మొదటి వేటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పైనే పడింది. సి.ఎం అరవింద్ ఆదేశం అందుకున్న రోజే ఢిల్లీ ఎ.సి.బి రంగంలోకి దిగింది. వీధి దీపాల కుంభకోణంలో మాజీ సి.ఎం షీలా దీక్షిత్ పై ఎ.సి.బి, ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. 2010లో కామన్వెల్త్ ఆటల పోటీలు ఢిల్లీలో జరిగిన సందర్భంగా చేపట్టిన వీధి దీపాల నిర్మాణం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని షుంగ్లు కమిటీ తేల్చింది. కమిటీ పరిశీలనలను షీలా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణకు మార్గం ఏర్పడింది.
అవినీతి నిరోధక చట్టం, ఐ.పి.సి లోని ఇతర సెక్షన్ల కింద ఏ.సి.బి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పట్టణాబివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ దాఖలయింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, అప్పటి కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ లు కలిసి ప్రజాపనుల విభాగం అధికారులతోనూ, పౌర సంస్ధలు, కాంట్రాక్టర్లు, సరఫరాదారులు మొ.వారితో కుమ్మక్కై సొంత ప్రయోజనాలు నెరవేర్చుకున్నారని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు 31.07 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పట్టణాభివృద్ధి శాఖ తన ఫిర్యాదులో ఆరోపించింది.
వీధి దీపాల ప్రాజెక్టుపైన షీలా దీక్షిత్ అసాధారణ ఆసక్తి కనబరచారని, ఈ ప్రాజెక్టుకు పనికిరాదని గతంలో తేల్చిన కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వడానికి మొగ్గు చూపారని, తద్వారా వ్యక్తిగత లబ్ది పొందారని ఫిర్యాదు ఆరోపించింది. “అప్పటి ముఖ్యమంత్రి/మంత్రులు మరియు అధికారులు కొందరు సరఫరాదారులతో కుమ్మక్కు అయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. ఫలితంగా ప్రభుత్వానికి భారీగా ఆర్ధిక నష్టం జరిగింది. కాంట్రాక్టర్లు/సరఫరాదారులు తప్పుడు పద్ధతుల్లో లాభం పొందారు” అని ఫిర్యాదులో పేర్కొన్నారని ది హిందు తెలిపింది.
గతంలో ఈ కేసులో సి.బి.ఐ, సి.వి.సి (సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్) తదితర కేంద్ర సంస్ధలు విచారణ చేయడం విశేషం. ఈ రెండే కాకుండా పలు ఇతర సంస్ధలు కూడా విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ విచారణలన్నీ కేవలం కంటితుడుపుగా మాత్రమే విచారణ జరిపాయని, ఎటువంటి తార్కికమైన, అర్ధవంతమైన ముంగింపు లేకుండానే సదరు విచారణలు ముగిశాయని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జరిగిన అక్రమాలపై చట్టబద్ధ సంస్ధలు ఏ చర్యా తీసుకోకపోవడాన్ని బట్టి కేవలం జనం కోసం మాత్రమే విచారణ ప్రహసనాన్ని నడిపారని ఆరోపించింది. దోషులను పట్టుకుని శిక్షించే ఉద్దేశ్యమే వారికి లేదని తెలిపింది.
వీధి దీపాల ప్రాజెక్టుకు సంబంధించి అనేక రికార్డులు, నివేదికలు పరిశీలించామని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. సంబంధిత దస్త్రాలు, పత్రాలు, టెండర్లు, కాగ్ నివేదికలు, షుంగ్లు కమిటీ నివేదికలు మొదలయిన రికార్డులను పరిశీలించామని, ముఖ్యమంత్రి షీలా, ఆమె కేబినెట్ సహచరులు, అధికారులు, సరఫరాదారులు అందరూ తమకు తాము అక్రమ లబ్ది చేకూర్చుకోవడానికి కుమ్మక్కు అయ్యారని తమ పరిశీలనలో తేలిందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ దీపాలను దిగుమతి చేసుకోవలసిన అవసరం లేకపోయినప్పటికీ దిగుమతి చేసుకున్నారని, ఈ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది.
రెడ్ లైట్ ఏరియాల జోలికి పోని ఎఎపి
నైజీరియా, ఉగాండాలకు చెందిన వ్యక్తులు ఖిర్కి ఏరియాలో వ్యభిచారం, డ్రగ్స్ ర్యాకెట్ నిర్వహిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారని హడావుడి చేసిన ఎఎపి దేశీయ వ్యభిచారం జోలికి పోలేదని ది హిందు జరిపిన ఎంక్వైరీలో తేలింది. అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాగా పరిగణించబడే గర్సిన్ బాషన్ రోడ్ లో ఇప్పటికీ వ్యభిచారం వర్ధిల్లుతున్నప్పటికీ ఎఎపి కార్యకర్తలు గానీ నాయకులు గానీ ఆ ఏరియా జోలికి పోలేదు. ఢిల్లీ లోని ఇతర ప్రాంతాల్లో -రోహిణి, సంగం విహార్, తుఘ్లకాబాద్ మొ.వి- కూడా లైంగిక సేవలు కోరేవారు, అందించేవారు బహిరంగంగానే కార్యకలాపాలు సాగిస్తున్నా వారి జోలికి ఇంతవరకు ఎవరూ వెళ్లలేదు.
ఢిల్లీలో సెక్స్ ట్రాఫికింగ్ ను అంతం చేస్తామని, ప్రత్యామ్నాయ పనులు కల్పిస్తామని ఎఎపి వాగ్దానం చేసింది. అయితే ఇంతవరకూ ఎఎపి కార్యకర్తలు గానీ, ప్రభుత్వం గానీ తమ ఏరియాలకు రాలేదని సెక్స్ వర్కర్లు, మధ్యవర్తులు, చివరికి పోలీసులు కూడా చెప్పడం విశేషం. ఏరియాను బట్టీ, లైంగిక సేవను బట్టి రు. 100 నుండి రు. 5000 వరకూ వసూలు చేసే లైంగిక వ్యాపారానికి స్ధానిక పత్రికలు కూడా సహకరిస్తాయని తెలుస్తోంది. ఎస్కార్ట్ సేవలని, మరో సేవలని చెబుతూ ప్రకటనలను అవి ప్రచురిస్తాయి. కొన్ని పత్రికలైతే నేరుగానే వ్యభిచారం గురించి పబ్లిసిటీ ఇస్తాయని అయినా ఎఎపి ఇంతవరకు ఆయా చోట్లకు అడుగు పెట్టలేదని ది హిందు తెలిపింది.
“ఎఎపి? ఏ ఎఎపి? ఏ పార్టీ నుంచి ఎవరూ ఇక్కడికి రారు. అప్పుడప్పుడూ పోలీసులు రైడింగ్ చేస్తారు. మమ్మల్ని అరెస్టు చేస్తారు. ఆనక డబ్బులు తీసుకుని వదిలేస్తారు” అని ఒక మధ్య వర్తి (pimp) చెప్పారని ది హిందు తెలిపింది. “సెక్స్ వర్కర్లను కలవడానికి కొన్ని ఎన్.జి.ఓ ల నుండి కొంతమంది వస్తుంటారు. కానీ ఎఎపి నుండి ఎవ్వరూ రావడం నేనింతవరకు చూడలేదు. ఒకవేళ ఎవరన్నా వచ్చినా ఇక్కడి లైంగిక వ్యాపారాన్ని ఆపడం ఎవరివల్లా కాదు” అని మరొకరు చెప్పారని పత్రిక తెలిపింది. సెక్స్ ట్రాఫికింగ్, మహిళల ట్రాఫికింగ్ తదితర నేరాల విషయంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు బాధ్యతగా వ్యవహరించలేదని ఎన్.జి.ఓ సంస్ధలు కూడా చెప్పడం విశేషం.
ఈ వార్తపై ఎఎపి ఎలా స్పందిస్తుందో చూడాలి.

చాల విషయాలలో ఏఏపి వారి చర్యలు బాగానేఉన్నయి.
కొచెన్ ఓపిక పడితె దేశీయ వ్యభిచారం సంగతి కూడా వాళ్ళు చూదవచ్చు అని అనుకుంటున్నా.