ఫ్రాన్స్ లో హింసాత్మక ఆందోళనలు


ఉక్రెయిన్ లో ఆందోళనలను అణచివేస్తున్నారంటూ ఆరోపిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండేకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం ప్యారిస్ వీధుల్లో కదం తొక్కారు. ఒలాండే అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ‘ఆగ్రహ దినం’ పాటిస్తున్నామని ప్రకటించారు. పోలీసులతో వీధి యుద్ధాలకు తలపడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారని, 250 మంది వరకు అరెస్టు చేశారని పత్రికలు తెలిపాయి. ఆందోళనకారులు కొందరు ఇ.యు నుండి ఫ్రాన్స్ బైటికి రావాలని డిమాండ్ చేయడం విశేషం. ఇ.యులో చేరనందుకు ఉక్రెయిన్ లో తీవ్ర ఆందోళనలను అమెరికా, ఇ.యు లు రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే.

ప్యారిస్ లో ఆందోళనకారులు పోలీసులపై దాడి చేయడంతో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడని ది హిందు తెలిపింది. ఫ్రాన్స్ ఆందోళనలను పశ్చిమ పత్రికలు తమకు తెలియనట్లే నటిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆందోళనలపై సంపాదకీయాలు గుప్పిస్తున్న అమెరికా, ఐరోపా పత్రికలు ప్యారిస్ ఆందోళనల గురించి చిన్న ముక్క కూడా రాసినట్లు లేదు. జర్మనీకి చెందిన ‘డ్యూశ్చ్ వెల్లే’ (DW) మాత్రమే దీనికి మినహాయింపు.

“ఫ్రాన్స్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు” అన్న బ్యానర్లను ఆందోళనకారులు ప్రదర్శించారు. అధ్యక్షుడు ఒలాండే తలకు గాడిద చెవులు తొడిగిన ఫోటోలు ప్రదర్శించారు. ‘ఒలాండే, రాజీనామా చెయ్యి’ అని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఆందోళనల్లో ప్రధానంగా మితవాద గ్రూపులకు చెందిన 50కి పైగా సంస్ధలు పాల్గొన్నాయని ఆర్.టి (రష్యా టుడే) తెలిపింది. ఋణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, అధిక నిరుద్యోగం, భారీ పన్నులు, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న విధానాలు… వీటన్నింటికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేపట్టామని ఆయా సంస్ధలు తెలిపాయి.

“ఈ రోజుల్లో వాళ్ళు అన్నివైపుల నుండీ మా డబ్బులు లాక్కుంటున్నారు. ఎప్పుడు చూసినా కొత్త పన్నులు వేస్తూనే ఉన్నారు. ఇక చాలు” అని ప్రదర్శకుల నేత చెప్పారని ఆర్.టి వార్తా సంస్ధ తెలిపింది.

ఆందోళనకారుల్లో కొందరు ఇ.యు కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. యూరోపియన్ యూనియన్ నుండి ఫ్రాన్స్ బైటికి వచ్చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇ.యులో ఉండడం వలన ఇతర సభ్య దేశాల ఋణ భారాన్ని కూడా తాము మోస్తున్నామని వారు ఆగ్రహం ప్రకటించారు. ఇతర ఇ.యు సభ్య దేశాల రుణాలు తీర్చడానికి తమపై పన్నులు బాదుతూ, పొదుపు విధానాల పేరుతో తమ వేతనాలు, సదుపాయాల్లో తీవ్రంగా కోతపెడుతున్నారని ఆరోపించారు. ఇ.యులో చేరాలని ఉక్రెయిన్ ను ఒత్తిడి చేస్తూ అక్కడి మితవాద, యూదు-వ్యతిరేక నయా నాజీ సంస్ధలను రెచ్చగొట్టిన ఫ్రాన్స్ పాలకులు తమ వీధుల్లోని ఆందోళనకారుల డిమాండ్లను వింటున్నారా?

పొదుపు విధానాల ఫలితంగా ఫ్రాన్స్ లో నిరుద్యోగం పెరుగుతోంది. నవంబర్ చివరి నాటికి ఫ్రాన్స్ నిరుద్యోగుల సంఖ్య 33 లక్షలకు పెరిగింది. వేతనాలు, సౌకర్యాలలో ఇప్పటికే కోతలు అమలు చేస్తున్న ప్రభుత్వం 2015-2017 కాలానికి గాను మరో 50 బిలియన్ యూరోలు (68 బిలియన్ డాలర్లు) మేర కోతలు అమలు చేయనున్నట్లు ఒలాండే ప్రభుత్వం ప్రకటించింది.

అధ్యక్షుడు ఒలాండే ఒక సినీ నటి కోసం తన భార్యకు విడాకులు ఇవ్వడం పైన కూడా కొందరు ఆందోళనకారులు ఫిర్యాదు చేశారని ఆర్.టి తెలిపింది. సినీ నటి జులీ గయేత్ కోసం తన భార్య వేలెరీ త్రియర్ వీలర్ (ఈమె ప్రస్తుతం ఒక ఎన్.జి.ఓ సంస్ధ తరపున భారత్ పర్యటనలో ఉన్నారు) తో తెగతెంపులు చేసుకున్నట్లు ఒలాండే కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఫ్రాన్స్ లో దాదాపు ప్రతి అధ్యక్షుడు ఇలా సినీ నటులతో, మోడళ్లతో అక్రమ సంబంధాలు నెరిపిన ఆరోపణలు ఎదుర్కోవడం మామూలుగా మారింది. ఇవన్నీ నిజాలుగా తేలడం ఈ ‘అక్రమ సంబంధ కుంభకోణాల’ ప్రత్యేకత.

“ఇక విసిగిపోయామని చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాం. దేశ నాయకులు నిరుద్యోగం తగ్గించడం కంటే తమ సొంత సంబంధాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు” అని ఆందోళనకారుల నాయకుడు అన్నారని డి.డబ్ల్యూ తెలిపింది.

రష్యా వార్తా సంస్ధ ఇటార్-టాస్ ప్రకారం విలేఖరులపై కూడా దాడులు జరిగాయి. వివాదాస్పద సంస్ధ అయిన ఫెమెన్ ఆందోళనకారులను ఎద్దేవా చేయడంతో వారిని పోలీసులు తొలగించారని ఇటార్-టాస్ తెలిపింది.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కొందరు ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్యారిస్ ప్రదర్శనల్లో 1,60,000 మంది వరకు పాల్గొన్నారని నిర్వాహకులు చెప్పారని ది హిందు తెలిపింది. పోలీసులు మాత్రం వీరి సంఖ్య 20,000 అని చెప్పినట్లు తెలుస్తోంది.

ఫ్రాన్స్ లో ఇస్లాం మతావలంబకుల సంఖ్య పెరిగిపోవడం పట్ల కొందరు ఆందోళనకారులు వ్యతిరేకత ప్రకటించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కరువైపోయిందని అనేకమంది వ్యాఖ్యానించారు. అబార్షన్ చట్టబద్ధం చేయడాన్ని రద్దు చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు.

ఆందోళన ముగిసే సమయానికి ముసుగులు (బలక్లావ) ధరించిన కొందరు ఆందోళనకారులు ప్రదర్శనలోకి చొరబడ్డారని వారు ఆయుధాలు, విసిరే వస్తువులు చేతబట్టి ర్యాలీని హింసాత్మకంగా మార్చారని ది హిందు తెలిపింది. ఇనప రాడ్లు ధరించి పొగబాంబులు విసురుతూ పోలీసులతో పదే పదే తలపడడంతో ఆందోళనకారులు, పోలీసులు గాయపడ్డారు. దానితో పోలీసులు 250 మందిని అరెస్టు చేశారు.

యూదు-వ్యతిరేక సంస్ధలు, ఇస్లాం-వ్యతిరేక సంస్ధలు, స్వలింగ సంపర్క వ్యతిరేకులు తదితర అనేక మితవాద సంస్ధలు ఐక్యమై ఆదివారం నాటి ఆందోళన నిర్వహించారు. ఒలాండే ప్రవేశపెట్టిన అనేక చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు.

One thought on “ఫ్రాన్స్ లో హింసాత్మక ఆందోళనలు

వ్యాఖ్యానించండి