్వ విధానాన్ని ఎండగట్టడంతో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా సవరణలకు పూనుకుంది. అందులో మొదటి చర్యగా 6గురు ఎం.పి లను (లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్ష కుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్) సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోకొద్ది సేపటికే 6గురు ఎం.పి లను బహిష్కరిస్తున్నట్లుగా ఎ.ఐ.సి.సి ఒక ప్రకటన విడుదల చేసింది. వీరి బహిష్కరణ ద్వారా బి.జె.పి విమర్శలను పూర్వపక్షం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘ముందు మీ ఇంటిని చక్క దిద్దుకోండి’ అన్న బి.జె.పి విమర్శలకు సమాధానంగానే 6గురు ఎం.పిల బహిష్కరణ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బహిష్కరణకు గురయిన 6గురు ఎం.పిలు మాత్రం సంతోషం ప్రకటిస్తున్నారు. తాము అన్నింటికి సిద్ధపడి ఉన్నాం అంటూ కాంగ్రెస్ విమర్శకులకు మరో క్లూ ఇచ్చారు. వారిలో ఒక ఎం.పి అయితే మేము అవిశ్వాస తీర్మానం ఇచ్చింది ఎప్పుడో కదా, ఇప్పుడు బహిష్కరించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తమ అధిష్టానం వ్యవహారం ‘దొంగలు పడ్డ 6 నెలలకు మొరిగినట్లుంది’ అని ఆయన విమర్శించారు. తమపై వేటు వేస్తే ప్రజలు కాంగ్రెస్ పై వేటు వేస్తారని, ఇక కాంగ్రెస్ కు అభ్యర్ధులు దొరకరు అని లగడపాటి తమ పార్టీని శపించారు. ‘కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు దొరకరన్న ఆ అజ్ఞాని ఎవరు?’ అని ప్రశ్నిస్తూ రాష్ట్ర పి.సి.సి చీఫ్ బొత్స ‘నేనక్కడికీ పోలేదని’ చాటుకున్నారు.

రాజ్య సభలో బిల్లును ప్రవేశ పెట్టాలని రాష్ట్రపతి తన సిఫారసులో పేర్కొన్నారు. ఇప్పుడు లోక్ సభలో ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాబట్టి రాష్ట్రపతి నుండి మళ్ళీ తాజాగా సిఫారసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్రపతికి విన్నవించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సచివాలయం అప్రమత్తంగా ఉండడం వల్ల తెలంగాణ బిల్లు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనే పరిస్ధితిని తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బిల్లు ద్రవ్య బిల్లు కూడా కనుక (కేంద్రంపై ఆర్ధిక భారం పడే బిల్లు) దానిని మొదట లోక్ సభలో పెట్టాలని రాజ్యసభ సచివాలయం అభ్యంతరం చెప్పింది. దానితో కేంద్రం న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరింది. రాజ్యసభ సచివాలయం అభిప్రాయాన్ని న్యాయశాఖ ధృవీకరించింది. ఫలితంగా బిల్లు లోక్ సభలో మొదట అడుగు పెడుతోంది. అంటే కేంద్రం కనీసం న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధపడిందా?  

6 thoughts on “6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

  1. BJP thana nija swaroopanni bayata pettukutndhi … congress leaders kante mundhu vallu telangan meedah padi bathukuthunna paranna jeevulu …. valla ku congresss kanna telanagna meedha adipathyam athi mukhyam … vallu ala cheykundaa inkaa ela chestharu .. ee vishayam adistaniki telusu kabatee valla meedha charya tisukovadam ledu … congress anthargathaa vishaylu BJP ki endhuku daniki nijayeethi vunte support cheyachu gaa …

  2. పింగ్‌బ్యాక్: 6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు | ugiridharaprasad

  3. తిథి, వార, నక్షత్రాలను పక్కాగా లెక్కవేసుకుని, ఎప్పుడేం చెయ్యాలో స్క్రిప్ట్ రాసుకుని, అన్ని రకాల ఆటుపోట్లను ముందే పసిగట్టి కాంగ్రెస్ కథను క్లైమాక్స్ కు తెచ్చింది. తెలంగాణాకోసం మా పార్టీని ఆంధ్రాలో నాశనం చేసుకున్నాం, తెలంగాణా రాకపోవడానికి మేము కారణం కాదు అని ఓట్లు దండుకుంటుంది.

  4. తెలంగాణ బిల్లు విషయం కొద్దిసేపు ప్రక్కన పెట్టండి…. యింకో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ‘అప్రజాస్వామ్యం’ జరిగిపోతున్నా.,, మీలాంటి వారు (మీడియా కూడా) చూనీ ఛూడనట్లు నటిస్తున్నారు.

    కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం సభాపతికి అందచేస్తే.. ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలా లేదా అనే విషయం చర్చకు రాకుండా స్వపక్షంలో వున్న సభ్యులే (తెలంగాణ ఎం.పి లచే) గొడవ చేయించినట్లు వార్తలు వచ్చాయి. సభాపతి ఆ వొంకతో సభ మరుచటి రోజుకు వాయిదా వెయ్యడం కరెక్టేనా? సభ ఒక గంట వాయిదా వెయ్యవచ్చు కదా? అంటే మరుసటి రోజుకు వాయిదా పడితే.. సభ్యులు యిచ్చిన నోటీసు వ్యాలిడిటీ టైమ్ అయిపోతుండట.. యిలా చాలా రోజులు వాయిదా వేసినా ప్రజాస్వామ్య వేత్తలు/మీడియా విమర్శించిన దాఖలాలు లేవు.. పస్తుతం అలా తెలంగాణా యిస్తాన్నన్న ప్రభుత్వానికి యిబంది పెట్టడం ఎందుకులే అనే తాత్కాలిక ప్రయోజాల కన్నా రేపటికి యిదోక దారుణమైన అప్రజాశ్వామిక చర్యలకు దారితీస్తుంది.

    రేపటి రోజున.. ప్రతిపక్షం అవిశ్వాస నోటీసు స్పీకర్ కార్యాలయానికి యిచ్చినటయితే.. యిప్పటి వలే స్వపక్షంలో ని సభ్యులచే అధికార పక్షం స్పీకర్ పోడియాన్ని ముట్టడించి సభను ప్రతీరోజూ వాయిదా వేయిస్తే.. రాజ్యాంగ ఉలంఘన జరిగినట్లా? జరగనట్లా?

  5. వాసవ్య గారు, మీ వ్యాఖ్య మరిచాను.

    “యింకో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో” అంటే? ఇది నాకర్ధం కాలేదు.

    అవిశ్వాస తీర్మానంపై చర్చకు రానివ్వకపోవడం, తెలంగాణ వారిని ఉపయోగించుకోవడం… ఇవన్నీ కాంగ్రెస్ చర్యలు. ఆ పార్టీ తరపున నేనేం చెప్పలేను.

    నా దృష్టిలో తెలంగాణ డిమాండ్ ప్రజాస్వామికమైనది. కాబట్టి దాన్ని ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రియులు కోరుకోవాలి. నాకయితే మీరు గుర్తించింది భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్న మీ ఆందోళనలో తెలంగాణ బిల్లు పెడతారన్న ఆందోళన తప్ప మీరు చెప్పే ప్రమాదం పట్ల ఆందోళన కనిపించడం లేదు.

    నా విషయానికి వస్తే చూసీచూడనట్లు నటించడం ఎందుకు? నేనే చెబుతున్నాను. ఆ అంశానికి అస్సలు ప్రాముఖ్యత లేదు. తెలంగాణను అడ్డుకోవడానికే వారు అవిశ్వాసం తెచ్చారు తప్ప దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బృహత్తర కర్తవ్యం వారికేమీ లేదు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను పార్లమెంటులోని సాంకేతిక సౌకర్యాల ద్వారా అణచివేయాలని చూడడమే నిజమైన అప్రజాస్వామ్యం.

    తెలంగాణ ఇష్టం లేనివారు బిల్లును ఎలా అడ్డుకోవాలా అని చూస్తుంటే, బిల్లును ప్రతిపాదిస్తున్నవారు దాన్ని ఎలా ఆమోదించుకోవాలా అని చూస్తున్నారు. తెలంగాణ ఇవ్వడమే ప్రజాస్వామ్య గౌరవం. అడ్డుకోవడం కాదు. అడ్డుకోవడమే అప్రజాస్వామికం.

    పార్లమెంటు, ప్రతిపక్షాలు, స్పీకర్ నోటీసు… ఇలాంటివన్నీ జనం కోసం జరుగుతున్నాయన్న భ్రమలు నాకు లేవు. అదొక బురద. బురదలో మంచి బురద, చెడ్డ బురద అంటూ ఉండవు కదా? ఏ బురదైనా బట్టలు పాడవడం ఖాయం.

వ్యాఖ్యానించండి