“ఎ.పి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా చేపడతారు?” ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అట్టహాసంగా, వంది మాగధులు చప్పట్లు చరుస్తుండగా వేసిన ప్రశ్న! ఈ ప్రశ్నకు మొదటి సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై నియమించిన మంత్రుల కమిటీ (గ్రూప్ ఆవ్ మినిష్టర్స్) ఈ సమాధానం ఇచ్చింది. మాటలతో కాదు, చేతలతో. ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు –2013’ ముసాయిదాకు జి.ఓ.ఎం ఆమోదం తెలిపిందని పత్రికలు తెలిపాయి.
“తెలంగాణ ముసాయిదా బిల్లుకు జి.ఓ.ఎం ఆమోదం తెలిపింది. యూనియన్ కేబినెట్ తదుపరి సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లును పార్లమెంటులో పెట్టేది ఖాయం” అని జి.ఓ.ఎం సభ్యుడు, ఆరోగ్య మంత్రి గులాబ్ నబీ ఆజాద్ పత్రికలకు చెప్పారని ది హిందు తెలిపింది. మంత్రుల సమావేశం 30 ని.ల పాటు జరిగిందని పత్రిక తెలిపింది.
కొన్ని సాంకేతికపరమైన, ప్రక్రియ పరమైన మార్పులు చేశాక ముసాయిదా బిల్లును జి.ఓ.ఎం ఆమోదించిందని ఉన్నత స్ధాయి ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. సమగ్రమైన బిల్లు యూనియన్ కేబినెట్ ముందుకు వస్తుందని, కేబినెట్ సమావేశంలో వివిధ సూచనల మేరకు చర్చలు జరిపి మార్పులు, చేర్పులు చేస్తారని తెలుస్తోంది.
బిల్లును కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత బిల్లు పార్లమెంటు ఉభయ సభలకు వస్తుంది. వచ్చేవారమే బిల్లు పార్లమెంటులో ప్రవేశిస్తుందని అధికార వర్గాలు చెప్పినట్లు సమాచారం.
ఎ.పి పునర్వ్యవస్ధీకరణ బిల్లు లోనే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకీజీలు అమలయ్యేలా చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. నూతన రాజధాని కోసం పెద్ద మొత్తంలో అదనపు నిధులు కేటాయిస్తారని, ఈ కేటాయింపులు బిల్లులో భాగంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్పారని వివిధ పత్రికలు చెబుతున్నాయి.
బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఎ.పి అసెంబ్లీ తిరస్కరించిందని స్పీకర్, ముఖ్యమంత్రిలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టి.వి ఛానెళ్లు కూడా ఈ దృశ్యాన్ని ప్రసారం చేశాయి. తిరస్కరణ ప్రతిపాదనను శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ లు చదవడం, ఆ వెంటనే మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందిందని ప్రకటించడం… అంతా సెకన్లలో జరిగిపోవడం చానెళ్లు ప్రసారం చేశాయి.
అనేక ముఖ్యమైన ఆర్ధిక ఖర్చులు, పద్దులు, ప్రణాళికలు ఈ విధంగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయని చెప్పడం వెనుక ఇంత పరిహాసపూరితమైన ఓటింగు ప్రక్రియ ఉన్నదని రాష్ట్ర ప్రజలకు, బహుశా దేశ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలిసి వచ్చింది. మూజువాణి ఓటింగు పాలక వర్గాలు తమ ప్రయోజనాల కోసం, తమ సౌకర్యాల కోసం అమలు చేస్తున్న మోసపూరితమైన ఓటింగ్ అని అర్ధం అయింది.
చీఫ్ సెక్రటరీకి డిప్యూటీ సి.ఎం హెచ్చరిక
ఇదిలా ఉండగా విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున కోర్టుకు వెళ్లాలని యోచిస్తున్న సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మొహంతికి ఆయన ఈ హెచ్చరిక చేశారు.
తెలంగాణ ఏర్పాటును కేంద్ర-రాష్ట్రాల సమస్యగా కోర్టు ముందుకు తీసుకెళ్లాలని సి.ఎం యోచిస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఈ పనిని ఆయన ప్రధాన కార్యదర్శి ద్వారా చక్కబెట్టాలనుకుంటున్నారని, అలాంటి ప్రయత్నాలకు చీఫ్ సెక్రటరీ (సి.ఎస్) దూరంగా ఉండాలని దామోదర హెచ్చరించారు.
రాష్ట్ర మంత్రివర్గం ఇంతవరకు అలాంటి నిర్ణయం ఏదీ చేయలేదన్న సంగతి సి.ఎస్ గుర్తించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, మంత్రి వర్గానికి గాని సమానుడు కాడని, కోర్టుకు వెళ్ళే నిర్ణయం ఏదైనా రాజ్యాంగం ప్రకారం మంత్రి వర్గమే తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్ధీకరణ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వ్యవహారం అని ఆయన గుర్తు చేసారు. ఆర్టికల్ 3 కేంద్రానికి ఆ అధికారం ఇచ్చిందని కాబట్టి కేంద్ర-రాష్ట్ర వివాదంతో ఇది ఎ మాత్రం సంబంధం లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి స్వార్ధ ప్రయత్నాలను మానుకోవాలని ఆయన కోరారు.
సమ్మె
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసిన నేపధ్యంలో ఎ.పి.ఎన్.జి.ఓ లు సమ్మెకు పిలుపు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుండి నిరవధిక సమ్మె చేస్తామని, ఉపాధ్యాయులు కూడా ఈ సమ్మేలో పాల్గొంటున్నారని వివిధ సంస్ధలు తెలిపాయి. ఫిబ్రవరి 5 అర్ధ రాత్రి నుండి సమ్మె చేస్తామని వారు తెలిపారు.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఈ వేదికకు నేతృత్వం వహిస్తున్న APNGOs అసోసియేషన్, ఇతర సంస్ధలు ఈ పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమ్మెలో చేరేది లేనిది విద్యుత్ విభాగం కార్మికులు తర్వాత చెబుతామన్నారని ఎ.పి.ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు ఈ రోజు విలేఖరులకు చెప్పారు. సమ్మేలో 13 జిల్లాల ఉద్యోగులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
