ఎఎపి పాలన: అంబానీ లైసెన్స్ రద్దుకు సిఫారసు


powerline

ఢిల్లీ ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. జనానికి సబ్సిడీ ధరలకు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయించిన ఎఎపి ప్రభుత్వం వాస్తవ విద్యుత్ పంపిణీ ఖర్చులను నిర్ధారించుకోడానికి ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించాలని నిర్ణయించడంతో అంబానీ, టాటా కంపెనీలు సహాయ నిరాకరణకు దిగిన సంగతి తెలిసిందే. తొండి కారణాలు చెప్పి విద్యుత్ సరఫరా బంద్ చేయడానికి వీలు లేదనీ, అలా చేస్తే డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయడానికి కూడా వెనుకాబడబోమని సి.ఎం ఎ.కె హెచ్చరించినట్లుగానే మొదటి వేటు అంబానీ కంపెనీపై పడనున్నట్లు కనిపిస్తోంది.

విద్యుత్ ఉత్పత్తి సంస్ధ ఎన్.టి.పి.సి కి కూడా బాకీలు చెల్లించకపోవడంతో అంబానీ నియంత్రణలోని బి(.ఎస్.ఇ.ఎస్).ఆర్.పి.ఎల్, బి(.ఎస్.ఇ.ఎస్).వై.పి.ఎల్ కంపెనీలకు విద్యుత్ సరఫరా చేసేది లేదని సదరు ప్రభుత్వరంగ సంస్ధ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తి చెల్లింపులు చేయనట్లయితే ఫిబ్రవరి 10 నాటికి అంబానీ డిస్కంలకు సరఫరా ఆపేస్తామని కూడా ఎన్.టి.పి.సి తెలిపింది. కేంద్ర విద్యుత్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం ఎన్.టి.పి.సి కి డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. దానితో బి.ఎస్.పి.ఎస్ డిస్కంలు రెండూ విద్యుత్ సరఫరా చేసే ప్రాంతాలు చీకటిలో మగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ కంపెనీలకు ఇచ్చిన పంపిణీ లైసెన్స్ లను రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డి.ఇ.ఆర్.సి) కి ఢిల్లీ ప్రభుత్వం సిఫారసు చేసిందని లైవ్ మింట్ (వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు అనుబంధం) పత్రిక తెలిపింది. బి.ఎస్.ఇ.ఎస్ డిస్కంల రెండింటి పాలనా పగ్గాలను చేపట్టడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అనగా అంబానీ విద్యుత్ పంపిణీ కంపెనీలను ఇక నుండి ప్రభుత్వమే నిర్వహించవచ్చు. కంపెనీల నిర్వహణకు తగిన అధికారులను ఎంపిక చేయాలని ప్రభుత్వ కార్యదర్శిని సి.ఎం ఆదేశించారని తెలుస్తోంది.

డి.ఇ.ఆర్.సి ఛైర్మన్ పి.డి.సుధాకర్ కు సి.ఎం ఎ.కె ఆదేశాల మేరకు ఢిల్లీ విద్యుత్ శాఖ కార్యదర్శి పునీత్ గోయెల్ సోమవారమే లేఖ రాశారని మింట్ తెలిపింది. నిధులు అందుబాటులో లేని కారణంగా తాము ఎన్.టి.పి.సి కి బాకీలు చెల్లించలేకపోతున్నట్లుగా బి.ఎస్.ఇ.ఎస్ డిస్కం లు సమాచారం ఇచ్చినట్లుగా సదరు లేఖలో పేర్కొన్నారు. దీనివలన సంబంధిత కాలనీలు అంధకారంలో ఉండిపోయే పరిస్ధితి ఏర్పడుతున్నందున విద్యుత్ చట్టం – 2003 లోని సెక్షన్ 19 (డి) ప్రకారం సదరు డిస్కంల లైసెన్సులను రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

చట్టం ప్రకారం డిస్కంలు చెల్లింపులు చేయని పక్షంలో విద్యుత్ సరఫరాను నియంత్రించే అధికారం లేదా ఆపేసే అధికారం విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు ఉన్నదని తెలుస్తోంది. ఢిల్లీ డిస్కంలకు ఎన్.టి.పి.సి ప్రస్తుతం సరఫరా చేస్తున్న విద్యుత్ 3,176 మెగావాట్లు. ఇందులో 2,072 మెగావాట్లు అంబానీ డిస్కంలే పంపిణీ చేస్తున్నాయి. మిగిలిన భాగాన్ని టాటా ఆధీనంలోని TPDDL, మరియు ఢిల్లీ మునిసిపాలిటీ ఆధీనంలోని మిలట్రీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (కంటోన్మెంట్ ఏరియా) పంపిణీ చేస్తున్నాయి. టాటా డిస్కం నుండి తమకు ఇంతవరకు ఎప్పుడూ సమస్య రాలేదనీ, అంబానీ డిస్కంలే పదే పదే బాకీలు పేరబెడుతూ సమస్యలు సృష్టిస్తున్నాయని ఎన్.టి.పి.సి ఆరోపించడం విశేషం. (ముఖేష్ అంబానీ చరిత్ర కూడా ఇలాంటిదే. కె.జి. బేసిన్ లో గ్యాస్ ఉత్పత్తిని అమాంతం తగ్గించడం ద్వారా గ్యాస్ విద్యుత్ సంస్ధలకు గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో ఆంధ్ర ప్రదేశ్ లో అనేక నెలలపాటు గంటలతరబడి విద్యుత్ కోతలు అమలు చేయాల్సి వచ్చింది.)

ఎన్.టి.పి.సి మరియు డిస్కంల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ప్రతి నెలా చివరి పనిదినంలోపల డిస్కంలు బిల్లులు చెల్లించాలి. పంపిణీ విద్యుత్ మేరకు లెక్క గట్టి ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ ను డిస్కంలు ఆ తేదీలోపు ఎన్.టి.పి.సి పంపించాలి. అయితే 168.29 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 84 కోట్లకు మాత్రమే ఎల్.ఓ.సి లు పంపారని ఎన్.టి.పి.సి తెలిపింది. తమ వద్ద డబ్బు లేదని అంబానీ కంపెనీలు దీనికి కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపాయి.

“ఈ రెండు డిస్కంల ఆర్ధిక కష్టాల పేరుతో దేశ రాజధాని నగరంలో విస్తృతంగా చీకటి అలుముకునే పరిస్ధితి ఆమోదయోగ్యం కాదు. అలా జరిగితే ఈ కంపెనీల లైసెన్స్ లను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. లైసెన్స్ లను సస్పెండ్ చేయాల్సి వస్తే తగిన అధికారులను బి.ఎస్.ఇ.ఎస్ డిస్కంలకు పాలనాధికారులుగా నియమించగలం. డిస్కంలకు పాలనాధికారులుగా నియమించదగిన అధికారులను ప్రధాని కార్యదర్శిని సంప్రదించి వెంటనే గుర్తించాలని కోరాము. తద్వారా సమస్య వచ్చినపుడు వినియోగదారులు, ఢిల్లీ ప్రభుత్వం వెతుక్కునే పరిస్ధితిని నివారించగలం” అని లేఖలో పేర్కొన్నారని మింట్ తెలిపింది.

అంబానీ డిస్కంలకు మరో అవకాశం ఇవ్వడానికి ఎన్.టి.పి.సి ససేమిరా నిరాకరిస్తోంది. తాము చాలా తక్కువ ధరలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అవసరం అయితే సదరు విద్యుత్ కొనుగోలు చేయడానికి ఇతర రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్.టి.పి.సి అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ ప్రజలకు ఒక అంబానీ పీడ వదిలిపోనుంది.

వ్యాఖ్యానించండి