ప్రత్యర్ధి దేశాల ఏజెంట్లను వలలో వేసుకోవడానికీ, టార్గెట్ లను లొంగదీసుకోవడానికి బ్రిటిష్ గూఢచారులు అనేక ‘డర్టీ ట్రిక్స్’ ప్రయోగిస్తారని ఎడ్వర్డ్ స్నోడెన్ పత్రాలు వెల్లడించాయి. అందమైన యువతులను ప్రయోగించి లైంగికంగా ఆకర్షించి వలలో వేసుకోవడం, సైబర్ దాడులతో ప్రత్యర్ధుల ఇంటర్నెట్ కార్యకలాపాలను రికార్డు చేసి బహిర్గతం చేయడం ద్వారా అప్రతిష్టపాలు చేస్తామని బెదిరించడం… ఈ డర్టీ ట్రిక్స్ లో కొన్ని. ప్రత్యర్ధి ఏజంట్లు, హ్యాకర్లు, అనుమానిత టెర్రరిస్టులు, ఆయుధ వ్యాపార డీలర్లు, ఇంకా అనేక ఇతర నేరస్ధులను బెదిరించి రిక్రూట్ చేసుకోవడానికి కూడా జి.సి.హెచ్.క్యు గూఢచారులు ‘డర్టీ ట్రిక్స్’ ప్రయోగిస్తారని స్నోడెన్ పత్రాల ద్వారా తెలుస్తోంది.
ప్రత్యర్ధి ఏజెంట్లను లొంగదీసుకుంటే డబుల్ ఏజెంట్లుగా మార్చుకోవచ్చు. హ్యాకర్లను లొంగదీసుకుంటే ప్రత్యర్ధి దేశాలపై తమకు మట్టి అంటకుండా ప్రభుత్వేతర సైబర్ దాడులు నిర్వహించవచ్చు. అనుమానిత టెర్రరిస్టులను రిక్రూట్ చేసుకుంటే తాము అనుకున్న చోట టెర్రరిస్టు దాడులు చేయించవచ్చు. అంటే టెర్రరిస్టు దాడులను అరికడతామని చెప్పుకునే గూఢచార సంస్ధలే వాస్తవంగా టెర్రరిస్టు దాడులకు మూలకర్తలుగా ఉండడం అన్నమాట! ఆయుధ డీలర్లను లొంగదీసుకుంటే ఆయుధ మార్కెట్ లో పై చేయి సాధించేందుకు తగిన సమాచారం పొందవచ్చు. ఇలా గూఢచార సంస్ధల రోజువారి కార్యకలాపాలు పచ్చి నేరస్ధుల సహాయంతోనే జరుగుతాయని స్నోడెన్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రక్షణ కోసం గూఢచర్యం తప్పనిసరి అని ఎవరన్నా నమ్ముతుంటే వారు తమ నమ్మకాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది.
అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి, సి.ఐ.ఏ మాజీ కాంట్రాక్టర్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ గత మే నెలలో పెద్ద మొత్తంలో అమెరికా గూఢచార పత్రాలను లీక్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు గూఢచర్యం వహించే ‘ఫైవ్ ఐస్’ దేశాల్లో బ్రిటన్ ఒకటి. (మిగిలిన దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్). జి.సి.హెచ్.క్యు ఒక్కోసారి ఎన్.ఎస్.ఏ ను మించిన సాంకేతిక ప్రతిభను కనబరిచిందని తాజాగా ఎన్.బి.సి న్యూస్ ప్రచురించిన స్నోడెన్ పత్రాల ద్వారా తెలుస్తోంది.
జి.సి.హెచ్.క్యులో భాగమైన ‘జాయింట్ థ్రెట్ రీసర్చ్ అండ్ ఇంటలిజెన్స్ గ్రూప్’ (JTRIG) అనుసరించే వ్యూహాల సమాచారాన్ని ఎన్.బి.సి న్యూస్ శుక్రవారం (ఫిబ్రవరి 7) ప్రచురించింది. ఈ విభాగం పని ప్రత్యర్ధులను “నాశనం చేయడం, నిరాకరించడం, పరువు తీయడం మరియు ఆటంకపరచడం” గా అభివర్ణించబడిందని ఎన్.బి.సి తెలిపింది. JTRIG కార్యకలాపాలను తెలియజేసే 2010, 2012 నాటి పవర్ పాయింట్ స్లయిడ్ లను తాము చూశామని ఎన్.బి.సి తెలిపింది. ప్రత్యర్ధులుగా భావించేవారిపై తప్పుడు సమాచారం వ్యాప్తిలో పెట్టడం ద్వారా, వారి కమ్యూనికేషన్లను హ్యాక్ చెయ్యడం ద్వారా తమ మిషన్ పూర్తి చేయడం JTRIG అనుసరించే వ్యూహం అని ఈ స్లయిడ్ లు తెలిపాయి.
కాబట్టి ప్రత్యర్ధి దేశాలపై పశ్చిమ వార్తా సంస్ధలు ప్రచారం చేసే ప్రతికూల వార్తాకధనాలను విశ్వసించాల్సిన అవసరం లేదన్నమాట! రష్యా, చైనా లపై పై చేయి సాధించడానికి సిరియా, లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ తదితర దేశాలలో సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలకు సదుద్దేశ్యం అంటగట్టడానికీ పశ్చిమ పత్రికలు రాంత్రింబవళ్ళు ప్రచారం చేసిన వార్తా కధనాలు పలువిధాలుగా సహాయపడ్డాయన్నది ఇప్పుడు జగమెరిగిన సత్యం.
ప్రత్యర్ధులపై దాడులకు జి.సి.హెచ్.క్యు అనుసరించే రెండు ప్రధాన ప్రధాన అఫెన్సివ్ ఎత్తుగడలు: సైబర్ ఆపరేషన్లు, ప్రచార వ్యూహాలు. ప్రచార వ్యూహాల్లో పెద్ద మొత్తంలో సందేశాలు పంపడం దగ్గర్నుండి సోషల్ మీడియాల్లో తప్పుడు కధనాలు ప్రవేశపెట్టడం వరకు ఉన్నాయి. ట్విట్టర్, ఫ్లికర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ లాంటి సోషల్ మీడియాలు ఈ తప్పుడు కధనాలకు వేదికలు.
సైబర్ దాడుల్లో జి.సి.హెచ్.క్యు తరచుగా ఎంచుకునే మార్గం DDoS (Distributed Denial of Attacks) దాడులు. హ్యాకర్ల దాడుల వలన ఫలానా ప్రభుత్వ వెబ్ సైట్లు పని చేయలేదని, మామూలుగా కనిపించే వెబ్ సైట్ స్ధానంలో ‘ఈ వెబ్ సైట్ ను మేము హ్యాక్ చేశాం’ అన్న సందేశాలు కనిపించాయని పత్రికలు అప్పుడప్పుడూ చెప్పడం తెలిసిన సంగతే. దీనికి కారణం ఫలానా ఏనోనిమస్ అనే హ్యాకర్ సంస్ధ అనీ అవి చెబుతుంటాయి. అయితే నిజానికి ఇలాంటి దాడులు ప్రభుత్వ గూఢచార సంస్ధలు కూడా చేస్తాయని స్నోడెన్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాపితంగా ఉన్న మిలియన్ల కొద్దీ కంప్యూటర్లను తమ అదుపులోకి తీసుకుని వాటి ద్వారా తాము హ్యాక్ చేయదలుచుకున్న వెబ్ సైట్ కి ట్రాఫిక్ వెళ్ళేలా చేస్తారు. దానితో ట్రాఫిక్ వెల్లువెత్తడంతో మామూలు సందర్శకులకు ఆ వెబ్ సైట్ కి వెళ్ళడం కష్టం అవుతుంది. దీనినే DDoS దాడి అంటారు. ఈ దాడి వలన నిర్దిష్ట కాలం పాటు ఆయా వెబ్ సైట్ లు అందుబాటులో లేకుండా పోతాయి.
అయితే DDoS దాడులు నిర్వహించేందుకు జి.సి.హెచ్.క్యు కు చట్టబద్ధమైన అనుమతి ఉంటుందా? లేదని నిపుణులు చెబుతున్నారు. అనగా జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ దాడులకు జి.సి.హెచ్.క్యూ పాల్పడుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ఐ.టి చట్టం బోధించే ఎరిక్ కింగ్ ఈ విషయమే చెబుతున్నారు. స్పష్టమైన చట్టబద్ధమైన అనుమతి లేకుండా జి.సి.హెచ్.క్యు ఈ దాడులకు పాల్పడడం ఖండనార్హం అనీ, ఇతర దేశాలు చేసే దాడులను బ్రిటిష్ ప్రభుత్వం విమర్శిస్తుంటే జి.సి.హెచ్.క్యు ఈ దాడులకు ఎలా పాల్పడుతుందని ఆయన ప్రశ్నించారాని ఎన్.బి.సి న్యూస్ తెలిపింది.
“వైరస్ పంపడానికి గానీ, సైబర్ దాడులు చెయ్యడానికి గానీ జి.సి.హెచ్.క్యుకు స్పష్టమైన అధికారం లేదు… గూఢచర్యంలో ఈ హ్యాకింగ్ అనేది అత్యంత దురాక్రమణ పూర్వక దాడులివి” అని ఎరిక్ కింగ్ స్పష్టం చేశారు. అమెరికా గూఢచారుల కంటే బ్రిటిష్ గూఢచారులు ఈ సైబర్ దాడుల విషయంలో ఒక మెట్టు పైన ఉన్నారని JTRIG స్లైడ్ల ద్వారా తెలుస్తోందని ఎన్.బి.సి తెలిపింది.
‘రాయల్ కన్సీర్జ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా విదేశీ రాయబారులు తమకు అనుకూలమైన హోటళ్ళలో బస చేసేలా చూడడం జి.సి.హెచ్.క్యు అనుసరించే ఎత్తుగడల్లో ఒకటి. హోటల్ రిజర్వేషన్ సిస్టంలలోకి హ్యాకింగ్ ద్వారా చొరబడి టార్గెట్ రాయబారులు ఎక్కడ బస చేయబోతున్నదీ తెలుసుకుంటారు. తద్వారా వారి ప్రాబబుల్ లొకేషన్ ల గురించి గూఢచార విశ్లేషకులకు క్రమం అలర్ట్ లు జారీ చేస్తారు. అనంతరం రాయల్ కన్సీర్జ్ ప్రోగ్రామ్ రంగంలోకి దిగి విదేశీ రాయబారులు తమకు అనుకూలమైన హోటళ్లలో (తమ గూడచార ప్రోగ్రాంలు పని చేసే హోటల్స్) బస చేసేలా ఆయా తేదీలను, ఖాళీలను తారుమారు (manipulate) చేస్తారు. అంతిమంగా తమ లక్ష్యిత హోటల్ లోనే బస చేసేలా తగిన సూచనలు చేరవేసి లక్ష్యం సాధిస్తారు.
ప్రత్యర్ధి గూఢచారులకు ఆయా జర్నలిస్టులు తప్పుడు గూఢచార సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవడం మరో ఎత్తుగడ. దీనిని ‘credential harvesting’ అని JTRIG స్లైడ్లు పేర్కొన్నాయి. ఇందులో జర్నలిస్టులు తెలిసి చేస్తారా లేక తెలియక చేస్తారా అనేది స్పష్టం కాలేదు. మొత్తం మీద తమకు అనుకూలమైన సమాచారం ప్రత్యర్ధి గూఢచారులకు చేరేలా జాగ్రత్త తీసుకుంటారు. తద్వారా ప్రత్యర్ధుల కార్యకలాపాలను తమ నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. దీని ఫలితంగా గూఢచార సంస్ధల కోసమే పని చేస్తున్నారన్న అపప్రధను జర్నలిస్టులు ఎదుర్కోక తప్పదు. అది నిజమూ కావచ్చు, అబద్ధమూ కావచ్చు.
