మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది.
ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప రాష్ట్రాల్లో గానీ, కేంద్రంలో గానీ అధికారం చేపట్టలేని పొత్తుల యుగంలో ఒంటరిగా నెగ్గుకు రావడం అంటే ఏటికి ఎదురీదడమే. బి.జె.పి ఒకవైపు, కాంగ్రెస్ + ఆర్.జె.డి + ఎల్.జె.పి ఒకవైపు, జె.డి(యు) ఒకవైపు నిలబడే త్రిముఖ పోటీలో ఎక్కువ పక్షాలు కూడిన వైపుకే అధికార పగ్గాలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది.
మతోన్మాద బి.జె.పికి వ్యతిరేకంగా లౌకికవాద కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని జె.డి(యు) ఎన్నడూ చెప్పని మాట నిజమే. కానీ అంతర్గతంగా కాంగ్రెస్ తో పొత్తును జె.డి(యు) ఆశించినట్లు ఆ పార్టీ నాయకులు చేసిన వివిధ ప్రకటనల్లో అర్ధం అయ్యే అంశం. కానీ ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు. బి.జె.పితో బంధం వీడి కాంగ్రెస్ తో చేయి కలుపుదామని వచ్చిన జె.డి(యు) బొక్కబోర్లా పడే పరిస్ధితి వచ్చిందని కార్టూన్ సూచిస్తోంది.
కానీ, గడ్డి కుంభకోణంలో దోష నిర్ధారణ జరిగిన లాలూ ప్రసాద్ తో పొత్తు వల్ల కాంగ్రెస్ లబ్ది పొందగలదా లేదా అన్నదే ప్రశ్న. బీహార్ లో రెండు మార్లు వరుసగా అధికారం చేపట్టిన జె.డి(యు), బి.జె.పి లకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉంటే తప్ప కాంగ్రెస్ లబ్ది పొందడం అనుమానం.
కానీ వచ్చేది అసెంబ్లీ ఎన్నికలు కాదు. పార్లమెంటు ఎన్నికలే. కాబట్టి వైరి పక్షానికి సాధ్యమైనన్ని తక్కువ సీట్లు వచ్చేలా చూడడం లోనే బీహార్ లోని మూడు శిబిరాలు ప్రయత్నిస్తాయి. ఎన్నికలు పూర్తయ్యాక మోడి వలన జె.డి(యు) మళ్ళీ ఎన్.డి.ఏ గూటికి వచ్చే అవకాశం లేదు. ఆ విధంగా తాజా పరిణామాల వల్ల బి.జె.పి/ఎన్.డి.ఏ యెనే ఎక్కువ నష్టపోయే అవకాశం పొంచి ఉంది.

look at recent surveys by CSDS, ORG and nilson, you will know who is loosing.