
NEW YORK – OCTOBER 07: A sign in a market window advertises the acceptance of food stamps on October 7, 2010 in New York City. New York Mayor Michael Bloomberg is proposing an initiative that would prohibit New York City’s 1.7 million food stamp recipients from using the stamps, a subsidy for poor residents, to buy soda or other sugary drinks. Bloomberg has stressed that obesity among the poor has reached critical levels. Spencer Platt/Getty Images/AFP
భారత దేశంలో ఆహార సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారని అమెరికా ఒకటే ఇబ్బంది పడుతుంది. ఆహార సబ్సిడీ పధకాన్ని ‘ఫ్రీ మీల్స్’ అని అమెరికా, ఐరోపా తదితర పశ్చిమ రాజ్యాల మేధావులు ఎకసక్కెం చేస్తారు. తద్వారా తమ దేశంలో అందరూ పని చేస్తేనే భోజనం చేస్తారన్న సందేశం ఇస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే అమెరికా, ఐరోపా దేశాల్లో ఇండియా కంటే అనేక రెట్లు ఎక్కువ సబ్సిడీ తమ కంపెనీలకు, జనానికి ఇస్తారు. అమెరికాలో ప్రాధమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య దాదాపు పూర్తిగా ఉచితం. అది కాకుండా ఫుడ్ స్టాంప్స్ పేరుతో అమెరికా ఇచ్చే ఆహార సబ్సిడీ స్వీకర్తల్లో పని చేయగల వయసువారి సంఖ్య ఎక్కువవుతోందని సర్వేలు తేల్చాయి.
ఇన్నాళ్లూ అమెరికా ఆహార సబ్సిడీ అందుకునేవారిలో పెద్దలే ఎక్కువ అని ఒక నమ్మకం. అనగా ఉద్యోగం చేసి రిటైర్ అయినవారు, పెద్ద వయసులో ఉన్నవారు మాత్రమే ఆహార సబ్సిడీ తీసుకుంటారని, మిగిలినవారు బుద్ధిగా పని చేసి భోజనం చేస్తారని చెబుతారు. ఈ పరిస్ధితి తారుమారయిందని ఆర్ధిక సంక్షోభం పుణ్యాన ఉద్యోగాలు దొరక్క, దొరికినా అంతంత మాత్రంగా చెల్లించే వేతనాల వలనా ప్రభుత్వ ఆహార సబ్సిడీపై ఆధారపడుతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. వీరిలో వర్కింగ్ ఏజ్ (18 సం. నుండి 59 సం. వరకు) వాళ్ళు అంతకంతకూ ఎక్కువగా చేరుతున్నారని ఒక సర్వేలో తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో సెంటర్ ఫర్ పావర్టీ రీసర్చ్ అనే సంస్ధ ఈ సర్వే జరిపింది. ఫుడ్ స్టాంప్ ఇచ్చే కార్యక్రమాన్ని అమెరికాలో అనుబంధ పోషకాహార సహాయ కార్యక్రమం (Supplemental Nutrition Asistance Program – SNAP) అని పిలుస్తారు. క్లుప్తంగా దీన్ని స్నాప్ అందాం. ఈ స్నాప్ లబ్దిదారులలో వర్కింగ్ ఏజ్ లో ఉన్నవారు 1998లో 44 శాతం (ఇది తక్కువా? అన్న ప్రశ్న వచ్చింది కదా?) ఉంటే ఇప్పుడు అది 50 శాతం దాటిపోయిందిట. 2001లో వచ్చిన డాట్ కామ్ సంక్షోభం లేదా ఐ.టి సంక్షోభం, ఆ తర్వాత 2007-08 లో వచ్చిన గ్రేట్ రిసెషన్ సంక్షోభం (ఇదే ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కూడా) వలన పరిస్ధితి ఇలా తయారయిందని పరిశోధన సంస్ధ డైరెక్టర్ జేమ్స్ జిలియక్ చెప్పారు.
1980లో కాస్త కాలేజీ శిక్షణ పొందిన కుటుంబాల్లో 8 శాతం కుటుంబాలు మాత్రమే ఫుడ్ స్టాంప్స్ పై ఆధారపడ్డారు. వారి సంఖ్య ఇప్పుడు 28 శాతానికి చేరుకుంది. 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన కుటుంబాల్లో 3 శాతం మంది 1980లో ఫుడ్ స్టాంప్స్ పై ఆధారపడితే వారి సంఖ్య ఇప్పుడు 7 శాతానికి చేరింది. హై స్కూల్ గ్రాడ్యుయేట్ల కుటుంబాలు 1980లో 28 శాతం మంది ఫుడ్ స్టాంప్స్ పై ఆధారపడగా వారి సంఖ్య ఇప్పుడు 37 శాతంకి చేరుకుంది. ఈ కాలాల్లో బడా వాల్ స్ట్రీట్ కంపెనీల లాభాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. సంక్షోభ సమయాల్లో లాభాలు తగ్గినట్లు చూపిన కంపెనీలు అనతికాలంలోనే అనగా సంవత్సరం తిరిగే లోపే అవి లాభాలు ప్రకటించాయి. దేశ జి.డి.పి మాత్రం ఇంకా కుంటుతూనే ఉంది.
దేశ జి.డి.పి పడిపోయినా కంపెనీలకు లాభాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇక్కడే తెలుస్తోంది. ఉద్యోగులు, కార్మికుల వేతనాలలో కోతపెట్టి వాటిని తమ లాభాలుగా కంపెనీలు తరలించుకున్నాయి. వీటికి ప్రభుత్వం అనుసరించిన పొదుపు విధానాలు, బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో అమలు చేసిన కోతలు, కత్తిరింపులు, రద్దులు సహకరించాయి. ఫలితంగా జనం ఆదాయాలు కోల్పోయి ఆహారం కోసం ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ స్టాంప్స్ పైన ఆధారపడవలసిన పరిస్ధితి దాపురించింది. ఘోరం ఏమిటంటే ఒకవైపు లక్షలాది ఉద్యోగాలు రద్దవుతుంటే మరోపక్క వేలాది ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒక మర్మం దాగి ఉంది. ఏమిటంటే రద్దవుతున్న ఉద్యోగాల వేతనాలు ఎక్కువగా ఉంటే కొత్తగా వస్తున్న ఉద్యోగాల వేతనాలు హీనంగా కనీస వేతనాలకు దగ్గరగా ఉండడం. ఆ విధంగా మిగిలిన మొత్తాన్ని లాభాలుగా కంపెనీలు జమ చేసుకుంటున్నాయి. కానీ జనం మాత్రం వైద్య సౌకర్యాలకు డబ్బు లేక సతమతం అవుతున్నారు. చివరికి కూటి కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడుతున్నారు.
ఈ సంక్షోభాల ఫలితంగా అమెరికాలో మధ్యతరగతి దాదాపు అంతరించిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అమెరికా మధ్య తరగతి వర్గంపై ఆధారపడే అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధల జి.డి.పి ఆధారపడి ఉంది. అందులో ఇండియా కూడా ఒకటి. చైనా, జపాన్, ఐరోపా, బ్రెజిల్ తదితర దేశాలన్నీ అమెరికా దిగుమతులపైనే అనగా అమెరికా మధ్య తరగతి ప్రజల వినియోగం పైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా మధ్య తరగతి అంతరించడం అంటే ఈ దేశాలకు ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ అంతరించిపోవడం. ఇండియా ఎగుమతులు పడిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇండియా సాఫ్ట్ వేర్ ఎగుమతులు ప్రధానంగా అమెరికా, ఐరోపాలకు వెళ్తాయి. అక్కడ మధ్య తరగతి వర్గం చిక్కి శల్యం కావడంతో మన ఎగుమతులు, చైనా, జపాన్, ఐరోపా దేశాల ఎగుమతులు పడిపోయాయి. అనగా అక్కడ ఉత్పత్తి లేదా జి.డి.పి పడిపోయింది.
అమెరికాలో ప్రస్తుతం ఫుడ్ స్టాంప్స్ పై వెచ్చిస్తున్నది 80 బిలియన్ డాలర్ల పైనే. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు అని రష్యా టుడే పత్రిక చెబుతోంది. అనగా 2008లో (ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభానికి దాదాపు ముందు) 40 బిలియన్లు ఫుడ్ స్టాంప్స్ కి ఖర్చు చేసిన అమెరికా ఇప్పుడు 80 బిలియన్లు పెడుతోంది. సంక్షోభం ఎవరిని నష్టపరిచిందో ఇక్కడే తేలుతోంది. అమెరికా వేతనాలు తీవ్రంగా పడిపోవడంతో ఆర్ధిక రికవరీ కూడా అసాధ్యంగా మారింది. మరోవైపు కార్పొరేట్ల లాభాలలో ఏమీ తగ్గుదల లేదు. ఈ పరిస్ధితి తీవ్ర అసమానతలకు దారితీస్తోంది.
“అమెరికాలో ఇప్పుడు సృష్టించబడుతున్న ఉద్యోగాల్లో అత్యధికం చాలా తక్కువ వేతనాలతో ఉంటున్నాయి. కొన్ని కనీస వేతనం కంటే కూడా తక్కువ వేతనంతో ఉంటున్నాయి. రిటైల్ షాపుల్లోనూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లోనూ దొరికే పార్ట్-టైమ్ ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువ. దీనర్ధం ఉపాధి పెరిగినా ఫుడ్ స్టాంప్స్ వినియోగం తగ్గే అవకాశమే లేదు” అని విస్కాన్సిన్-మెడిసన్ యూనివర్సిటీకి చెందిన ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్ తిమోతి స్మీడింగ్ చెప్పారని ఆర్.టి తెలిపింది. ‘అతి తక్కువ వేతనం + ఫుడ్ స్టాంప్’ ఇదే అమెరికాలో సగటు జీవి జీవనాధారం అయింది.
పిడకల వేట
అమెరికా జనాభా 32 కోట్లు. వీరికోసం అమెరికా వెచ్చిస్తున్న ఆహార సబ్సిడీ విలువ 80 బిలియన్ డాలర్లకు పైనే అని తెలుసుకున్నాం. ఇది దగ్గర దగ్గర 5 లక్షల కోట్లకు సమానం. కానీ ఇండియా జనాభా 120 కోట్లు. ఈ మధ్య ప్రభుత్వం ఆమోదించిన ఆహార భద్రతా చట్టం ప్రకారం వీరిలో 82 కోట్ల మంది ఆహార సబ్సిడీ వల్ల లబ్ది పొందుతారని అంచనా వేస్తున్నారు. అగ్రికల్చర్ కమిషన్ ప్రకారం ఈ సబ్సిడీ వ్యయం మొత్తం 1.25 లక్షల కోట్ల రూపాయల నుండి 1.5 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చు. అనగా అమెరికా 32 కోట్ల జనాభాకు ఇస్తున్న సబ్సిడీ కంటే ఇండియా 120 కోట్ల జనాభాలో 82 కోట్ల మందికి ఇస్తున్న ఆహార సబ్సిడీ విలువ 3 నుండి 4 రెట్లు తక్కువే. ఇంత తక్కువగా ఉన్న సబ్సిడీ ఎక్కువయిందని, తగ్గించాలని అమెరికా, ఐరోపాల ప్రభుత్వాల నుండి ఐ.ఏం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూ.టి.ఓ ల వరకూ ఒకటే శతపోరుతున్నాయి. ఆ మధ్య బాలి లో జరిగిన దోహా రౌండ్ చర్చల్లో ఇది ఒక ప్రధాన అంశం. మనవాళ్లు వాళ్ళ ఒత్తిడికి తలలూపి వచ్చారు. ఇంతా చేసి ఈ సబ్సిడీలో జనానికి చేరేది ఎంతో ఎవరికి వారే ఊహించుకోవాలి.
పింగ్‌బ్యాక్: అమెరికా ఆహార సబ్సిడీ: పెద్దలే కాదు యువతకీ కావాలి | ugiridharaprasad
sir ee madya students chaala mandi usa ki velladanki interest chuputhunnaru..and usa kuda chaala mandiki visa lu sanction chesai..veella paristiti nti sir 2yrs tarvatha??