ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల పండగ -ఫోటోలు


అతి పెద్ద ఒంటెల పండగే కాదు, అతి పెద్ద పశువుల పండగ కూడా కావచ్చిది. రాజస్ధాన్ లో కార్తీక మాసంలో పుష్కర్ సరస్సు ఒడ్డున జరిగే ఈ పండగ/సంతలో దాదాపు 2 లక్షలకు పైగా పాల్గొంటారని అంచనా. 50,000కు పైగా ఒంటెలు ఇందులో పాల్గొంటాయి. భక్తులు పౌర్ణమి సమీపించే కొందీ పుష్కర్ ను సందర్శించే యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. పౌర్ణమి రోజు పుష్కర్ లో స్నానం ఆచరిస్తే మంచిదని భక్తుల నమ్మిక. జనమూ, వారితో పాటు పశువులు, వారిద్దరితో పాటు యాత్రీకులు కూడిన దగ్గర ఇక తిరునాళ్ళకేం తక్కువ?

పుష్కర్ ఒంటెల సందడిని సందర్శించడానికి దేశ, విదేశాల నుండి వేలాది మంది టూరిస్టులు కూడా వస్తారు. సాంప్రదాయక దుస్తులు ధరించి స్ధానికులు చేసే హడావుడిని చూడడం వీరికి ఇష్టం. ఒంటెల బండ్లపై ఊరేగుతూ సంత మొత్తం తిరుగుతూ టూరిస్టులు కూడా సందడి చేస్తారు.

బ్రహ్మ దేవుడు పుష్కర్ వద్దనే ఒక కమలం పుష్పాన్ని జారవిడిచాడని దాని చుట్టూ పెద్ద సరస్సు ఏర్పడిందని ఆ సరస్సు చుట్టూ నగరం నిర్మాణం అయిందని భక్తుల సంప్రదాయక విశ్వాసం. బ్రహ్మ దేవుడికి గుడి ఉన్న ఏకైక ఊరు పుష్కర్.

ప్రారంభ రోజుల్లోనే అక్కడికి వెళ్ళి తిష్ట వేస్తే ఒంటెలు గుంపులు గుంపులుగా రావడం చూసి తరించవచ్చు. కనుచూపు మేరలో ఎటు చూసినా కనపడే ఒంటెల బారులు చూపరులకు కనువిందు చేస్తాయి. ఒంటెలను తెచ్చేవారి కోసం, సందర్శకుల కోసం తాత్కాలికంగా ఇక్కడ గుడారాల నగరాన్ని నిర్మిస్తారు. ఒంటెల యజమానులు, వారి కుటుంబాలు, ఒంటెల పండగను చూడడానికి వచ్చినవారు ఈ గుడారాల్లో గడుపుతారు.

ఇక్కడ ఒక వేదిక లాంటిది కూడా ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపైన వారం పొడవునా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కర్ సరస్సుకు దారి తీసే రోడ్ల పొడవునా వివిధ షాపులు, స్టాళ్ళు వెలిసి ఒంటెల పండగను సొమ్ము చేసుకుంటాయి. విలువైన కాశ్మీయర్ దుస్తుల నుండి ఒంటెల అలంకారాల వరకు ఇక్కడ అమ్ముతారు.

ఒకవైపు 50,000కు పైగా గుంపులుగా బారులు తీరే ఒంటెలు, మరోవైపు 50,000 నుండి 3 లక్షల వరకు పుష్కర్ ఒడ్డున నిర్మించిన 52 స్నాన ఘట్టాలలో పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తజనం. వీరిద్దరినీ చూసి మదిలో, ఫొటోల్లో, వీడియోల్లో బంధించే సందర్శకులు… వీరందరితో పుష్కర్ రెండు వారాలపాటు సందడి సందడిగా మారుతుంది.

ఒక్క ఒంటెలే కాదు. పుష్కర్ లో గుర్రాలు, పశువుల (బర్రెలు, ఆవులు, ఎద్దులు మొ.వి) కూడా అమ్మకాలు, కొనుగోళ్ళు కూడా జరుగుతాయి. అయితే అవి తక్కువ. సంతను డామినేట్ చేసేది ఒంటెలే. ఒంటెలకు రకరకాల అలంకార సామాగ్రిని తయారు చేసి ఇక్కడ అమ్ముతారు. అల్లిక బట్టల నుండి వెండి అలంకారాల వరకు ఇందులో ఉంటాయి. వెండి గంటలు, గొలుసులు, కడియాలు, గజ్జెలు ఒంటెలకు అమర్చి అవి మోగిస్తూ ఒంటెలు తిరుగుతుంటే చూడడం ఒక ఆనందం.

ఒంటెలను అలంకరించాక వాటికి అందాల పోటీలు కూడా నిర్వహిస్తారట. ఇంకా ఇతర రకాల పోటీలను కూడా ఒంటెలకు నిర్వహిస్తారు. సాధ్యమైనంత ఎక్కువమంది ఒంటె మూపురంపై కూర్చుంటే అవి నిర్దిష్ట దూరం వరకు ప్రయాణం చేయడం ఒక పోటీ. లక్ష్యాన్ని చేరుకునేసరికి ఎక్కువమందిని కూర్చోబెట్టుకున్న ఒంటె పోటీలో గెలుస్తుంది.

మాటాడర్ నెట్ వర్క్, కొందరు టూరిస్టు ఔత్సాహికులు ఈ ఫోటోలు అందించారు.

2 thoughts on “ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల పండగ -ఫోటోలు

  1. పింగ్‌బ్యాక్: ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల పండగ -ఫోటోలు | ugiridharaprasad

వ్యాఖ్యానించండి