పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి


Italian Prime Minister Enrico Letta

Italian Prime Minister Enrico Letta

కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ మెరైన్లను పైరసీ వ్యతిరేక చట్టం కింద విచారించడానికి భారత హోమ్ శాఖ అనుమతి ఇవ్వడంపై ఇటలీ తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. ఇటలీ విదేశీ మంత్రి ఆదివారం ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించగా సోమవారం ఇ.యు కూడా దాదాపు అదే తరహాలో హెచ్చరించింది. ఇటలీ మెరైన్లను అన్యాయంగా విచారిస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ఇటలీ, ఇ.యులు అల్టిమేటం జారీ చేశాయి.

“మా మెరైన్లకు వ్యతిరేకంగా జరగబోయే లీగల్ ప్రొసీడింగ్స్ విషయంలో న్యూ ఢిల్లీ నుండి వస్తున్న నిర్దిష్ట సూచనలు మాకు నోటమాట రాకుండా చేస్తున్నాయి. తీవ్ర ఆగ్రహం కలుగుతోంది” అని విదేశీ మంత్రి ఎమ్మా బొనినో వ్యాఖ్యానించారు. “మస్సిమిలియానో లత్తోరే, సల్వాటోర్ గిరోన్ లను ఇంటికి తెచ్చుకునే విషయంలో మా నిర్ణయం మరింత రాటు దేలింది” అని ఆమె అన్నారని ఇటలీ మీడియాను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక ఆదివారం తెలిపింది.

సప్రెషన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్ట్స్ (ఎస్.యు.ఎ) చట్టం కింద ఇటలీ మెరైన్లను విచారించడానికి భారత హోమ్ మంత్రిత్వ శాఖ ఎన్.ఐ.ఎ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ) కి అనుమతి ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఇటలీ విదేశీ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ఎస్.యు.ఎ చట్టం ప్రకారం దోషులుగా తేలితే మరణ శిక్ష విధించవచ్చు. అయితే ఇటలీ మెరైన్లకు మరణ శిక్ష విధించబోమని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనగా కనీసం 10 సం.ల పాటు ఇటలీ నావికా సైనికులు భారత జైళ్ళలో మగ్గాల్సి ఉంటుంది.

సోమవారం ఇటలీ మరోసారి ఇండియాను గట్టిగా హెచ్చరించింది. ఈసారి ఇ.యు తో కూడా ప్రకటన ఇప్పించింది. కఠినమైన యాంటీ-పైరసీ చట్టాన్ని ప్రయోగించడం తమకు ఆమోదయోగ్యం కాదని ఇటలీ హోమ్ మంత్రి, ప్రధాన మంత్రు ప్రకటించారు. “భారత అధికారులు మోపిన అభియోగాలు మాకు అంగీకారయోగ్యం కావు. ఇటలీ, ఇ.యు లు దీనికి తగిన విధంగా ప్రతిస్పందిస్తాయి” అని ప్రధాని ఎన్రికో లెట్టా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

మరణ శిక్షకు అవకాశం లేదని గతవారం స్పష్టం చేసిన భారత ప్రభుత్వం, ఐనప్పటికీ ఇటలీ మెరైన్లను ఎస్.యు.ఎ చట్టం ప్రకారమే విచారిస్తామని తెలిపింది. ఈ మేరకు భారత హోమ్ శాఖ ఎన్.ఐ.ఎ కు ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇటలీ అధికారులు అప్రమత్తం అయ్యారు. విచారణను దగ్గరి నుండి పరిశీలించడానికి ఇటలీ రక్షణ మంత్రి మేరియో మౌరో స్వయంగా భారత్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఎస్.యు.ఎ చట్టం అంటే టెర్రరిస్టు వ్యతిరేక చట్టమే. అయితే సముద్ర జలాల్లో జరిపే నేరాలు ఈ చట్టం కిందికి వస్తాయి. తమ మెరైన్లు టెర్రరిస్టులు కాదని తమ విధి తాము నిర్వర్తిస్తున్న సాధారణ భద్రతా సిబ్బంది అనీ ఇటలీ మొదటి నుండి వాదిస్తోంది. అంతర్జాతీయ జలాల్లో నేరం జరిగినందున ఇటలీలో విచారణ జరగాలని ఇటలీ వాదిస్తోంది. అయితే భారత కాంటినెంటల్ షెల్ఫ్ పరిధిలో నేరం జరిగింది కనుక, ఎస్.యు.ఎ చట్టం ఈ పరిధిలోనిదే కనుక దానికింద అభియోగాలు మోపడం సరైందేనని భారత్ భావిస్తోంది.

ఈ నేపధ్యంలో భారత్ తాను చెప్పినట్లుగానే ముందుకు పోతే తగిన విధంగా స్పందించే హక్కును తాము రిజర్వ్ లో పెట్టుకుంటామని ఇటలీ హెచ్చరించింది. “టెర్రరిజంకు సంబంధించిన చట్టం కిందనే అభియోగాలు నమోదు చేస్తున్నామని భారత ప్రాసిక్యూటర్లు నిర్ధారిస్తే గనుక ఏ సమయంలోనైనా తగిన విధంగా స్పందించేందుకు హక్కును మేము రిజర్వ్ చేసుకుంటున్నాము” అని ఇటలీ ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది.

తదుపరి విచారణ తేదీని ఫిబ్రవరి 18గా సుప్రీం కోర్టు ఈ రోజు నిర్ణయించింది. ఆ రోజు ఇరు పక్షాల వాదనలు వింటామని తెలిపింది.

2 thoughts on “పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి

  1. పింగ్‌బ్యాక్: పైరసీ చట్టం ప్రయోగం: ఇండియాపై ఇటలీ, ఇ.యు అసంతృప్తి | ugiridharaprasad

వ్యాఖ్యానించండి