బైటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పైకి ఢిల్లీ ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వివిధ నిర్మాణాల్లోని అవినీతిని విచారించాలని రాష్ట్ర ఎ.సి.బిని ఆదేశించింది. సాధారణంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలను సంతృప్తిపరచడానికీ, వారు అలిగినప్పుడు ప్రసన్నం చేసుకోవడానికీ, వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి పాలక పార్టీలు నానా అగచాట్లు పడుతుంటాయి. కానీ ఎఎపి పార్టీ ఈ విషయంలోనూ ‘నేను తేడా’ అని చెబుతోంది.
2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో విస్తృతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీధి దీపాల ప్రాజెక్టులో షీలా దీక్షిత్ తీసుకున్న నిర్ణయాలను ప్రధాన మంత్రి నియమించిన షుంగ్లు కమిటీ తప్పు పట్టింది కూడా. గత ప్రభుత్వాల అవినీతిపై విచారణ చేయిస్తామని ఎఎపి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఈ హామీని ఎఎపి తప్పిందని బి.జె.పి అదేపనిగా ఆరోపిస్తోంది. అవినీతి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినందునే విచారణ చేయించడం లేదని ప్రతి పక్ష నేత హర్ష వర్ధన్ వివిధ సందర్భాల్లో ఆరోపించారు. ఎ.సి.బి విచారణకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఇక బి.జె.పి కి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.
ఎ.సి.బి విచారణ ఎ ఒక్కరినీ ఉద్దేశించింది కాదని న్యాయ మంత్రి సోమనాధ్ భారతి చెప్పడం గమనార్హం. కామన్వెల్త్ గేమ్స్ ప్రాజెక్టుల్లోని అవినీతి కేసులన్నింటిపైనా ఎ.సి.బి విచారణ చేస్తుందని ఆయన చెప్పారు.
అయితే 2008 ఎన్నికలకు ముందు వేలాది అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేసిన అంశంలో షీలా దీక్షిత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫారసు చేయడం విశేషం. సరిగ్గా 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు షీలా ప్రభుత్వం 1218 అనధికారిక కాలనీలకు ప్రొవిజనల్ రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ లను జారీ చేసింది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో సోనియా గాంధీ ఈ పి.ఆర్.సిలను అందజేశారు. దీనిపై బి.జె.పి ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త విచారణ జరిపింది. ఇవి కాక మరో 1639 కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామని కూడా షీలా ప్రకటించారు.
లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరిన్ నవంబర్ 5, 2013 తేదీన పదవీ విరమణ చేస్తూ చివరి ఆదేశంగా బి.జె.పి నేత హర్ష వర్ధన్ చేసిన ఫిర్యాదును స్వీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేశారని లోకాయుక్త అభిశంసించింది. లోకాయుక్త పరిశీలనపై అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్రపతి ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి బదులిస్తూ షీలాపై ‘సాధ్యమైనంత కఠినమైన చర్య’ తీసుకోవాలని ఎఎపి ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇక్ రాష్ట్రపతి ఏ చర్య తీసుకుంటారో చూడాలి.
కానీ అనధికార కాలనీల రెగ్యులరైజేషన్ వల్ల ప్రజలకు లబ్ది చేకూరినట్లయితే ఎఎపి నిర్ణయం ప్రజలకు వ్యతిరేకం అవుతుంది. అలా కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీల లబ్ది కోసం ఈ పి.ఆర్.సి ల నాటకం ఆడినట్లయితే చర్య తీసుకోవడంలో తప్పు ఉండబోదు.
ఎఎపి అవినీతి వ్యతిరేక బ్రాండు ద్వారా లబ్ది పొందుదామని భావించిన కాంగ్రెస్ కి తన ఎత్తుగడ తనకే ఎదురు తిరుగుతోందని గ్రహించి ఉండాలి.
ఇదిలా ఉండగా అనీల్ అంబానీ కి చెందిన డిస్కమ్ లకు ఊరట ఇవ్వడానికి విద్యుత్ ట్రిబ్యూనల్ నిరాకరించింది. ఎన్.టి.పి.సి కి చెల్లింపులు చేయకపోవడంతో బి.వై.పి.ఎల్, బి.ఆర్.పి.ఎల్ కంపెనీలకు ఫిబ్రవరి 10 నుండి విద్యుత్ సరఫరా చేయబోమని ఎన్.టి.పి.సి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ వద్ద డబ్బు లేనందున విద్యుత్ కోతలు విధిస్తామని డిస్కంలు ప్రకటించాయి. దానితో సదరు డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్ధ (డి.ఈ.ఆర్.సి) కి లేఖ రాసింది.
ఈ నేపధ్యంలో విచారణకు హాజరు కావాలని డి.ఇ.ఆర్.సి బి.వై.పి.ఎల్, బి.ఆర్.పి.ఎల్ లను కోరింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా డిస్కంలు విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాయి. డి.ఇ.ఆర్.సి హియరింగ్ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరాయి. ఈ విజ్ఞప్తిని ట్రిబ్యూనల్ తిరస్కరించింది. విచారణ కొనసాగించాలని డి.ఇ.ఆర్.సి ని కోరింది. అయితే అంతిమ నిర్ణయం ఇచ్చే ముందు తన అనుమతి తీసుకోవాలని డి.ఇ.ఆర్.సి ని కోరింది. ఈ రోజే (ఫిబ్రవరి 6) విచారణ జరగవలసి ఉంది.

Super….. jai ho AAP….