మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి.
చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను కలిగి ఉన్న ఈ సంస్ధ సౌదీ పోషణలోనే ఉన్న సంగతి బహిరంగ రహస్యం. డిసెంబర్ 29 తేదీన జరిగిన జంట పేలుళ్లకు ఈ సంస్ధ బాధ్యురాలు అయి ఉండవచ్చని వివిధ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
కొద్ది వారాల్లో రష్యా నగరం సోచిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా విధ్వంసం సృష్టించాలని, ఒలింపిక్స్ జరగకుండా చేయాలని డోకు ఒమరోవ్ అనేకసార్లు పిలుపు ఇచ్చాడు. “మన పూర్వీకుల ఎముకలపై సాగే సాతానిస్టు నర్తనలు”గా సోచి ఒలింపిక్స్ ను ఆయన అభివర్ణించాడు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు విదేశీ సంస్ధలే బాధ్యులని రష్యా పత్రికలు, నాయకులు ప్రకటించడంతో అందరి వేలు ‘కాకసస్ ఎమిరేట్స్’ వైపే చూపుతున్నాయి.
“వోల్గోగ్రాడ్ లో జరిగిన నేరస్ధ దాడులూ, అమెరికా, సిరియా, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా తదితర దేశాలలో జరిగిన అనేక టెర్రరిస్టు దాడులు ఒకే పద్ధతిలో ఉన్నాయి. వాటి ప్రమోటర్లు కూడా ఒకరే” అని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అనేక టెర్రరిస్టు సంస్ధలకు సౌదీ అరేబియా పాలకులు ప్రమోటర్లు అన్న సంగతి కూడా బహిరంగ రహస్యమే. చెచెన్ వేర్పాటువాద ఉగ్ర సంస్ధలకు సైతం సౌదీ పాలకులే ప్రమోటర్లని వివిధ సందర్భాల్లో వెల్లడి అయింది కూడా.
1990ల్లోనూ, 21వ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లోనూ రష్యాకు వ్యతిరేకంగా చెచెన్ తీవ్రవాద సంస్ధలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. వీటిని స్పాన్సర్ చేసిన చరిత్ర సౌదీ అరేబియా సొంతం. రష్యాకు సమస్యలు సృష్టించడం అమెరికా విధానమే గనుక అమెరికా పరోక్ష మద్దతు కూడా ఉన్నదని అంతర్జాతీయ పరిశీలకులు తరచుగా చెప్పే మాట.
వోల్గో గ్రాడ్ పేలుళ్ళ అనంతరం సౌదీ అరేబియా ఇంటలిజెన్స్ చీఫ్ ప్రిన్స్ బందర్ సుల్తాన్ రష్యాకు చేసిన హెచ్చరికను పలువురు గుర్తుకు తెచ్చారు. సిరియా తిరుగుబాటులో ఆ దేశ అధ్యక్షుడు బాషర్ ఆల్-అస్సాద్ కు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, అలా చేస్తే ప్రతిఫలంగా సోచి వింటర్ ఒలింపిక్స్ ను చెచెన్ తీవ్రవాదులు అడ్డుకోకుండా చూస్తామని ప్రిన్స్ బందర్ పుతిన్ తో ఒప్పందానికి రావడానికి ప్రయత్నించాడని లెబనాన్ పత్రిక అస్-సఫిర్ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలవడానికి సౌదీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ రెండుసార్లు రహస్యంగా రష్యా పర్యటించాడని లెబనాన్ పత్రిక తెలిపింది. “నల్ల సముద్రం ఒడ్డున సోచి నగరంలో జరిగే వింటర్ ఒలింపిక్స్ ను రక్షిస్తామని మేము మాట ఇవ్వగలం… ఒలింపిక్స్ గేమ్స్ భద్రతకు ప్రమాదంగా పరిణమించిన చెచెన్ తీవ్రవాద గ్రూపులు మా నియంత్రణలోనే ఉన్నారు. మాతో సమన్వయం లేకుండా వారు సిరియా భూభాగం వైపు ఒక్క అంగుళం కూడా కదలరు” అని ప్రిన్స్ బందర్ పుతిన్ తో చెప్పారని ఆస్-సఫిర్ తెలిపింది.
ఈ సంభాషణ జరిగిందని చెప్పిన మూడు వారాలకే వోల్గోగ్రాడ్ రైల్వే స్టేషన్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. అదే రోజు అదే నగరంలో మరో చోట మరో టెర్రరిస్టు దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో 34 మంది మరణించగా 60 మంది వరకు గాయపడ్డారు.
“కొంతమంది నిపుణుల ప్రకారం వోల్గో గ్రాడ్ పై జరిగిన జంట టెర్రరిస్టు దాడులు సిరియా నుండే జరిగాయి. దాని అర్ధం రష్యా, సౌదీ అరేబియాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయనే” అని మాస్కో లోని ఒక ప్రైవేట్ టీ.వి చానెల్ దోఝ్ పేర్కొందని ది హిందూ, ఆర్.టి లు తెలిపాయి.
“ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ రష్యాను బెదిరించాడని చెప్పడానికి పత్రాల ఆధారాలేమీ లేవు. కానీ రష్యాలోని వహాబి టెర్రరిజం పర్షియన్ గల్ఫ్ లోని సలాఫీ పాలకుల నుంచి మద్దతు పొందుతోంది అనడంలో కూడా ఎటువంటి అనుమానమూ లేదు. వీరిలో సౌదీ అరేబియాది ప్రముఖ స్ధానం” అని రష్యా పత్రిక ఇజ్వెస్తియా పేర్కొందని ది హిందు తెలిపింది.
అణచివేతకు గురవుతున్న వివిధ ముస్లిం మతాలవంబక జాతులు ఉగ్రవాద చర్యల ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారనడంలో సందేహం లేదు. కానీ ఇది పాక్షిక వాస్తవం మాత్రమే. ఉగ్రవాదం ప్రజల వరకే పరిమితం అయి ఉన్నంత వరకూ దానిని అణచివేయడం చాలా తేలిక. కానీ వీరికి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు తోడు కావడమే అసలు సమస్య. ముస్లిం ఉగ్రవాదానికి తగిన సైద్ధాంతీక, ఆర్ధిక, నైతిక మద్దతు సమకూర్చి పెడుతున్నది పశ్చిమ రాజ్యాలే అన్నది నిష్టుర సత్యం. స్వతంత్ర రాజ్యాల్లో పశ్చిమ రాజ్యాల సైనిక, రాజకీయ జోక్యానికి దారులు వేసేది ముస్లిం తీవ్రవాద దాడులే అని గ్రహిస్తే ముస్లిం తీవ్రవాద వలయం ఎక్కడి నుండి మొదలై ఎక్కడ ముగుస్తుందో ఇట్టే అర్ధం అవుతుంది.











