‘పాపులిస్టు అనార్కి పాలనకు ప్రత్యామ్నాయం కాదు’ అంటే?


?????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

రాకేష్: Hi Sir, ”Populist anarchy no substitute for governance”, “rising trend of hypocrisy in public life” ఈ రెండు స్టేట్ మెంట్స్ ని స్పష్టంగా వివరించగలరా?

సమాధానం: (ఇది వాస్తవానికి రాకేష్ అనే పాఠకుడికి, నాకూ జరిగిన సంభాషణ. ఈ ప్రశ్నలో మోదటి భాగం వరకు మా మధ్య చర్చ జరిగింది. అందులో నా సమాధానం వరకూ కొన్ని మార్పులు చేసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్)

“POPULIST ANARCHY IS NO SUSTITUTE FOR GOVERNANCE”

జనవరి 26, 2014 తేదీన 64వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో రాష్ట్రపతి ఈ పదబంధం వాడారు.

నిజానికి ఇది చెప్పింది రాష్ట్రపతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఆయన చేత ఆ మాటలు చెప్పించింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ మాటలు చెప్పిందని కూడా అనుకోవచ్చు. కాంగ్రెస్ మాత్రమే కాదు. బి.జె.పి నేతలు కూడా ఇలాంటి మాటలనే చెప్పారు. జనతా దర్బార్ పేరుతో వీధుల్లో కూర్చొని ప్రజల విజ్ఞాపనలు తీసుకుంటే దాన్ని వారు ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు వీధుల్లో నడవ్వు అని కిరణ్ బేడి లాంటి ఉద్యమకారులు కూడా వెక్కిరించారు. కనుక వీరంతా ఒకే అభిప్రాయంతో ఉన్నారని అర్ధం అవుతోంది.

నాదో ప్రశ్న. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు నడిచేదె ప్రజాస్వామ్యం అన్న నిర్వచనం ప్రకారం ప్రభుత్వం యొక్క ప్రతి చర్యలోనూ ప్రజల పాత్ర ఉండాలి. అది ప్రజల కోసం ఉండాలి.

ఆఫీసుల్లో, మంత్రుల కార్యాలయాల్లో, ప్రధాని మంత్రి కార్యాలయంలో, రాష్ట్రపతి కార్యాలయంలో, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల కార్యాలయాల్లో, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ ఇంకా అనేకానేక అధికారుల ఆఫిసుల్లో సామాన్యులకు ప్రవేశం ఉంటుందా? ఉండదు. కాబట్టి వీధిలో విజ్ఞాపనలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఒక అడుగు ప్రజలకు చేరువుగా తెచ్చిన ఖ్యాతి అరవింద్ కి ఇవ్వద్దా? (ఆఫ్ కోర్స్! నిర్వహణలో ఆయన విఫలం అయి మానుకున్నారనుకోండి. కాని సరిగ్గా నిర్వహిస్తే అది సరైన పద్ధతి అనీ నా అభిప్రాయం. వీధిలో కాకపోతే నాలుగ్గోడల మధ్య ప్రజలకు స్పేస్ ఇస్తూ చేయొచ్చు. కానీ ఆ పద్ధతి మాత్రం కొనసాగాలి.)

‘ధర్నాలు చేస్తే గవర్నెన్స్ ఎప్పుడు చేస్తారు’ అని చాలా మంది ఇతర పార్టీల నేతలు, పత్రికలు ప్రశ్నించారు. వీరి దృష్టిలో గవర్నెన్స్ అంటే ఆఫీసుల్లో, సమావేశ మందిరాల్లో, మంత్రులు, బ్యూరోక్రాట్లు తీరిగ్గా కూర్చొని కబుర్లాడుకునే ఏ.సి గదుల్లో మాత్రమే చేసేది. ఆ చోట్లు కాకుండా మరే చోట కూర్చుని ప్రజాపాలన నిర్వహించినా దాన్ని ఎగతాళి చేయొచ్చు. వెక్కిరించొచ్చు. అపహాస్యం చెయ్యొచ్చు.

అసలు ఈ ఎగతాళి, వెక్కిరింపు, అపహాస్యంలోనే ప్రజల పట్ల పాలకులకు ఉండే దృక్పధాన్ని పట్టిస్తుంది. వీరి దృష్టిలో ప్రజలు గొర్రెలు. గొర్రెల కాపరి తన గొర్రెలని ఏ విధంగా చూస్తూ నియంత్రిస్తాడో, పాలకులు (మంత్రులు, బ్యూరోక్రాట్లు, ఇతర సిబ్బంది) కూడా జనాన్ని అలాగే చూస్తూ నియంత్రించాలి. “వారికి ఎదురు ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే మిన్ను విరిగి మీదపడుతుంది. ఎల్లెడలా అరాచకం తాండవిస్తుంది. పాలన స్ధానంలో ప్రజల అరాచకం ప్రవేశిస్తుంది. అది మంచి ప్రజా పాలన కాదు. చెడ్డ పాలన. Bad governance. దీనిని మొగ్గలోనే తుంచివేయాలి” ఇదీ వారి ధోరణి. ఈ మాటల్ని చెప్పరు గానీ వారి మాటల అంతరార్ధం అదే.

ఇదంతా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వీధిలో కూర్చుని ధర్నా చేయడం వల్ల వచ్చింది. ఆయన ధర్నా చేయడమే కాకుండా ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక రాత్రంతా వీధిలో పడుకున్నారు. ఇలా చేస్తే ఇంకేమన్నా ఉందా? భారీ కోటగోడల మధ్య, పట్టుపరుపుల పైన పవళించే పాలనోత్తములు ‘అవసరమైతే వీధుల్లో కూడా పడుకోవాలి’ అన్న సందేశం ప్రజలకు అందితే ఇంకేమన్నా ఉందా?

ఇంతకీ ఆయన ధర్నా ఎందుకు చేశారు?

ఢిల్లీలో ఒక ఏరియాలో ప్రజలకు ఒక సమస్య వచ్చింది. విదేశీయులు డ్రగ్స్, వ్యభిచారం నిర్వహిస్తూ తమ ప్రాంతాన్ని కలుషితం చేయడం వారి సమస్య. ఈ సమస్యకు స్పందించాల్సింది ఢిల్లీ పోలీసులు. కానీ వారు ఢిల్లీ ప్రభుత్వం చేతుల్లో లేరు. కేంద్రం చేతుల్లో ఉన్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యం. ఈ వైరుధ్యం పరిష్కారం అయితే సంతోషించేది ఢిల్లీ ప్రజలు. ఢిల్లీ పోలీసుల్ని ఢిల్లీ ప్రభుత్వం ఆధీనంలోకి అప్పజెప్పడమే ఈ వైరుధ్యానికి పరిష్కారం. లేదా ఢిల్లీలో రెండు పోలీసు విభాగాలను ఏర్పరిచి ఒక భాగానికి కేంద్ర సంస్ధల రక్షణ బాధ్యతను, మరో భాగానికి రాష్ట్ర సంస్ధల రక్షణ బాధ్యతలను అప్పజెప్పడం.

ఈ వైరుధ్యం ఈనాటిది కాదు. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడినప్పటినుండీ ఉంది. పాత సి.ఎం లు ఖురానా, షీలాలు ఇద్దరూ ఈ విషయమై కేంద్రంతో తగాదా పడ్డారు. కాని వైరుధ్యం పరిష్కారానికి ఢిల్లీ పోలీసులు, కేంద్రం ఇరువురూ సిద్ధంగా లేరు. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయాలి? చర్చల ద్వారా పరిష్కారం చేసే పరిస్ధితి లేనేలేదు. ఆ అంకం గత ప్రభుత్వాల్లో పూర్తయింది. ఇక మిగిలింది ఘర్షణ లేదా పోరాటం. అందుకే అరవింద్ ధర్నాకు దిగాడు. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య పరిష్కారం ఈ ధర్నా ద్వారా ఆశించారు. ధర్నా అవసరం లేకుండానే కేంద్రం సమస్యను పరిష్కరిస్తే సంతోషమే. కాని అందుకది సిద్ధంగా లేదు. ఢిల్లీ మంత్రి ఆదేశాలను పోలీసులు లెక్క చేయలేదు. ఇక మిగిలిన దారి ఒక్కటే. ఆ దారే ఢిల్లీ ప్రభుత్వం తొక్కింది.

కాబట్టి ఇక్కడ ప్రధాన దోషి కేంద్రం, ఢిల్లీ పోలీసులు. ముఖ్యమంత్రి పోరాటదారి తొక్కాల్సిన పరిస్ధితి కల్పించింది వారే. వారిని తప్పు పట్టడం మాని ప్రజల తరపున వ్యవహరించిన సి.ఎం ని తప్పు పట్టడం సరైందేనా? ‘ఢిల్లీ మంత్రి ఆదేశాలను లెక్క చేయకపోతే ఏం చేస్తారు?  మహా అయితే కేంద్రానికి లేఖలు రాస్తారు. అలాంటి లేఖలు ఎన్ని చూడలేదు’ ఇదీ ఢిల్లీ పోలీసుల ధైర్యం. కానీ వారు ఊహించని విధంగా అరవింద్ కేజ్రీవాల్ రోడ్డెక్కారు.

ఇక్కడ గుర్తించాల్సిన సమస్య ధర్నా సరైందా కాదా అన్నది కాదు. ప్రజల సమస్య సజావుగా పరిష్కరించబడే అవకాశాన్ని కేంద్రం, పోలీసులు ఇచ్చారా అన్నది ఆలోచించాలి. వారా అవకాశం ఇవ్వకపోతే ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సహాయంతో ఏ చర్యకు దిగినా తప్పు లేదు. ధర్నా కావచ్చు. రాస్తా రోకో కావచ్చు. సమ్మె కావచ్చు. ఏదైనా కావచ్చు. కాని అందులో ప్రజల పాత్ర, వారి ఆమోదం ఉన్నంత వరకూ ఏ చర్య తీసుకున్నా ఆమోదనీయం అవుతుంది.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ధర్నాలూ, ఆందోళనలు చేయడం సమంజసమేనా అన్న ప్రశ్నే అసంగతం. ఆ ధర్నా, ఆందోళనలు నిజంగా ఎవరికోసం అన్నదే అసలు విషయం. అవి ప్రజల కోసం అయితే నిస్సందేహంగా సమర్ధనీయం. అలాంటి కార్యాచరణను అరాచకంగా (anarchy) అభివర్ణించడం ఒక మోసం. ప్రజల సమస్యను పరిష్కరించే కర్తవ్యం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు తప్ప. అందులో ప్రజా జీవనం పట్ల చిత్తశుద్ధి లేనే లేదు.

ప్రజాజీవనాన్ని సుఖమయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రజలు లేవనెత్తిన వ్యభిచారం, డ్రగ్స్ సమస్యలను పరిష్కరించాలి. ఆ క్రమంలో ఆటంకంగా ఉన్న ‘ఢిల్లీ పోలీసులు ఎవరి నియంత్రణలో ఉండాలి’ అన్న సమస్య పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కేంద్రం ఇవేవీ చేయలేదు. ధర్నా తర్వాత కూడా ఇవి జరగలేదు. అందువలన ఈ సమస్య మళ్ళీ తలెత్తడం ఖాయం. ఢిల్లీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే మళ్ళీ ఘర్షణ తప్పదు. చిత్తశుద్ధి లేకపోతే లోలోపల రాజీలతో ముగిసిపోతుంది.

***                    ***                    ***

‘పాపులిస్టు అనార్కీ’ అనడంలో రాష్ట్రపతి దృష్టిలో జనతా దర్బార్ కూడా ఉంది. పైన చెప్పినట్లు బి.జె.పి తదితర ప్రతిపక్ష నాయకులు కూడా దీనిని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో 2 కోట్ల మంది జనం ఉన్నారు. వారందరూ తమ తమ సమస్యలతో విజ్ఞాపనలు తెస్తే ముఖ్యమంత్రి ఎన్నని చూడాలి? ఇక ఆయన పాలన ఎప్పుడు చూస్తారు? అని అనేకులు ప్రశ్నిస్తున్నారు.

వీరు అదాటున ఒక సంగతి మర్చిపోతున్నారు. 2 కోట్లమంది విజ్ఞాపనలు పట్టుకుస్తున్నారంటే ఏమిటి అర్ధం? వారంతా సమస్యలతో ఉన్నారనేగా? ఇన్నేళ్ల పాలనలో వారి సమస్యలు పరిష్కారం కాలేదనేగా. ఈ సమస్యలను పరిష్కరించడమే కదా ప్రజా పాలన అంటే. ఇది ప్రజా పాలన కాకపోతే ఇంకేమిటి? ప్రజలతో సంబంధం లేకుండా ఏ.సి గదుల్లో, సమావేశ మందిరాల్లో కూర్చుని చర్చించుకోవడమేనా ప్రజా పాలన (governance)? ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు కానప్పుడు ప్రజాస్వామ్యానికి ఆ నిర్వచనం ఎందుకు ఇచ్చినట్లు? ఇది సమాధానం వెతకాల్సిన ఒక అంశం.

మరో అంశం ఏమిటంటే, రెండు కోట్ల మందీ విజ్ఞాపనలు పట్టుకుని రారు. అందులో చిన్నపిల్లలు, విద్యార్ధులు తదితరులను తీసేస్తే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ విజ్ఞాపనలన్నీ సి.ఎం, మంత్రులే తీసుకోవాల్సిన పని లేదు. అందుకోసం ఒక వ్యవస్ధను వారు ఏర్పాటు చేయవచ్చు. దానిద్వారా కొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి.

ధర్నా ద్వారా మాత్రమే కాదు జనతా దర్బార్ ద్వారా కూడా అనేక రంగాల్లో చర్చలు లేవనెత్తబడతాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ కూడా అందులో ఒకటి. గతంలో ఇలాంటి చర్చలు ఎక్కడన్నా జరిగాయా? కనీసం అవకాశం వస్తే ప్రజలు అనేక సమస్యలతో ముందుకు వస్తారు అన్న జ్ఞానాన్ని కలిగించే కార్యకలాపాలు జరిగాయా? లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ‘ప్రజల వద్దకు పాలన’ పేరుతో ప్రభుత్వ యంత్రాంగాల్ని పల్లెలకు తరలించాడు. కానీ అది ఒట్టి జనాకర్షక కార్యక్రమం అని త్వరలోనే తేలిపోయింది. దాన్ని కాపీ కొడుతూ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు రచ్చబండ నిర్వహించారు. కానీ ఒక్క సమస్యనీ పరిష్కరించలేదు.

వాటికి భిన్నంగా జనతా దర్బార్ నడిచింది. అయితే అరవింద్ చేసిన తప్పు ఏమిటంటే, పరిణామాలను అంచనా వేయలేకపోవడం. పరిపాలనకు కొత్త కాబట్టి ఆ తప్పుని తేలికగా క్షమించేయొచ్చు. ఇప్పుడు ఆయన చేయాల్సింది జనతా దర్బార్ లాంటి కార్యక్రమాల్ని నిర్వహించడానికి ఒక పటిష్టమైన వ్యవస్ధను ఏర్పరచడం. ఆ వ్యవస్ధకూ, పాలనా వ్యవస్ధకూ ఆరోగ్యకరమైన డైనమిక్ సంబంధాల్ని ఏర్పరచడం. కాని దీనిని ఆయన చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని నాకు అనిపించడం లేదు. చేస్తానని చెప్పారు గానీ, ఆ తర్వాత ఆన్ లైన్ లో ఇవ్వండి అని చెప్పి ఊరుకున్నారు.

ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ప్రజలను చైతన్యవంతం చేసి వారి బలహీనతలను తగ్గించే ప్రయత్నం చేయాలి. తద్వారా జనతా దర్బార్ లాంటి ప్రయత్నాలను విసృతంగా చేయాలి. నిజానికి జనతా దర్బార్ లను పటిష్టం చేసే క్రమంలో వచ్చే అనుభవాలే అటు జనాన్ని చైతన్యవంతం చేస్తూ, ఇటు పాలకులకు గొప్ప అనుభవాలని సమకూర్చుతాయి.

కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అంతిమంగా ప్రజలు చైతన్యవంతం కావడానికి దారి తీస్తాయి. రాష్ట్రపతి చెప్పినట్లు అరాచకానికి కాదు దారితీసేది. ప్రభుత్వ పాలనలో ప్రజల పాత్ర పెరగడానికీ, తద్వారా వారి పౌర బాధ్యతలను ఎరుకపరచడానికీ దారి తీస్తాయి. ఆ క్రమంలో ప్రజల చైతన్యం పెరుగుతూ పోతుంది. అదే సమయంలో వ్యవస్ధలోని బలహినతల పట్ల కూడా ప్రజల చైతన్యం పెరుగుతూ పోతుంది. వ్యవస్ధలో ఏది ప్రజలకు అనుకూలంగా ఉందో, ఏది వ్యతిరేకంగా ఉందో వారికి తెలుస్తుంది. అనుకూలంగా ఉన్నది మరింత మెరుగుపరచుకోవడానికీ, వ్యతిరేకంగా ఉన్నదాన్ని రద్దు చేయించుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అవినీతికి ఎక్కడ పునాది ఉందో వారు ఇట్టే పసిగడతారు. పసిగట్టడమే కాకుండా దాన్ని రూపుమాపడానికి ఏం చేయాలో కూడా వారు ఆలోచిస్తారు.

అనగా ప్రజలు మరింతగా చురుకుగా మారతారు. మరింత తెలివిగా మారతారు. మరింత క్రియాశీలకంగా మారతారు. ప్రజలు ఇలా మారడమే పాలకుల దృష్టిలో Populist Anarchy. అంటే రాష్ట్రపతి చెప్పిన ప్రజల అరాచకం నిజానికి అరాచకం కాదు. అది వారి చైతన్యం. పాలకుల అవినీతిని, లొసుగులను పసిగట్టి, వారి పని పట్టే చైతన్యాన్ని ప్రజలు సంతరించుకుంటే వారు ఏం చేస్తారు? అలాంటి అవినీతిని, లొసుగులను రూపుమాపడానికి ప్రయత్నిస్తారు.

అనగా ఏ వర్గాలైతే ప్రభుత్వాలను నడుపుతున్నారో, ఏ వర్గాలైతే ప్రభుత్వాలు నడుపుతూ వ్యవస్ధలోని ఆర్ధిక వనరులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారో, ఏ వర్గాలైతే వ్యవస్ధలను శాసిస్తూ సమస్త వనరులను తమ స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారో ఆ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం అవుతారు. చైతన్యం అయిన వారు చేతులు ముడుచుకుని కూర్చోరు. అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా వ్యవస్ధను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వీలయితే ఎఎపి లాంటి పార్టీలను మరిన్ని చోట్ల గెలిపిస్తే వ్యవస్ధను మార్చుకోవచ్చేమో చూస్తారు. ఆచరణలో దానివల్ల ఫలితం లేకపోతే మరింత చైతన్యవంతమైన పాత్రను పోషిస్తారు. అనగా బలవంతంగానైనా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు ఆ పనికి పూనుకున్నపుడు జరిగేవే విప్లవాలు.

కాబట్టి ప్రజల చైతన్యం కాస్తా ఆధిపత్య వర్గాలను వారి ఆధిపత్యాన్నుండి కూలదోయడానికి దారితీస్తుంది. పాలకులు దీనికి ఒప్పుకుంటారా? దాన్ని మొగ్గలోనే తుంచడానికి ప్రయత్నిస్తారు. మొగ్గగా ఉన్నపుడే దానిని ‘పిచ్చి కుక్క’ అని పేరు పెడతారు. కుదిరితే టెర్రరిజం అనవచ్చు. కుదరకపోతే నక్సలిజం అన్నా అనవచ్చు. అందులో మొదటి దశగా దానికి ‘పాపులిస్టు అనార్కీ’ అంటున్నారు. రిపబ్లిక్ డే రోజునే రాష్ట్రపతి ఈ మాటలు చెప్పడం వెనుక ఇంత విస్తృతార్ధం, పాలక వర్గాల విస్తృత ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ బుట్టలో పడిపోవడం అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం.

ప్రజల చైతన్యాన్ని పాలకులు సహించరు అనడానికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. 1991లో ఆంధ్ర ప్రదేశ్ లో సారా వ్యతిరేక ఉద్యమం వల్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోయింది. నిజానికి అది పాక్షిక ఉద్యమం మాత్రమే. వ్యవస్ధలో ఉన్న అనేక చెడుగుల్లో ఒకానొక చెడుగును రూపుమాపడానికి మహిళాలోకం ఉధృతంగా ప్రయత్నించిన ఉద్యమం అది. ఈ ఉద్యమం ప్రకాశం జిల్లాలో దూబగుంట అనే ఒక చిన్న ఊరిలో మొదలయింది. అదెలా మొదలయిందంటే మహిళలను పొదుపు ఉద్యమంలోకి తీసుకురావడానికి ఒక చిన్న కధ ఉన్న పుస్తకాన్ని వారికి బోధించారు. ఆ కధలో కాస్త చదువుకున్న మహిళ కుటుంబ సంపాదనను ఆమె భర్త తాగుడుకి తగలేస్తుంటాడు. అతని తాగుడు మానిపిస్తే బోలెడు పొదుపు చేయొచ్చని గ్రహిస్తుంది. ఆ ఆలోచనతో తోటి మహిళలతో కలిసి వెళ్ళి ఆ ఊరిలో సారా కొట్టు మూసేయిస్తుంది. దానితో ఆ కుటుంబం సంపాదన పొదుపు చేసుకుని లాభపడుతుంది.

ఈ చిన్న కధ దూబగుంటలో మహిళలను చైతన్యపరిచింది. వారిలో ఒక మహిళ (రోశమ్మ అనుకుంటా) నాయకత్వంలో ఆ ఊరి మహిళలంతా కలిసి నిజంగానే సారా కొట్టుని మూసేయిస్తారు. ఫలితంగా కొద్ది కాలంలోనే వారి కుటుంబాలు ఆర్ధికంగా లాభపడ్డారు. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పాకి పక్క ఊళ్ళకు అంటుకుంది. పక్క ఊళ్ళ మహిళలు కూడా దూబగుంట మహిళలను అనుసరించారు. క్రమంగా ఇది పక్కనే నెల్లూరు జిల్లాకు, అనంతరం రాష్ట్రం అంతా పాకింది. ఈనాడు పత్రిక కూడా రంగంలోకి దిగడంతో ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. చివరికి అప్పటి విజయభాస్కర రెడ్డి సారా నిషేధం ప్రకటించక తప్పలేదు. నిషేధం విధిస్తూ ఆయన ఉద్యమ మూలాలను వెతికితే పొదుపు ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకం, ఆ పుస్తకంలోని కధ ఆయన దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ఆ కధ ప్రచురించడానికి కారణం అయిన అధికారులను తీవ్రంగా మందలించరని పత్రికలు రాశాయి. ఆయన మందలింపుతో ఆ పుస్తకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది.

సారా వ్యతిరేక ఉద్యమం చివరికి తదుపరి ఎన్నికల్లో టి.డి.పి గెలవడానికి దారితీసింది. ఆ తర్వాత టి.డి.పి నేత ఎన్.టి.ఆర్ మద్యం నిషేధించి లిక్కర్ లాబీని చావుదెబ్బ కొట్టడం, వారు చంద్రబాబు నాయుడుకు మొరపెట్టుకోవడం, అదే సమయంలో ఎన్.టి.ఆర్, లక్ష్మి పార్వతీలు దగ్గర కావడం, ఆయన కుటుంబం కూడా ఆయనకు ఎదురు తిరగడం, ఈ పరిస్ధితులన్నీ లిక్కర్ లాబీకి సహకరించి ఎన్.టి.ఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం తదితర పరిణామాలు జరిగాయి.

కేవలం సారా నిషేధం వల్ల సారా, లిక్కర్ లాబీలు నష్టపోతేనే ఇంత భారీ రాజకీయ మార్పులు జరిగాయి. ఈ లాబీలు, వారి కుటుంబ సభ్యులు మహా అయింతే ఎంతమంది ఉంటారు. మహా అయితే వంద ఇంకా కాకపోతే వెయ్యి? కాదూ కూడదంటే 5,000. వీరు పూనుకుని అత్యధిక మెజారిటీ కలిగిన రాష్ట్ర ప్రభుత్వం జాతకాన్ని మార్చేశారు. దానిక్కారణం వారి వద్ద ఉన్న డబ్బు మాత్రమే కాదు. ఆ డబ్బుతో పాటు వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకున్న వర్గాలన్నీ ప్రజల చైతన్యానికి భయపడడం ప్రధాన కారణం. ప్రజలు క్రియాశీలురైతే ప్రభుత్వాలు మాత్రమే కూలిపోవు. వ్యవస్ధలే తలకిందులు అవుతాయి.

అందుకే ప్రజల క్రియాశీలతకు వ్యతిరేకంగా ఈ వ్యవస్ధలో అనేక పేర్లు తగిలించబడతాయి. వాటిలో కొన్ని చాలా అందంగా ఉంటాయి. వినసొంపుగా ఉంటాయి. విజ్ఞానదాయకంగా ఉన్నట్లు కనిపిస్తాయి. మొత్తం వ్యవస్ధ నడకను, నడవడికను మంచి వైపు తీసుకెళ్తున్నట్లు ముసుగు వేసుకుంటాయి. ఆ ముసుగులు తొలగించి చూస్తేగాని తెలియదు, లోపల ఎంత గబ్బు దాగి ఉందో. ఆధిపత్య వర్గాల ఆధిపత్యం చిరకాలం కొనసాగాలంటే ఆ గబ్బుని వారు కాపాడుకోవలసిందే. రకరకాల పదబంధాల మాటున ప్రజల చైతన్యాన్ని అణచివేయాల్సిందే. చివరికి ఎఎపి లాంటి నామమాత్ర ప్రజానుకూల చర్యలను కూడా వారు సహించనిది అందుకే మరి!

4 thoughts on “‘పాపులిస్టు అనార్కి పాలనకు ప్రత్యామ్నాయం కాదు’ అంటే?

  1. పింగ్‌బ్యాక్: ‘పాలనకు పాపులిస్టు అనార్కి ప్రత్యామ్న్యాయం కాదు’ అంటే? | ugiridharaprasad

వ్యాఖ్యానించండి