‘మూడో కూటమి’ అను ఓ ప్రహసనం -కార్టూన్లు


భారత దేశంలో గిరాకీ లేని ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు కలిసి అప్పుడప్పుడూ చేసే తాటాకు చప్పుళ్లను ‘మూడో కూటమి’ అని పిలుస్తుంటారు. ఈ చప్పుళ్ళు ఎక్కువగా సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందే వినబడతాయి. ఎన్నికలు ముగిస్తే చాలు, అవిక వినపడవు. ఖర్మ కాలి కాంగ్రెస్ కూటమి (ఒకటో కూటమి?), బి.జె.పి కూటమి (రెండో?) లకు ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోయినా లేదా ఈ మూడో కూటమి బ్యాచ్ లోని పార్టీలు మొదటి, రెండవ కూటమిలలో ఇమడలేని పరిస్ధితులు వచ్చినా ఎన్నికల తర్వాత కూడా ఈ చప్పుళ్ళు వినాల్సిన అగత్యం వచ్చిపడుతుంది.

మూడో కూటమి చప్పుళ్ళు తాటాకు చప్పుళ్లని, అదంతా పైన పటారం, లోన లొటారం మాత్రమే అనీ జనానికి ఇప్పుడు బాగానే అర్ధం అయింది. జనానికి అర్ధమైన సంగతి ఈ ధర్డ్ ఫ్రంట్ బ్యాచ్ కి కూడా అర్ధమైపోయింది. అందుకని వాళ్ళు తమని తాము ధర్డ్ ఫ్రంట్ అని పిలవడానికి తామే మొహమాటపడిపోతున్నారు. దానితో పార్లమెంటులో తాము ఒక గ్రూప్ గా సమన్వయంతో మాత్రమే వ్యవహరిస్తామని ‘మూడో ఫ్రంట్’ అని అప్పుడే పిలవొద్దని ఆ పార్టీలు కోరుతున్నాయి. తమని ‘ధర్డ్ ఫ్రంట్’ అనొద్దని వారు కోరుతున్నప్పటికీ వారి లక్ష్యం మాత్రం అదే అని వారి మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

రెండు రోజుల క్రితం ఓ 11 పార్టీలు పత్రికల ముందుకు వచ్చి తాము పార్లమెంటులో ఉమ్మడి వ్యూహంతో వ్యవహరించబోతున్నట్లు చెప్పాయి. ఇది పార్లమెంటులో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి మాత్రమే ఉద్దేశించిన వ్యూహం అని ‘ధర్డ్ ఫ్రంట్’ కాదని ముందే చెప్పుకున్నాయి. దాదాపు ఇదే ప్రకటన వీళ్ళు గత అక్టోబర్ లో కూడా చేశారు. కానీ వాళ్ళు ఉమ్మడిగా వ్యవహరించారో లేదో తెలియదు. వారి వ్యూహం అలా ఉంది. ఈసారి సమావేశాల్లో ఏం చేయనున్నారో ఇప్పటిదాకా జరిగిన రెండు రోజుల పార్లమెంటు సమావేశాల్లో తేలింది లేదు. సభ స్తంభించి ఉన్న పరిస్ధితుల్లో ఏ బిల్లూ ఆమోదం పొందకుండా చూస్తామని యేచూరి గారు చెప్పారు. అందువల్ల జనానికి ఏం ప్రయోజనమో ఆయన వివరించలేదు.

ఈ 11 పార్టీల జాబితా చూస్తే నవ్వుకోవడమే తరువాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి, ఫార్వర్డ్ బ్లాక్, సమాజ్ వాదీ పార్టీ, జనతా దళ్ (యు), ఎ.ఐ.ఎ.డి.ఎం.కె, అస్సాం గణ పరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చా, జనతా దళ్ (ఎస్), బిజూ జనతా దళ్. వీటిలో ఎస్.పి, జె.డి(యు), ఎ.ఐ.ఎ.డి.ఎం.కె, బిజూ జనతా దళ్ లు 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీరు ప్రభుత్వ వ్యతిరేక (anti-incumbancy) గాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అదీ కాక ఎస్.పి ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో ఉంది. కాకపోతే బైటి నుంచి మద్దతు అంటోంది. జె.డి(యు) ఎన్.డి.ఎ నుండి బైటికి వచ్చిన పార్టీ.

అంతే కాకుండా ఈ పార్టీల నేతలు ఎవరికి వారు ప్రధాని కావాలని ఆశిస్తున్నారు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె నేత జయలలిత ప్రధానిగా చూడాలని ఆ పార్టీ కార్యకర్తల ఆశగా వారి నాయకులు చెబుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంకా పైకి చెప్పలేదు గానీ ఆయనకీ ఆశలు ఉన్నాయని పత్రికలు చెబుతుంటాయి. బీహార్, తమిళనాడు కంటే తమ రాష్ట్రం నుండే ఎక్కువమంది ఎం.పిలు పార్లమెంటుకు వస్తారని ఎస్.పి నేత ములాయం నర్మగర్భంగా చెబుతున్నారు. తన కొడుకును యు.పి సి.ఎం గా చేసిందే పి.ఎం పదవి కోసం అని చెప్పేవారికి కొదవలేదు. ఇక జె.డి(ఎస్) నేత దేవే గౌడ ఆల్రెడీ ప్రధానిగా పని చేశారు. రేపు ఆయన ‘నేను అనుభవజ్ఞుడిని’ అన్నా అనొచ్చు.

అందుకే ధర్డ్ ఫ్రంట్ ని కార్టూనిస్టు కేశవ్ కాళ్ళు లేని ఏనుగుగా చూపారు. బహుశా ‘బోయీలు లేని పల్లకి’ కి మరో రూపం గావాల్ను. ఏనుగు అంబారీ పైన ఎన్ని కుర్చీలు ఉన్నాయో చూడండి. ధర్డ్ ఫ్రంట్ సాకారం కావాలంటే అన్ని ప్రధాన మంత్రి పదవులు ఉండాలని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఇంతా చేసి ఈ ఏనుగు నడవదు. అది నడవడానికి కాళ్ళు లేవు. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన సీట్లు ధర్డ్ ఫ్రంట్ కి రావని సూచన. ప్రమాదవశాత్తూ వచ్చినా అది కూలిపోవడమో, కూల్చబడడమో జరగడానికి ఎన్నో రోజులు పట్టదని వారి ఆశలు, ఆకాంక్షలను బట్టి ఇట్టే గ్రహించవచ్చు.

Third front 1

ఇక సురేంద్ర గారయితే ధర్డ్ ఫ్రంట్ ని మరో కోణంలో ‘చెక్కారు.’ అందరికన్నా ముందు ములాయం గారు రాతి దిమ్మె పైకి చేరుకుని తలవరకు చెక్కేశారు. యు.పి నుండే ఎక్కువమంది ఎం.పిలు వస్తారని అన్నారు గదా ఆయన! జయలలిత ఒకవైపు నుండి నరుక్కొస్తుంటే, లెఫ్ట్ పార్టీలు మరోవైపు నుండి నరుక్కొస్తున్నారు. ఈ మూడు నరుకుళ్ళు ఒకే విగ్రహ రూపాన్ని ఇస్తాయని గ్యారంటీ లేకపోవడమే అసలు సమస్య. ఎవరి ఆశలు, ఆకాంక్షలు వారివి. అవి తెల్లారేలోపు ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కూడా ఏర్పడినా ఆశ్చర్యం లేదు.

Third front 2

వ్యాఖ్యానించండి