“… వాడే నిజమైన తెలంగాణ వాది” అని అంటోంది డెక్కన్ టి.వి.
జనవరి 22 తేదీ హైద్రాబాద్ లో జరిగిన సీమాంధ్ర ధర్నాలో లగడపాటి రాజగోపాల్ కు అవమానం జరిగింది. వేదికపై ప్రసంగిస్తున్న లగడపాటిని తెలంగాణకు చెందిన యువకుడు ఒకరు కిందకు లాగేయడంతో ఆయన కింద పడిపోయారు. ఈ సంఘటన పట్ల తెలంగాణ వాదులు సంతోషంతో హర్షం ప్రకటిస్తుంటే సీమాంధ్ర లేదా సమైక్య ఉద్యమకారులు విమర్శలు కురిపిస్తున్నారు.
మొదట ఛలో అసెంబ్లీ అని ప్రకటించిన ఏ.పి.ఎన్.జి.ఓ సంస్ధ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ‘మహా ధర్నా’గా మార్చుకున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని పోలీసులు షరతులు విధించినప్పటికీ ఉపన్యాసకులు సదరు షరతులను బేఖాతరు చేస్తూ అవమానకరంగా మాట్లాడారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు.
గతంలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ ను అసెంబ్లీ ఆవరణలో వెనక నుండి వచ్చి కొట్టిన వ్యక్తి తెలంగాణలో హీరో అయ్యారు. అలాగే ఇప్పుడు లగడపాటిని వేదిక మీడినుండి కిందికి లాగిన వ్యక్తి కూడా తెలంగాణలో హీరో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అదే పనిగా వ్యతిరేకిస్తూ పలు సవాళ్ళు విసిరిన లగడపాటిని తెలంగాణ వాదులు సహజంగానే తీవ్రంగా ద్వేషిస్తున్నారు. కాబట్టి లగడపాటిని వేదిక మీది నుండి కిందికి లాగి పడేయడం వారికి సంతోషకారకం అయింది.
ఈ వీడియో డెక్కన్ టి.వి నుండి సంగ్రహించినది.
ఇటువంటి సంఘటనలు తెలుగు ప్రజల మధ్య అంతరాన్ని పెంచకుండా చూడాలి. రాజకీయాల కారణంగా తెలుగు ప్రజలు విడిపోయి శత్రువులుగా మారకుండా ప్రయత్నించాలి.
భారత్-పాకిస్తాన్ పాలకులు ఇద్దరూ…ఒకరు ఇంకో దేశాన్ని చూపించి రాజకీయాలు చేస్తున్నట్లు…. రేపు తెలంగాణ-ఆంధ్ర పాలకులు తెలుగు ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేయకుండా మేధావులతో సహా అన్ని వర్గాల వారు జాగ్రత్త పడాలి.
ఎందుకంటే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం నిన్ను నీకే శత్రువును చేయగల దుర్మార్గులు.
తస్మాత్ తెలుగు ప్రజలారా….