రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్


Rahul tamasha

“తప్పు! పూర్తిగా తప్పు! మేము ఇదంతా చేయడానికి ఈ వ్యవస్ధ ఎలా అనుమతిస్తుందసలు?”

ఎఎపి పుణ్యమాని రాజకీయ పార్టీలు అవినీతి వ్యతిరేక ఫోజు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిన దగ్గర్నుండే ఈ ఫోజులు మొదలయినప్పటికీ ఎఎపి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచడంతో ఈ ఫోజులు బాగా పెరిగాయి. ‘అవినీతి వ్యతిరేకత’కు ఓట్లు రాల్చే గుణం కూడా ఉందని తెలిసాక ఇక రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా?

మనకి తెలిసి ఎఎపి గెలుపు తర్వాత ఎపిలో అవినీతి వ్యతిరేక ఫోజు ఇచ్చిన మొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అవినీతికి వ్యతిరేకంగా ఇంటికొకరు ఉద్యమించాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ ‘జగన్ లక్ష్యంగా’ కొన్ని రోజుల క్రితం అవినీతి వ్యతిరేక పిలుపులు జారీ చేశారు. పాపం జగన్ కి అవినీతి వ్యతిరేక పిలుపు ఇచ్చే అవకాశం లేదనుకుంటా. అయినా అడపా దడపా ఆయన కూడా అవినీతి వ్యతిరేక ఫోజు పెట్టే ప్రయత్నాలు చేయకపోలేదు.

బి.జె.పి ‘మోడి గాలి’ పైన నమ్మకం పెట్టుకుంది కాబోలు, కాస్త నెమ్మదిగా ఉంటోంది. అలాగని తక్కువ చేయడానికీ లేదు. కానీ కాంగ్రెస్ ఇచ్చినంత దూకుడుగా బి.జె.పి ఇవ్వడం లేదు. ఇచ్చినా ఉపయోగం లేదనుకున్నారేమో తెలియదు.

కాంగ్రెస్ పార్టీ మాత్రం మహా దూకుడు ప్రదర్శిస్తోంది. అవసరం అలాంటిది మరి. పుట్టలోంచి పాములు జర జరా బైటికి వచ్చినట్లు ఒకదాని వెంట ఒకటి అవినీతి కుంభకోణాలు దూసుకుని బైటికి దూకిన పాలనకు సారధ్యం వహించింది కదా! ఆ మాత్రం దూకుడు ఉండాలని అనుకుని ఉంటుంది. లేకపోతే రాహుల్ గాంధీ విన్యాసాలను ఇంకెలా అర్ధం చేసుకోవాలి.

గడ్డి కుంభకోణంలో దోషిగా కూడా తేలిన లాలూతో కాంగ్రెస్ దోస్తీ కడుతోంది. ఆ మధ్యలో సూట్ కేసుల నాయకుడు ఎవరో తెలియకుంది. అవినీతి మారాజులతో చెలిమి చేస్తూ పత్రికల ముందు వ్యవస్ధ పైన ఆరోపణలు గుప్పించే సాహసానికి రాహుల్ పూనుకుంటున్నాడని కార్టూన్ సూచిస్తోంది. అవినీతికి కారణం పాలకులు, ప్రభుత్వాలు కాదని వాటిని అనుమతిస్తున్న వ్యవస్ధదే అసలు తప్పని రాహుల్ చొక్కా మడిచి ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ అవినీతి వ్యతిరేక విన్యాసాలు అన్నా ఉద్యమంతో పాటుగా మొదలయ్యాయి. అవినీతికి చోటిస్తున్నది రాజకీయ వ్యవస్ధే అనీ ఇలాంటి వ్యవస్ధను శుభ్రం చేయడానికి యువత రాజకీయాల్లోకి దూకాలని రాహుల్ గాంధీ 2011 లోనే పిలుపులు ఇచ్చారు. పేదల దగ్గరికి వెళ్లాలని, వారి చేతులు పట్టుకుని సమస్యలు తెలుసుకోవాలని, ఆనక వారి కోసం పోరాడాలని ఆయన పిలుపిచ్చారు.

గత డిసెంబర్ లో పరిశ్రమల వర్గాల సంఘాలు ఫిక్కీ, ఎఫ్.ఐ.ఐ లు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశాన్ని అవినీతి పీల్చేస్తోందని దాన్ని నిర్మూలించి వారికి ప్రాజెక్టులు సకాలంలో అందేలా చూస్తానని హామీ ఇచ్చేశారు రాహుల్ గాంధీ. కానీ రాజకీయాలు, కార్పొరేట్ వర్గాల అక్రమ సంతానమే అవినీతి అని ఆయనకు తెలియదనుకోవాలా? 2జి, బొగ్గు, కామన్ వెల్త్, జల యజ్ఞం తదితర కుంభకోణాల్లో ప్రధాన దోషులు కార్పొరేట్ వర్గాలే కాదా? అవినీతిని నిర్మూలిస్తామని అవినీతి పరులకు వాగ్దానం ఇవ్వడం ఏమిటో రాహుల్ గాంధీయే చెప్పాలి.

రెండు రోజుల క్రితం ఓ టి.వి ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ గాంధీ అవినీతికి వ్యవస్ధను తప్పు పట్టాడు. అవినీతి పాలనకు అంతం పలికి అవినీతికి పాల్పడే వ్యక్తులను అనుమతించని వ్యవస్ధను దాని స్ధానంలో నిలిపితే తప్ప అవినీతి పోదని ఆయన సెలవిచ్చారు. ఇంతకీ ఎవరు చేయాలా పని? అవినీతి నాయకులు నిత్యం సంచరించేది రాహుల్ చుట్టూనే. అవినీతి కార్పొరేట్లు నిత్యం లాబీలు నడిపేది ఆయనతోనే. అవన్నీ మరిచి దోషం వ్యవస్ధపైకి నెట్టేయడం అంటే అజ్ఞాత శత్రువుపై యుద్ధం ప్రకటించడమే. తెలియని శత్రువుపై యుద్ధం ప్రకటిస్తే యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు కదా!

వ్యవస్ధ కూడా అలాంటి శత్రువే. వ్యవస్ధకు రూపం పాడూ ఉండదు. కానీ అదొకటి ఉనికిలో ఉందని అందరికీ తెలుసు. దానిదే తప్పంతా అని తేల్చేస్తే ఇక యుద్ధాన్ని ఎన్నేళ్లయినా వాయిదా వేయొచ్చు.

One thought on “రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్

  1. పింగ్‌బ్యాక్: రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్ | ugiridharaprasad

వ్యాఖ్యానించండి