ఒకటిన్నర దశాబ్దం క్రితం ‘లుక్ ఈస్ట్’ విధానం ప్రకటించి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పిన భారత పాలకులు ఇప్పుడు వెనక్కి కూడా చూపు తిప్పినట్లు కనిపిస్తోంది. నమీబియాలో పర్యటిస్తున్న భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ 100 మిలియన్ డాలర్ల (రు. 620 కోట్లు) కొనుగోలు రుణం ఆ దేశానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. Buyer’s credit గా పేర్కొనే ఈ రుణం ద్వారా నమీబియా, ఇండియా నుండి దిగుమతులు చేసుకోవడానికి ప్రోత్సహించడం భారత్ లక్ష్యం. దానితో పాటు SACU, MERCOSUR కూటములతో త్రైపాక్షిక ‘ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందం’ (Preferential Trading Agreement -పి.టి.ఎ) కుదుర్చుకోవాలని ఇండియా ఆశీస్తోంది.
SACU అంటే South Africa Customs Union అని అర్ధం. ఈ కూటమిలో నమీబియా, బోట్స్ వానా, లెసోతో, సౌత్ ఆఫ్రికా, స్వాజీ లాండ్ లు సభ్య దేశాలు. SACU కూటమితో జరుగుతున్న పి.టి.ఎ చర్చలను త్వరగా ముగించడానికి ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చామని వాణిజ్య మంత్రి ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా SACU, ఇండియాల మధ్య జరిగే వాణిజ్యంలో కొన్ని సరుకులపై సుంకాలను తగ్గించుకోవడం ఇరు పక్షాల లక్ష్యం. నమీబియా వాణిజ్య మంత్రి కారల్ హెచ్.జి.ష్లెట్విన్, భారత మంత్రి ఆనంద్ శర్మ ల మధ్య పి.టి.ఎ విషయమై చర్చలు జరిగినట్లు ది హిందు తెలిపింది.
నమీబియాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆనంద్ శర్మ చర్చలు త్వరగా ముగించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు ప్రకటించారు. “ఇండియా-SACU ల పి.టి.ఎ చర్చల పురోగతి గురించి ఇరు దేశాల మంత్రులు చర్చించారు. వీటిని త్వరగా ముగించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ చర్చలు పూర్తయితేనే ఇండియా-SACU-MERCOSUR త్రైపాక్షిక చర్చలు పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది” అని భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది.
MERCOSUR అన్నది 5 లాటిన్ అమెరికా దేశాల రాజకీయ, వాణిజ్య కూటమి. ఈ పదబంధం స్పానిష్ భాషకు చెందినది. దీని అర్ధం ‘దక్షిణ ఉమ్మడి మార్కెట్’ అని అర్ధం. అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులాలు ఈ కూటమిలో సభ్య దేశాలు. బొలీవియా కూడా ఈ కూటమిలో చేరాలని నిర్ణయించింది. దానికి కూటమి అంగీకారం అయింది. బొలీవియా పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. ఆఫ్రికా దక్షిణ భాగంలోని 5 దేశాల కూటమి SACU తోనూ, దక్షిణ అమెరికా ఖండంలోని మరో 5 దేశాల కూటమి MERCOSUR తోనూ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఈ దేశాలకు తన ఎగుమతులు పెంచుకోవాలని ఇండియా ప్రయత్నిస్తోంది.
భారత పాలకులు ‘లుక్ ఈస్ట్’ విధానం ద్వారా ఆసియా మీదుగా పశ్చిమ దేశాలతో దగ్గరి సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను కాస్త మెరుగుపరుచుకున్న ఇండియా ఇటీవల కాలంలో ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంక్షోభం అనంతర కాలంలో పశ్చిమ దేశాల పెట్టుబడులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. అస్ధిరమైన విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (FII) తప్ప విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మన పాలకులు ఆశించినంతగా ఏమీ ప్రవాహం కట్టలేదు. ఆర్ధిక మాంద్యం, ఋణ సంక్షోభం, నిరుద్యోగం తదితర సమస్యలతో తీసుకుంటున్న పశ్చిమ దేశాలు పెట్టుబడులు తేవడానికి బదులు భారత వనరులను కొల్లగొట్టడానికే ఎక్కువ ఆసక్తి ప్రదర్శించాయి. ఎంతో అట్టహాసంగా అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం సైతం ఆశించిన ప్రయోజనాలు భారత పాలకులు సాధించలేదు.
ఈ నేపధ్యంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి భారత పాలకులు చొరవ ప్రదర్శిస్తున్నారు. అమెరికా, ఐరోపాల ఆర్ధిక మాంద్యం వలన భారత ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. వాణిజ్య మంత్రి చెబుతున్న త్రైపాక్షిక పి.టి.ఏ ఒప్పందం సాకారం అయితే ఆ మేరకు భారత ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఒకవైపు తగ్గిపోతున్న ఎగుమతులను మరోవైపు పెంచుకునే అవకాశం వస్తుంది.
కానీ ఇండియా నుంచి వెళ్ళే ఎగుమతులన్నీ ‘భారతీయ’ కంపెనీలవే అయి ఉండాల్సిన అవసరం లేదు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల ఫలితంగా పశ్చిమ దేశాలకు చెందిన మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఇండియాలో అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భారత కంపెనీల్లో ప్రతి ఒక్కటీ ఏదో ఒక విదేశీ కంపెనీతో జాయింట్ వెంచర్లు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో విదేశీ కంపెనీల బహిరంగ వాటా ఎంతయినప్పటికీ అంతర్గతంగా పెత్తనం వారి చేతుల్లోనే ఉంటుంది. అనగా భారత ఎగుమతుల ద్వారా లబ్ది పొందేది ప్రధానంగా విదేశీ ద్రవ్య పెట్టుబడులు మరియు మాన్యుఫాక్చరింగ్ (అసెంబ్లీ) పెట్టుబడులే. ఉదాహరణకి వేదాంత రిసోర్సెస్ కంపెనీ త్రైపాక్షిక పి.టి.ఏ లబ్దిదారుల్లో ఒకరు. దీనిని భారత కంపెనీగా పత్రికలు ‘ఈ సందర్భంగా’ చెబుతున్నాయి. నిజానికది బ్రిటన్ కు చెందిన బహుళజాతి కంపెనీ.
అందువలన భారత ప్రభుత్వం నమీబియాకు ప్రకటించిన 100 మిలియన్ డాలర్ల కొనుగోలు రుణం వల్ల భారత ఎగుమతులు పెరిగేది నిజమే అయినా లబ్దిదారులు మాత్రం ‘భారతీయ’ కంపెనీలే కానవసరం లేదు. 2009లో నమీబియా అధ్యక్షుడు ఇండియా పర్యటించినప్పుడే 100 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇండియా ఇవ్వజూపింది. ఇప్పుడు ప్రకటించింది దానికి అదనం. ఈ కొనుగోలు రుణాలను భారత ఎక్సిం బ్యాంక్ (Export-Import Bank) ఇస్తుంది.
సాధారణంగా వాణిజ్య ఒప్పందాలలో ఎఫ్.టి.ఎ (Free Trade Agreement) అనేది ఎక్కువగా వినిపిస్తుంది. పి.టి.ఎ దీనికి భిన్నం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ఇరు పక్షాల మధ్య జరిగే వాణిజ్యంలో సుంకాలు తగ్గించడం గానీ, పూర్తిగా ఎత్తివేయడం గానీ చేస్తారు. పి.టి.ఎ ఒప్పందంలో పూర్తిగా సుంకాలు ఎత్తివేయకపోవచ్చు. ఈ ఒప్పందంలో భాగస్వాములు కాని దేశాలతో పోలిస్తే భాగస్వామ్య దేశాల సరుకులపై సుంకాలను తగ్గిస్తారు. అనగా తక్కువ సుంకాలు విధించడం ద్వారా ఆ దేశాల సరుకులకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఇది ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందం.
నమీబియాకు భారత్ ఎగుమతి చేసే సరుకులు ఔషధాలు, రసాయనాలు, రవాణా పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్రాసెస్ చేసిన సరుకులు, లోహాలు, బియ్యం, మెరైన్ ఉత్పత్తులు, ప్లాస్టిక్, మాంసం. వీటిలో ఔషధాలు, బియ్యం, మాంసం తప్ప మిగిలినవన్నీ విదేశీ కంపెనీల భారతీయ కార్యకలాపాలతో ముడిపడినవే. నమీబియా నుండి ఇండియా దిగుమతి చేసుకునే సరుకులు ముడి ఖనిజాలు, తుక్కు లోహాలు, విలువైన రాళ్ళు, క్రూడాయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు.
తాము నేరుగా ప్రవేశించలేని కొన్ని లాటిన్ అమెరికా దేశాలలోకి ఇండియా ద్వారా ప్రవేశించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వెనిజులా, బొలీవియాలు ఈ కోవలోని దేశాలు.
