వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం


HUTCH

వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని న్యాయ శాఖ ఆమోదంతో దీనికి కేబినెట్ అంగీకరించిందని పత్రికలు తెలిపాయి. ఈ నిర్ణయంతో మరోసారి బ్రిటన్-ఇండియాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

వోడాఫోన్ పన్ను వివాదానికి ఇండియాలో ఘన చరిత్రే ఉంది. ఈ వివాదంలో ఒక ఫలితంగానే ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి తప్పించి రాష్ట్రపతిగా సాగనంపారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. (కాదు, కాదు, కాంగ్రెస్ యువరాజుకు పోటీ తప్పించేందుకే ఆయన్ని సాగనంపారని మరో -పరిగణించదగిన- వాదన) 2007 నుండి నలుగుతున్న ఈ వివాదం హచిసన్ కంపెనీ కొనుగోలు సందర్భంగా వోడాఫోన్ కంపెనీ ఎగవేసిన ‘కేపిటల్ గెయిన్స్ టాక్స్’ కు సంబంధించినది.

హాంగ్ కాంగ్ కు చెందిన హచిన్సన్ కంపెనీని 2007లో బ్రిటన్ కు చెందిన వోడాఫోన్ కంపెనీ కొనుగోలు చేసింది. వోడాఫోన్ కంపెనీ బ్రిటన్ తో పాటు నార్వే, డెన్మార్క్ లలో కూడా కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఈ కంపెనీని నార్వే కంపెనీగా మరికొన్నిసార్లు డెన్మార్క్ కంపెనీగా చదువుతుంటాం. ఈ కొనుగోలు ద్వారా వోడాఫోన్ పెట్టుబడి లాభం సంపాదించింది. హచిన్సన్ నుండి కొనుగోలు చేసిన కొన్ని ఆస్తులను (స్టాక్స్) అధికధరకు అమ్ముకుని లాభం సంపాదించింది. ఈ లాభం లేదా ఆదాయం పైన భారత దేశంలో పన్ను చెల్లించాలి.

పన్ను ఎగవేయడానికి వోడాఫోన్ ఒక పధకం ప్రకారం వ్యవహరించింది. కేమన్ ఐలాండ్ దేశంలో వోడాఫోన్ కు ఒక అనుబంధ కంపెనీ ఉంది. ఈ అనుబంధ కంపెనీ మళ్ళీ హాలండ్ కి చెందినది. హచిన్సన్ కంపెనీకి కూడా కేమన్ ఐలాండ్ లో ఒక అనుబంధ కంపెనీ ఉంది. హచిన్సన్ అమ్మేసిన స్టాక్ లు కేమన్ ఐలాండ్ లోని దాని అనుబంధ కంపెనీవి. హాలండ్ అనుబంధ కంపెనీ ద్వారా ఈ స్టాక్ లను వోడాఫోన్ కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు ద్వారా భారత కంపెనీ అయిన హచిన్సన్ ఎస్సార్ కంపెనీ స్టాక్ లపైన పరోక్ష యాజమాన్యాన్ని వోడాఫోన్ సంపాదించింది.

పేరుకు అనుబంధ కంపెనీలే గానీ ఇవన్నీ పేపర్ కంపెనీలు. స్టాక్ ల అమ్మకాలు, కొనుగోళ్లలో  పన్ను ఎగవేయడానికి ప్రతి పెట్టుబడిదారీ కంపెనీ ఇలాంటి పేపర్ కంపెనీలను స్ధాపించి ఆస్తులను వాటికి తరలిస్తాయి. ఇలాంటి పేపర్ కంపెనీలన్నీ చిన్న చిన్న దేశాల్లో ఉంటాయి. అక్కడ పన్నులు పెద్దగా ఉండవు. అందువలన పెట్టుబడిదారులకు, ధనికవర్గాలకు అవి స్వర్గధామాలుగా బాసిల్లుతుంటాయి.

ఇక్కడ అమ్మకం అయిన అసలు కంపెనీ హచిన్సన్ ఎస్సార్ అనే భారత కంపెనీ. అమ్మిందేమో హాంగ్ కాంగ్ కి చెందిన ‘హచిన్సన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ లిమిటెడ్’ అనే కంపెనీ యొక్క కేమన్ ఐలాండ్ అనుబంధ కంపెనీ. కొన్నదేమో కెమెన్ ఐలాండ్ లో ఉన్న, బ్రిటన్ కి చెందిన, వోడాఫోన్ కంపెనీ యొక్క హాలండ్ అనుబంధ కంపెనీ. అమ్మిన, కొన్న కంపెనీలు రెండూ భారత దేశంతో సంబంధం లేనివి. కానీ అమ్మకం మరియు కొనుగోలు అయిన కంపెనీ మాత్రం వాస్తవంగా, భౌతికంగా భారత దేశ గడ్డపై ఉండి వ్యాపారం నిర్వహించిన కంపెనీ. వోడాఫోన్, హచిన్సన్ ఇంటర్నేషనల్, హచిన్సన్ ఎస్సార్… ఇవే అసలు కంపెనీలు. మిగిలినవన్నీ పేపర్ కంపెనీలు.

కెమెన్ ఐలాండ్ లోని పేపర్ కంపెనీల్లో వాటా కూడా వోడాఫోన్ కు నేరుగా లేదు. మారిషస్ లోనే అనేకానేక పేపర్ కంపెనీల ద్వారా పరోక్షంగా వాటా కలిగి ఉంది. కానీ అవన్నీ పేపర్ కంపెనీలే. వాస్తవంగా లబ్ది పొందింది మాత్రం వోడా ఫోన్ కంపెనీయే.

భారత కంపెనీ అయిన హచిన్సన్ ఎస్సార్ ను కొనుగోలు చేసిన కంపెనీ ఏదైనా గానీ అది సదరు కొనుగోలు ద్వారా లాభం సంపాదించింది. ఈ కొనుగోలు విలువ 11.1 బిలియన్ డాలర్లు. భారత కంపెనీని కొనుగోలు చేసిన కంపెనీ సంపాదించిన లాభం పైన రు 7,990 కోట్లు ఆదాయ పన్ను కట్టాలని భారత ఆదాయపన్ను విభాగం డిమాండ్ లేవనెత్తింది. తాను నేరుగా కొనలేదు కాబట్టి నేను కట్టను పొమ్మంది వోడాఫోన్. ఈ పన్ను తగిన సమయంలో కట్టకపోతే అంతే మొత్తంలో జరిమానా పడుతుంది. అనగా రు. 15,980 కోట్లు. దీనిపైన వడ్డీ కలుపుకుని ఇప్పుడు మొత్తం రు. 20,000 వరకూ వోడాఫోన్ కట్టాల్సి ఉంది.

తన అనుబంధ కంపెనీ చేసిన కొనుగోలు పైన భారత ప్రభుత్వానికి ఆధారిటీ లేదని వోడాఫోన్ వాదించింది. విషయం కోర్టు వరకు వెళ్లింది. సుప్రీం కోర్టు వోడాఫోన్ కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అనగా వోడా ఫోన్ చేత పన్ను కక్కించగల చట్టాలు మన దగ్గర లేవు. లేకపోయినా హచిన్సన్ ఎస్సార్ కంపెనీ ఆస్తులు మౌలికంగా భారత దేశ ఆస్తులు. వినియోగదారులు భారతీయులు. లాభాలన్నీ భారతీయుల నుండి పిండుకున్నవే. ఈ మాత్రం విచక్షణను ఉపయోగిస్తే తగిన చట్టం సుప్రీం కోర్టుకు దొరకదా? దొరికి తీరుతుంది. కానీ సుప్రీం కోర్టు అటువైపు చూడడానికే నిర్ణయించుకుంది. ఈ తీర్పును భారత దేశ పత్రికలు తూర్పారబట్టాయి. భారత దేశ ప్రజల ప్రయోజనాలను కనీస మాత్రంగా పట్టించుకోని తీర్పుగా తిట్టిపోశాయి. ప్రభుత్వం మళ్ళీ అప్పీలు చేసుకున్నప్పటికీ, సమీక్ష కోరినప్పటికీ సుప్రీం కోర్టు తన తీర్పు మార్చుకోలేదు.

దానితో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో GAAR (General Anti-Avoidance Rules) చట్టం రూపుదిద్దుకుంది. దీనిని ఆదాయపన్ను చట్టంలో చాప్టర్ X – A గా చేర్చారు. ఆదాయ పన్ను ఎగవేతకు అనేక మార్గాలు (Ex: Tax Evasion, Tax Avoidance, Tax Mitigation, Tax Planning) కంపెనీలకు అందుబాటులో ఉంటాయి. GAAR వీటిలో Tax Avoidance ని మాత్రమే ఉద్దేశించి రూపొందించారు. అయితే దీనిని వెనుకటి నుండి అమలులోకి తేవాలని ప్రణబ్ ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్టాన్ని రకరకాలుగా దిగ్గోట్టి, నలగ్గొట్టి, కుదించి, పీకి… మొత్తం మీద బలహీనం కావించి గాని పార్లమెంటులో ఆమోదించలేదు. అది కూడా ఇంకా అమలులోకి రాలేదు. 2012 లో అమలులోకి రావాల్సిన చట్టం ఇప్పుడు 2016లో వస్తుందిలెండి అంటున్నారు.

గత సంవత్సరం జూన్ నెలలో కంపెనీతో రాజీ చర్చలు జరపాలని కేబినెట్ ప్రతిపాదించి ఆమోదించింది. దాని ప్రకారం చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చర్చలకు కట్టుబడి ఉండాల్సిన పని లేదని నియమం పెట్టుకున్నారు. వోడాఫోన్ కంపెనీ ఇండియాలో ఎదుర్కొంటున్న మరో కేసును (3,700 కోట్ల పన్ను) కూడా ఈ చర్చల్లో కలపాలని కంపెనీ కోరుతూ వచ్చింది. ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దానితో చర్చల్లో పురోగతి లేదు. కంపెనీ ఊగిసలాటతో విసిగిపోయిన ఆర్ధిక శాఖ ఇక చర్చలు జరపలేమని కేబినెట్ కి నోట్ సమర్పించింది. పన్ను వసూలుకు ముందుకు వెళ్ళడం ఉత్తమం అని ప్రతిపాదించింది. దానికి న్యాయశాఖ ఆమోదం తెలిపింది.

అయితే ఈ పన్ను ఎలా వసూలు చేస్తారన్నదీ తెలియలేదు. అసలు వసూలు చేస్తారో లేదో కూడా అనుమానమే. అయితే గియితే కొత్త ప్రభుత్వమే ఈ వ్యవహారం తేల్చాలి. ఆ వచ్చే ప్రభుత్వం GAAR చట్టాన్ని ఎంతవరకు అమలు చేస్తుందో అనుమానమే. ఆ చట్టం తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుబడి వాతావరణం చెడిపోతుందంటూ సాకు చెప్పి అమలును వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడెలాగూ ఎన్నికలు దగ్గర పడ్డాయి కనుక ధైర్యంగా ‘పన్ను వసూలు చేయాల్సిందే’ అని ఒక నిర్ణయం తీసేసుకుంది. అంటే ఈ భారం పడేది తదుపరి ప్రభుత్వం పైనే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఏమవుతుందో, ఎన్.డి.ఏ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో, మూడో ప్రత్యామ్నాయం అధికారం చేపడితే ఏం చేస్తారో అన్నీ ఊహలకు అప్పజెప్పాల్సిందే తప్ప నిర్ధారణలు చేయలేం. కానీ ఈ కేసు ఇప్పుడప్పుడే తేలదు అన్న సంగతి మాత్రం నిర్ధారణగా చెప్పొచ్చు.

వ్యాఖ్యానించండి