85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద


Inequalities

పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త! ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో మొట్ట మొదటి 85 మంది సమాజ సేవలో తరించిపోతున్నారు. ఎంతగా తరించిపోతున్నారంటే వారి సంపదలు కింది భాగంలో ఉన్న 350 కోట్ల మంది సంపదలతో సమానం అయ్యేంతగా. వీరి ప్రజా సేవ వల్ల తమ సంపదలు అంతులేకుండా పెరిగిపోతుంటే వీరి సేవలు అందుకుంటున్న సోమరిపోతుల సంపద మాత్రం తీవ్రంగా తరిగిపోతోంది. ఈ 85 మంది గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నారో తెలిసే మార్గం ఏమన్నా ఉంటే బాగుడ్ను. లేదా శ్రమ చేసేవారు సోమరితనాన్ని వీడి హాయిగా కాలు కాలు మీద వేసుకుని సంపదలు ఆర్జించే మార్గం ఏదో తెలిసినా బావుడ్ను. ఆ రకంగానైనా సోమరిపోతుల సంఖ్య తగ్గిపోయి సంపన్న ధనికుల సంఖ్య పెరిగేందుకు మార్గం దొరుకుతుంది.

350 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో సగం. వీరి సంపదలు మొత్తం కలిపితే అగ్రస్ధానంలో ఉన్న మొట్టమొదటి 85 మంది సూపర్ ధనికుల సంపదతో సమానం అని ఆక్స్ ఫామ్ అనే బ్రిటన్ స్వచ్ఛంద సంస్ధ లెక్కగట్టింది. ఆదాయాల్లో అసమానతలు తీవ్ర స్ధాయిలో పెరుగుతుండడంతో ఈ పరిస్ధితి దాపురించిందని ఆక్స్ ఫామ్ చెప్పింది. “వర్కింగ్ ఆఫ్ ద ఫ్యూ” (Working of the Few) పేరుతో ఆక్స్ ఫామ్ సోమవారం విడుదల చేసిన నివేదిక ఈ సంగతులు తెలిపింది. దరిద్రం, అన్యాయాలకు వ్యతిరేకంగా పరిష్కారాలు పరిశోధిస్తున్నట్లు ఈ సంస్ధ చెప్పుకుంటుంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్ధ (Non-Governmental Organization).

ఆక్స్ ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక వేగంగా పెరిగిపోతున్న అత్యంత సంపన్నుల సంపదల వలన ప్రపంచంలో ఆర్ధిక అసమానతలు పెరిగిపోతుండడంపై కేంద్రీకరించింది. గత సంవత్సరం మొత్తం 210 మంది కొత్తగా బిలియనీర్లు అయ్యారని నివేదిక తెలిపింది. ఇప్పటికే ఉనికిలో ఉన్న 1426 మంది బిలియనిర్లకు వీరు తోడయ్యారు. వీరి మొత్తం సంపద 5.4 ట్రిలియన్ డాలర్లు, అనగా ఇండియా వార్షిక జి.డి.పి కంటే దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ.

“అందరూ కలిసి ఉమ్మడిగా ప్రగతి సాధించడానికి బదులు ప్రజలు అంతకంతకూ ఆర్ధిక, రాజకీయ శక్తికి దూరంగా నెట్టివేయబడుతున్నారు. ఫలితంగా సామాజిక ఉద్రిక్తతలు అనివార్యం అవుతున్నాయి. ఇది సామాజిక పతనానికి దారితీసే ప్రమాదం పెరుగుతోంది” అని నివేదిక హెచ్చరించింది. సామాజిక పతనం అంటే ఆక్స్ ఫామ్ దృష్టిలో సామాజిక విప్లవాలు సంభవించడం అని అర్ధం. ప్రజలు అసంతృప్తితో తిరుగుబాటు జరిపి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆక్స్ ఫామ్ పరోక్షంగా హెచ్చరిస్తోంది. కాబట్టి ధనికులు కాస్త శ్రద్ధ తీసుకుని తాము కష్టపడి పెంచుకుంటున్న సంపదలను సోమరిపోతు శ్రామికులకు పంచాలని కోరుతోంది.

ఆక్స్ ఫామ్ చెప్పిన మరో సంగతి. ప్రపంచంలో మొట్టమొదటి 1 శాతం ధనికుల సంపద మొత్తం 110 ట్రిలియన్ డాలర్లు. లేదా కింద నుండి సగం మందిగా (350 కోట్లు) ఉన్న జనాభా మొత్తం సంపద కంటే 65 రెట్లు ఎక్కువ! “ఇంక్లూజివ్ ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలకు ఇది పెను ప్రమాదం కలిగిస్తుంది” అని ఆక్స్ ఫామ్ నివేదిక హెచ్చరించింది. “21వ శతాబ్దంలో కూడా ప్రపంచంలో సగ భాగం జనాభా సంపాదన ఒక డబుల్ డెక్కర్ బస్సులో పట్టే సంపన్నుల సంపద కంటే తక్కువగా ఉండడం చాలా ఘోరం” అని నివేదిక వ్యాఖ్యానించింది.

ఇండియాలో అత్యధిక సంపన్నుల జాబితా పెరుగుతోందిట. పదేళ్ళ క్రితం భారతీయ బిలియనీర్ల సంఖ్య 6 మాత్రమే కాగా ఇప్పుడు వారి సంఖ్య 61. వీరి మొత్తం సంపద 250 బిలియన్ డాలర్లు. ఇది 2012-13 ఇండియా జాతీయ బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే.

ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం ధనికుల సంపదలు ఇంకా ఇంకా పెరగడానికి దోహదం చేస్తున్న కారణాల్లో ముఖ్యమైనది అనేక దేశాల్లో చట్టాలు ధనికులకు అనుకూలంగా పని చేయడం. ప్రపంచంలో అత్యధిక సంపదలకు యజమానులైన వారు అధికారం లాక్కోవడంలో శక్తివంతగా లాబీయింగ్ చేస్తున్నారు. ప్రభుత్వాధికారాలు తమ గుప్పెట్లో పెట్టుకుని తాము చెల్లించే పన్నులుని తగ్గించేస్తున్నారు. ఆక్స్ ఫామ్ సంస్ధ 30 దేశాలను సర్వే చేయగా, వాటిల్లో 29 దేశాల్లో 1970ల నుండి సంపన్నులపై పన్నులు బాగా తగ్గిపోయాయి.

One thought on “85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద

  1. ప్రపంచం మొత్తానికైతై 85 మంది దగ్గర మొత్తం సంపద ఉంది. అదే మన దేశంలో ఐతే ఐదారుగురి సంపద మొత్తం భారతీయులతో సమానంగా ఉండొచ్చు.

వ్యాఖ్యానించండి