చాయ్, మోడిలతో బి.జె.పి రెడీ -కార్టూన్


T elections

పదేళ్ళ నుండి తెలంగాణ బిల్లును నానబెట్టిన కాంగ్రెస్ పార్టీ, 2014 ఎన్నికల కోసం మాత్రమే అలా చేసిందని, బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోవడంతో టి.బిల్లుపై హడావుడి పడుతోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.

***                    ***                    ***

బి.జె.పి ఎన్నికల ప్రచారం ఇప్పుడేం ఖర్మ! ఎప్పుడో మొదలైపోయింది. ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను కూడా ప్రచార సామాగ్రిగా మార్చుకుని మరీ అది ఎన్నడో రంగంలోకి దిగింది. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా వెనకబడి ఏమీ లేదు. రాహుల్ ను ముందు నిలిపి ఆయన ద్వారా ప్రచారం ప్రారంభించానని కాంగ్రెస్ అనుకుంది. కానీ రాహుల్ గాంధీ అనుభవ రాహిత్యం అనండి, చేతగానితనం అనండి, చొరవలేనితనం అనండి… ఏమన్నా అవేమీ అక్కరకు రాలేదు. లేదా పని చేయలేదు.

బి.జె.పి వి పని చేశాయి. అంతే తేడా. ‘టీ కుర్రాడు ప్రధాని మంత్రి అవుతాడా?’ అని ఎవరో ఎద్దేవా చేశారు. మోడి దానినే ప్రచారస్త్రం చేసుకున్నారు. “కాంగ్రెస్ లో హార్వర్డ్ యూనివర్సిటీ లో చదివిన వారు మాత్రమే ప్రధాని పదవికి అర్హులు. బి.జె.పి పార్టీలో అయితే టీ కుర్రాడు కూడా ప్రధాని మంత్రి కాగలడు” అంటూ తిప్పి కొట్టడంతో కాంగ్రెస్ ఖంగు తినక తప్పలేదు. “టీ కుర్రాడు కూడా ప్రధాని కావచ్చు గానీ నేరస్ధులే అందుకు అనర్హులు” అని రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో సవరించుకున్నారు.

మోడి గారి ‘టీ కుర్రాడి’ రిటార్టు తోనే బి.జె.పి ఆగిపోలేదు. “చాయ్ సమయంలో చర్చించుకుందాం” (Chai pe Charcha) అన్న నినాదంతో మూడు రోజుల పాటు చర్చా కార్యక్రమాన్ని నడిపింది. టీ సమయంలో దేశవ్యాపితంగా 1000 చోట్ల లోక్ సభ ఎన్నికలపై ఫిబ్రవరి 12 నుండి మూడు రోజులపాటు చర్చిస్తాం అని బి.జె.పి చెప్పింది. టి.విలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు ఇలా వివిధ సాధనాల ద్వారా సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లను వినియోగిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పింది. ఇది ఎంతవరకు జరిగిందన్నది తర్వాత సంగతి. బి.జె.పి ఎన్నికల ప్రచారం ఎన్నడో మొదలైపోవడం అసలు సంగతి.

‘మోడియే ప్రధాని’ అన్న అంశాన్ని కూడా బి.జె.పి ప్రచారంలో పెట్టింది. మోడి గాలి తీవ్రంగా వీస్తోందన్న నమ్మకం ఈ ప్రచారంలో కనిపిస్తుంది. నిజంగా గాలి ఉందా అన్నది అనుమానమే. కానీ ఎన్నికల్లో ప్రజలకు సంబంధించిన వాస్తవ సమస్యలు ఈ ప్రచార రందిలో ఎలా కొట్టుకుని పోతున్నాయో జనం గమనించాల్సిన విషయం.

నిజంగా మోడి ప్రధాని అయితే అదేమన్నా గొప్ప సంఘటనా? ఎంతమంది ప్రధానులు కాలేదు, పోలేదు? ప్రధాని ఎవరు అయినా ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఆ పార్టీ విధానాలు ఏమిటి అన్నదే ప్రజలకు సంబంధించిన విషయం.

ఆ మాటకొస్తే ప్రధాన మంత్రి ఎవరన్నది ప్రజలా ఎన్నుకునేది? ప్రజలు ఎన్నుకునేది ఎం.పిలను మాత్రమే. ఒక పార్టీ లేదా కూటమి కి చెందిన ఎం.పిలు సభలో మెజారిటీ సాధిస్తే వారంతా కలిసి నాయకుడిని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ఆ నాయకుడిని పిలుస్తాడు. అప్పటిదాకా ప్రధాని ఎవరన్నది అప్రస్తుతం. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్ధలో రాజకీయార్ధిక విధానాలే కీలకం గానీ వ్యక్తులు కాదు కదా!

కానీ బి.జె.పి ఒక వ్యక్తినే కీలకం చేసింది. తద్వారా పార్లమెంటరీ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్ధను అపహాస్యం చేసింది. పోనీ ఆ వ్యక్తి ఏమన్నా నిష్కళంకుడా? సకల వర్గాల ప్రయోజనాలను ఒకే రీతిలో కాపాడతారని దేశవ్యాపితంగా ప్రజలందరూ (కనీసం అనేకమంది) భావిస్తున్న వ్యక్తా? అదేమీ లేదు. పైగా వివాదాస్పద వ్యక్తి.

ప్రజలను వారి మతాల వారీగా నిట్ట నిలువునా చీల్చి లబ్ది పొందిన వ్యక్తి. రాజధర్మం పాటించడంలో విఫలం అయ్యారని ఆయన పార్టీ అగ్రనేత వాజ్ పేయి గారే ఆక్షేపించిన వ్యక్తి. హంతక మూకల బారిన పడి హతులయిన వేలాది ముస్లింలను కారు కింద ప్రమాదవశాత్తూ పడి చనిపోయిన కుక్క పిల్లతో పోల్చగల సెన్సిబుల్ పర్సన్. పసిపిల్లల పోషకాహార లోపానికి ఆడపిల్లల సౌందర్య కాంక్షను కారణంగా చెప్పగల సునిశిత మేధావి. గుజరాత్ మారణకాండకు మాట మాత్రంగా కూడా ‘అపాలజీ’ చెప్పడానికి నిరాకరించిన నిస్పక్షపాత పాలకుడు.

ఎన్.డి.ఏ అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది ఈ వ్యక్తే అని బి.జె.పి చెబుతోంది.

***                    ***                    ***

బి.జె.పి ప్రతిపక్ష పార్టీ. కాబట్టి దానికి పార్లమెంటు బాధ్యతలు, ఈ చివరి కాలంలో, లేవు. కాంగ్రెస్ పాలక పార్టీ. తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ పైన ఉంది. పైగా ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ సీట్లు గెలుచుకోవడానికి తురుపు ముక్క తెలంగాణే అని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అది బిల్లు ఆమోదం పొందితేనే. ఈ సంకటాన్నే కార్టూనిస్టు ఇలా చూపించారు.

వ్యాఖ్యానించండి