“ఇదయితే మీ ఇమేజ్ కి బాగా సరిపోతుంది కదా, సార్?”
పార్టీలోని వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని అందరూ అంగీకరించే సూత్రం. ఈ సూత్రం పార్టీలోని సామాన్య కార్యకర్తల నుండి అత్యున్నత నాయకులకు అందరికీ వర్తిస్తుందని ప్రతి పార్టీ చెప్పుకుంటుంది. తద్వారా పార్టీ సిద్ధాంతాలకు, నిర్మాణానికి పెద్ద పీట వేయడానికి పార్టీలు ప్రయత్నిస్తాయి. వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకుని పార్టీకి నష్టం కలిగించకుండా జాగ్రత్త పాటిస్తాయి.
కానీ బి.జె.పి వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. “నరేంద్ర మోడి పార్టీ కంటే మించిన పాపులర్ లీడర్” అని ఆ పార్టీ నేత అరుణ్ జైట్లీ అభివర్ణించి తమ పార్టీని తానే తక్కువ చేసుకున్నారు. వ్యక్తులు ఎంత ఎదిగినా పార్టీ అండ లేకుండా, పార్టీ కార్యకర్తల సహకారం లేకుండా, కింది నుండి పై స్ధాయి వరకూ పని చేసే ఆయా కమిటీల స్ధిరమైన, నిబద్ధమైన పని లేకుండా ఎదగడం సాధ్యం కాదు.
అలా పార్టీకి, పార్టీ పనికీ, పార్టీ నిర్మాణానికీ అతీతంగా తాము ఎదిగామని ఏ నాయకుడైనా భావిస్తే అది ఆ వ్యక్తి భ్రమ అవుతుంది. అహంకారం అవుతుంది. వ్యక్తి కంటే వ్యవస్ధ గొప్పది అన్న సూత్రాన్ని గుర్తించలేని బలహీనుడు అవుతాడు. ఆ విధంగా తన బలహీనతతో పార్టీ పుట్టి ముంచే పరిస్ధితిని కూడా అలాంటి వ్యక్తులు తెస్తారు.
కానీ అరుణ్ జైట్లీకి ఇదేమీ పట్టినట్లు లేదు. విచిత్రం ఏమిటంటే అరుణ్ జైట్లీ ప్రకటనను బి.జె.పి లోనీ ఏ యితర నాయకుడు ఖండించిన పాపాన పోలేదు. మోడి నిజంగానే పార్టీకి మించిన పాపులర్ నాయకుడా? ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ నే తీసుకోండి. మోడి అనే వ్యక్తి ఎవరో తెలియకుండానే ఇక్కడ పార్టీకి కట్టుబడి పని చేసిన, చేస్తున్న కార్యకర్తలు లేరా? ఆ పార్టీ నాయకుడు బండారు దత్తాత్రేయ మోడికి ముందు నుండే పార్టీకి కట్టుబడి పని చేసిన నాయకుడు కాదా? దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు తదితర నేతలు, కార్యకర్తలు లేకుండా ఎ.పిలో పార్టీ కనీసం ఇప్పుడున్న స్ధితిలో ఐనా ఉండేదా?
మోడి ప్రధాని కావాలని బి.జె.పి నేతలు భావిస్తే భావించవచ్చు. మోడి పాపులారిటీ బి.జె.పిని అధికారంలోకి తెస్తుందని నమ్మితే నమ్మొచ్చు. కానీ పార్టీని మించిన ప్రాచుర్యం మోడి సంపాదించడని చెప్పడం మొదలు పెడితే ఇక కార్యకర్తలు పార్టీకి ఎందుకు విలువ ఇవ్వాలి? పార్టీ సిద్ధాంతాలు (ఏమన్నా ఉంటే) ఎందుకు చెప్పుకోవాలి? అదేదో మోడీకే భజన చేస్తే సరిపోదా? నిజానికి అరుణ్ జైట్లీ చేసిన పని అదే. మోడి భజన చేస్తూ పార్టీని సైతం తక్కువ చేయడానికి ఆయన తెగించారు.
తనను టీ బాయ్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసిందని మోడి ఆరోపణ. కాంగ్రెస్ లో బడా ధనికులే ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉందని, బి.జె.పి లో అయితే టీ అమ్ముకునే సామాన్యులు కూడా ప్రధాని కావచ్చని మోడి, కాంగ్రెస్ ఆరోపణను తిప్పి కొడుతూ అన్నారు.
అరుణ్ జైట్లీ గారి ‘మోడి భజన’ను కార్టూనిస్టు మోడి వ్యాఖ్యలకు జత చేసి ఈ విధంగా ఆయన భజన స్వరూపానికి రూపం ఇచ్చారు. పార్టీ గుర్తును ప్రతి కార్యకర్తా గౌరవించాలి. అది పార్టీ సిద్ధాంతాలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఆ గుర్తే పార్టీగా చలామణి అవుతుంది. బి.జె.పి పార్టీ గుర్తు కమలంలో ఒక్కో గీతా చెరిపేస్తూ చివరికి టీ కప్పు స్ధాయికి దిగజార్చడం అంటే పార్టీయొక్క ఉన్నత స్ధాయిని తగ్గించుకుంటూ మోడీ అనే వ్యక్తి స్ధాయికి దిగజార్చడం అన్న అర్ధంగా కార్టూనిస్టు సంకేతాత్మకంగా చెప్పారు. అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్య కూడా ఇలాగే ఉందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. నిజంగా నిజమే మరి!

Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: మోడి ఇమేజ్: కమలమా? టీ కప్పా? -కార్టూన్ | ugiridharaprasad