పసి పిల్లల చేష్టలని ఇష్టపడని వారు ఎవరుంటారు? పిల్లలు ఎదుగుతుండగా వారి ప్రతి కదలికనీ, ప్రతి చేష్టనీ శాశ్వతంగా రికార్డు చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుంది. ఆస్ధాన ఫోటోగ్రాఫర్ లాగా కుటుంబ ఫోటోగ్రాఫర్ అంటూ ఎవరిని పెట్టుకోలేం గనక పిల్లలకు సంబంధించిన కొన్ని కోరికలు తీరే మార్గం ఉండదు.
కానీ అమ్మే ఫోటో గ్రాఫర్ అయితే? ఈ ఫోటోలు తీసింది రష్యన్ అమ్మ ఎలెనా షుమిలోవా. ఈమె ఫోటోలు తీయడం మొదలు పెట్టి సంవత్సరమే అయిందిట! కానీ ఈ ఫోటోలు చూస్తే అలా అనిపించదు. ఫొటోల్లో ఉన్న ఇద్దరు మగ పిల్లలూ ఎలెనా పిల్లలే. వారు పొద్దున్నే నిద్ర లేచింది మొదలుకుని రాత్రి నిద్రలోకి జారుకునే వరకూ ముద్దొచ్చే వారి కదలికలను ఒడిసి పట్టుకునే అపురూపమైన అవకాశాన్ని షుమిలోవా దక్కించుకుంది.
కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అంటే పిల్లల్ని చూసుకోవడంలో అమ్మ చూపు ప్రత్యేకమైనదని కూడా అర్ధం. అమ్మ చూపు హృదయం లోంచి పుడుతుంది. హృదయం లోనించే కాదు. తన శరీరంలోని రక్త మాంసాలతో పుట్టినవాళ్లు గనక బహుశా అమ్మ శరీరంలోని ప్రతి కణమూ తన పిల్లలను చూస్తూ ఉండి ఉండాలి. అలాంటి చూపు ఇతరులకు ఎవ్వరికీ ఉండదు. ఆ అమ్మ చూపు ఈ ఫొటోల్లో కొట్టొచ్చినట్లు కనిపించడం మనం గమనించవచ్చు.
తన సైజంత ఉన్న కుక్క నేస్తం పక్కన వెనక్కి తిరిగి దర్జాగా నిలబడినా, పిల్లి కూనతో కలిసి మంచు దిబ్బల్ని తొలగించడానికి బయలుదేరినా, కుందేలు పిల్లని మురిపెంగా ఎత్తుకుని ఆడించినా, బాతు నేస్తాలతో కలిసి షికారుకు వెళ్ళినా, అందని ఎత్తులో ఉన్న పిల్లి గారిని కిందకు దిగాలని బతిమిలాడినా, ఏదో పనున్నట్లు కుక్కతో కలిసి సీరియస్ గా వెళుతున్నా, బొమ్మని ఒడిలో పెట్టుకుని నిద్రలోకి జారుకున్నా… ఇవన్నీ అమ్మ కంటితో చూస్తే మనం దర్శించగలిగే సౌందర్యం. చూడగలిగితే ఆ సౌందర్యమే వేరు.
ఫొటోల్లోని వివిధ వస్తువులను, వెలుతురు, నీడలను ఈ ఫొటోల్లో మిశ్రమం చేసిన తీరు అద్భుతం. ఫోటోలు చూస్తుంటే మనం కూడా ఆ వస్తువులతో కలిసి పోయి ఫొటోల్లోని మూడ్ లోకి వెళ్ళిపోయినట్లు తోస్తుంది. లేదా కనీసం ఆ కోరికయినా కలుగుతుంది. అలాంటి బాల్యం నాకూ ఉంటే ఎంత బావుడ్ను అనిపిస్తుంది. అలాంటి అమ్మతనం అనుభవిస్తున్న ఈ పిల్లలపై అసూయ కలుగుతుంది. చివరికి ఫొటోల్లోని ఆట బొమ్మలపై కూడా మమకారం పుట్టుకొస్తుంది.
ఈ ఫోటోలు నాకు యధాలాపంగా దొరకలేదు. ఆఫీసులో కూర్చుని సామ్ సంగ్ నోట్ లో వార్తలు చూస్తుంటే ఒకటి రెండు ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఫొటోల్లో కనిపిస్తున్న పేరు చిన్న అక్షరాలను ఎలాగో పోల్చుకుని నోట్ లోనే వెతికితే పెటా పిక్సెల్ వెబ్ సైట్ లో మరిన్ని ఫోటోలు కనిపించాయి. కానీ అవి చిన్న సైజువి. అక్కడి నుండి ఫ్లికర్ కి లింక్ దొరికితే అక్కడకి వెళ్ళాను. అక్కడ దొరికాయి బోలెడు ఫోటోలు, ఎలెనా తీసినవి. ఇవన్నీ తన ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో తీసినవేనట!
ఫోటోలు తీయడం మొదలు పెట్టి సంవత్సరం మాత్రమే అని తెలిసాక ఆశ్చర్యంతో పాటు ఆశ కూడా కలిగింది. అయితే నేనూ ఓ సంవత్సరంలో ఇలాంటి ఫోటోలు తీయగలనేమో అని! కానీ అందుకు ఎంత సామాగ్రి కావాలి? పైగా, బోలెడు ఖరీదు! ప్చ్!




























ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి.