ఇటలీ మెరైన్ కేసు: ఇండియాకు ఇ.యు హెచ్చరిక


Italian marines Massimiliano Latorre and Salvatore Girone

ఇద్దరు కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాలో విచారణ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వల్ల యూరోపియన్ యూనియన్, ఇండియాల మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చని ఇ.యు హెచ్చరించింది. యూరోపియన్ కమిషన్ (ఇ.యు ఎక్జిక్యూటివ్ బాడీ) అధ్యక్షుడు జోస్ మాన్యుయెల్ బరోసో, ఇటలీ ప్రధాని ఎన్రికో లెట్టాల మధ్య మూడు రోజుల క్రితం బ్రసెల్స్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బరోసో ఈ హెచ్చరిక జారీ చేశారు.

బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఇ.యు కార్యకలాపాలకు కేంద్రం. బ్రసెల్స్ ను యూరోపియన్ యూనియన్ కు రాజధానిగా పేర్కొనవచ్చు. ఈ నగరంలో ఇ.సి అధ్యక్షుడిని కలిసిన ఇటలీ ప్రధాని ఇండియాలో విచారణ లేకుండా మగ్గుతున్న తమ మెరైన్ల సంగతిని మొర పెట్టుకున్నారు. ఈ కేసు నేపధ్యంలో ఇ.యు-ఇండియా సంబంధాలను తాము జాగ్రత్తగా పునస్సమీక్ష చేయాల్సి ఉంటుందని బరోసో తదనంతరం అన్నారు.

“ఇండియాలోని ఇటలీ మెరైన్ల అంశాన్ని ఇటలీ ప్రధాని లెట్టా నాతో సమావేశంలో లేవనెత్తాడు. ఈ విషయంలో ఇటలీ అధికారులతో నేను ఎప్పటికప్పుడు సంబంధంలో ఉన్నాను. ఈ కేసును దగ్గర్నుండి పరిశీలించడాన్ని ఇ.యు కొనసాగిస్తుంది” అని ఎన్రికో లెట్టాతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బరోసో చెప్పారు.

“ఈ కేసులో ఏ నిర్ణయం తీసుకున్నా అది మొత్తం ఇండియా-ఇ.యు సంబంధాలపై ప్రభావం కలిగిస్తుంది. తదనుగుణంగా ఇరు పక్షాల సంబంధాలను జాగ్రత్తగా పునస్సమీక్ష చేస్తాము. ఫిబ్రవరి 2012లో అరెస్టయిన ఇటలీ మెరైన్ల కేసును ఇండియా ఒక అత్యవసర విషయంగా, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుగునే దిశలో చేపట్టాలని మేము ఇండియాను ప్రోత్సహిస్తున్నాము. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఐరాస సముద్ర చట్టాల (UNCLOS – United Nations Convention on the Law of the Sea) ప్రకారం ఈ కేసుకు పరిష్కారం వెతకాలని భావిస్తున్నాము” అని మాన్యుయెల్ బరోసో అన్నారు.

“సముద్ర దొంగతనాలపై జరుగుతున్న ప్రపంచవ్యాపిత పోరాటంతో కూడా ఈ అంశం ముడిపడి ఉంది. ఈ పోరాటానికి ఇ.యు గట్టిగా కట్టుబడి ఉంది. ఏ కేసులోనైనా ఎట్టి పరిస్ధితుల్లోనైనా మరణ శిక్షలు విధించడాన్ని ఇ.యు వ్యతిరేకిస్తుంది. ఈ కేసు కూడా మినహాయింపు కాదు” అని బరోసో వ్యాఖ్యానించారు. మరణ శిక్ష విధించే ఆలోచనే చేయొద్దని ఇ.సి అధ్యక్షుడు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.  మరణ శిక్ష విధిస్తే అది ఇటలీపై దాడి చేసినట్లే అవుతుందని ఇటీవల ఇండియా సందర్శించిన ఇటలీ పార్లమెంటరీ బృందం సభ్యుడొకరు హెచ్చరించడం గమనార్హం.

ఇద్దరు ఇటలీ మెరైన్లు సాల్వటోర్ గిరోన్, మస్సిమిలానో లాటోర్ ఫిబ్రవరి 2012లో కేరళ తీరంలో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారు. వారి వద్ద ఆయుధాలు ఏమీ లేనప్పటికీ, సముద్ర దొంగలుగా భావించి కాల్పులు జరిపామని వారు వాదిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం వారిని వెంటనే అదుపులోకి తీసుకుని హత్య కేసు మోపి విచారణ చేయడానికి నిర్ణయించింది. మొదట కేరళ కోర్టుకు ఈ కేసు వెళ్ళినప్పటికీ అనంతరం సుప్రీం కోర్టు తన పరిధిలోకి తెచ్చుకుంది. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రోజువారీ విచారణ నిర్వహించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడి సంవత్సరం పూర్తయినా కేంద్రం నుండి ఎటువంటి నిర్ణయం వెలువడ లేదు.

ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ మెరైన్ల కేసులో సాయం చేయాలని ఇ.యును అభ్యర్ధించారు. దాని ఫలితమే ఇ.సి అధ్యక్షుడి హెచ్చరిక. ఈ హెచ్చరిక ఫలితమో ఏమో తెలియదు గానీ సుప్రీం కోర్టు ఈ రోజు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. కేంద్రంలోని వివిధ శాఖల మధ్య ఈ కేసు విషయంలో వాదప్రతివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఏ సంగతి తేల్చాలని, ఇక గడువు పొడిగించేది ఉండదని సుప్రీం కోర్టు సోమవారం (ఫిబ్రవరి 3, 2014) అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతికి తెలిపింది.

“వచ్చే సోమవారానికి మీరు ప్రతిష్టంభనను ముగిస్తారా? ఆ తేదీ తర్వాత మళ్ళీ వాయిదాలు ఉంటాయని అనుకోవద్దు” అని జస్టిస్ బి.ఎస్.చౌహాన్ నేతృత్వంలోని బెంచి అటార్నీ జనరల్ ను హెచ్చరించింది. కేంద్రం ఈ అంశంపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిందని తదుపరి వాయిదా తేదీ నాటికి నిర్ణయం పూర్తవుతుందని అటార్నీ కోర్టుకు తెలిపారు. మెరైన్ల తరపున వాదిస్తున్న ముకుల్ రోహ్తగి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని చెప్పి 13 నెలలు గడిచిందని, అయినా ఏ చర్యా లేదనీ కనుక మెరైన్లను తమ దేశం వెల్లనివ్వాలని కోరారు.

ఇటలీ మెరైన్లపై టెర్రరిజం వ్యతిరేక చట్టం మోపడాన్ని ఇటలీ ప్రభుత్వం సవాలు చేసింది. మేరిటైమ్ జోన్ యాక్ట్, ఐ.పి.సి, సి.ఆర్.పి.సి, UNCLOS చట్టాల క్రింద విచారణ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధంగా ఉందని ఇటలీ వాదిస్తోంది.

ఈ కేసు ప్రస్తుతం కేంద్ర విచారణ సంస్ధ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ ఆధీనంలో ఉంది.

వ్యాఖ్యానించండి