కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ లో ఆటో ఎగ్జిబిషన్ జరిగింది. ఆటో ఎగ్జిబిషన్ నూ రాష్ట్ర విభజన కేంద్రంగా వివిధ పార్టీల్లో సాగుతున్న రాజకీయాలను పోల్చుతూ గీసిన కార్టూన్ ఇది.
కాంగ్రెస్: రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా విభజన రాజకీయాలకు సంబంధించి సోనియా ఒకవైపు వెళ్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా ఆమెకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. విభజనపై తమ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కిరణ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ఆటో ఎక్స్ పో.
తెలుగు దేశం: ఈ పార్టీలో అధినేతకు ప్రత్యర్ధులు లేనే లేరు. అధినేతకు ప్రత్యర్ధులు లేరన్నంత మాత్రాన అసలు ప్రత్యర్ధులే లేరని అర్ధం కాదు. ప్రత్యర్ధులు ఉన్నారు. కానీ ఆ పార్టీ నేత చంద్రబాబుకు ఆయనే ప్రత్యర్ధి. ఒక్కసారి కాదు, వీలైనన్ని సార్లు. రెండు కళ్ల సిద్ధాంతం ప్రబోధించడం ద్వారా పార్టీని రెండు పడవలపై కాళ్ళు పెట్టి నడిపించిన ఘనత చంద్రబాబు సొంతం. ఆ మాటకొస్తే ఆ ఘనత కాంగ్రెస్ కి కూడా ఉంది. కానీ ఆయా పాత్రలు పోషించడానికి ఆ పార్టీలో నేతలు కోకొల్లలు. టి.డి.పి నేత మాత్రం అన్నీ తానై కమలహాసన్ ను మించిన పాత్రలు పోషిస్తున్నారు.
2009 డిసెంబర్ 9 ముందు వరకు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పిన బాబు ఆ నాటి నిర్ణయంతో ఒక్కసారిగా తన వ్యతిరేకతను తన ప్రకటనల్లో గుప్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ఊపందుకోవడంతో, ‘నేనేమన్నా కాదన్నానా, కాకపోతే ఇరు ప్రాంతాల్లో పార్టీ ప్రయోజనాలు చూస్తున్నాను గానీ’ అన్నారు. గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం అని కూడా చెప్పారు. తీరా గతేడు జులైలో కేంద్రం నిర్ణయం అయ్యాక మళ్ళీ గొంతు మార్చి ‘సమ న్యాయం’ అంటూ తంటాలు పడుతున్నారు. ఇది తెలుగు దేశం ఆటో ఎక్స్ పో. వన్ మేన్ షో!
టి.ఆర్.ఎస్: ఈ పార్టీ పరిస్ధితి విచిత్రం. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటుంది గానీ తెలంగాణలో అన్నీ జిల్లాల్లోనూ సీట్లు గెలుచుకోలేని పార్టీ. ఏడెనిమిది సీట్లే ఇచ్చినందుకు 2009లో జనం మీద అలిగిన పార్టీ కూడా. తన పరిస్ధితి గమనించుకున్న ఆ పార్టీ అధినేత తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో కలిపిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ లు రెండూ కలిపేసి (ట్రాక్టర్ కింది భాగం, కారు పై భాగం కలిపి కొత్త కారు తయారు చేసినట్లు) కొత్తగా ఏర్పడే తెలంగాణ కాంగ్రెస్ కు ఏకైక నేతగా ఉండాలని కలల కంటున్నారు. ట్రాక్టర్ ఇంజన్ తో నడిచే కారు నడవదని కార్టూనిస్టు చెబుతున్నారా? తెలియకుంది. ఇది టి.ఆర్.ఎస్ మార్కు ఆటో ఎక్స్ పో.
వైకాపా: ఈ పార్టీకి యువరాజు, రారాజు అన్నీ ఒకే ఒక వ్యక్తి. తన పార్టీలో తాను తప్ప ఇంకెవరూ తనను మించి ఉండరాదని ఆయన సిద్ధాంతం. తన సిద్ధాంతం అమలు చేయడానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయరు. అడ్డం వచ్చినవారిని పార్టీ నుండి తన్ని తగలేసయినా మాట (ఆదేలెండి, సిద్ధాంతం!) నెగ్గించుకుంటారు. ఒక వైకాపా నేత దీనికి వివరణ ఇచ్చారు కూడా. ఏమిటంటే పార్టీ నేత మదిలో ఉన్న ప్రజా పధకాలు సక్రమంగా సామాన్యుడికి చేరాలంటే మధ్యలో ఇంకెవరూ ఉండగూడదట! కాబట్టి తమ నేత వ్యవహారశైలి సమర్ధనీయమే అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ మధ్య ఒక పెద్దాయన వైకాపాలో చేరారు. ఆయన ఆజానుబాహుడు. ఎవరైనా సరే, ఆయన్ని తలెత్తి చూడాల్సిందే. ఆయన పార్టీలో చేరిన శుభ ముహూర్తంలో చిన్న వేడుక జరిపినప్పుడు పార్టీనేత, ఆయనా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నాక ఒకరి పక్కన మరొకరు నిలబడ్డారు. చూసేవారికి పార్టీ అధినేత ఎలక పిల్లలా కనపడితే, కొత్తగా చేరినాయన అంబారీ ఏనుగులా కనిపించారు. ఈ పరిస్ధితి అధినేతకు ఎ మాత్రం నచ్చలేదు. వెంటనే ఆదేశాలు వెళ్ళాయిట. ‘తాను వేదిక మీద ఉండగా ఈ కొత్తగా చేరినాయన వేదిక మీదికి రాకూడదని.’ అధినేత పద్ధతి గిట్టని సబ్బం హరి బైటికి వచ్చాక పంచుకున్న నిజాల్లో ఇది ఒకటి మాత్రమే. సినీ నటుడు రాజ శేఖర్, చెల్లి షర్మిల తదితర నేతలంతా ఈ పద్ధతికి బాధితులే అని శ్రీమన్నారాయణులే (హరి) చెప్పారు.
కాబట్టి వైకాపా అధినేత నడిపే వాహనం కూడా ఆయనను మించి ఉండకూడదు. ఆయన కూర్చోడానికి సరిపోయినంత చోటు మాత్రమే, లేదా ఒక కుర్చీకి సరిపోయిన చోటు మాత్రమే ఆ వాహనంలో ఉండాలి. ఇక కుర్చీలు ఉండగూడదు. ఇంకెవరికీ ఆ కారు ఎక్కి పక్కన కూర్చునే ఛాన్స్ కూడా ఉండకూడదు. అధినేతకు (తనమీద తనకు) విశ్వాసం కలగాలంటే ఆ మాత్రం జాగ్రత్త తప్పదు మరి! ఎలాగూ రేప్పొద్దున ఆంధ్ర ప్రదేశ్ సి.ఎం అయ్యేది ఆయనే కదా! ఇది వై.కా.పా మార్కు ఆటో ఎక్స్ పో.
