ఎఎపి పాలన: చిల్లర వర్తకం ఎఫ్.డి.ఐకి నో


Kejriwal 3

ఢిల్లీ ప్రభుత్వం పాత నిర్ణయాన్ని తిరగదోడింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్న షీలా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. తాము ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకం కాదని కానీ తమ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రిటైల్ వర్తకం ఎఫ్.డి.ఐ చట్టం ప్రకారం బహుళ బ్రాండుల చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించేదీ లేనిదీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేయబడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని గత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసిన నిర్ణయాన్ని ఆమోదించింది. ఢిల్లీ రాష్ట్రంలో రిటైల్ వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలకాలాని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని ఎఎపి తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ హామీని నిరవేరుస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పత్రికలకు తెలిపారు.

తమ ముందరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పామని అరవింద్ తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వలన ఉపాధికి నష్టం జరుగుతుందని అరవింద్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. “రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల వలన వినియోగదారులకు ఎంపిక చేసుకునే అవకాశాలు కొంతవరకు పెరుగుతాయని మేము అంగీకరిస్తాం. కానీ తద్వారా నిరుద్యోగం పెచ్చరిల్లడానికి ఎఎపి అంగీకరించబోదు… ఢిల్లీ నగరం ఎఫ్.డి.ఐ లకు సిద్ధంగా లేదు” అని అరవింద్ తెలిపారు.

రిటైల్ వర్తకంలో ఎఫ్.డి.ఐ లను అనుమతిస్తూ యు.పి.ఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న సందర్భంగా చెప్పిన కారణాలు వాస్తవం కాదని విదేశీ అనుభవాలు రుజువు చేశాయని ముఖ్యమంత్రి అరవింద్ ఎత్తి చూపారు. యు.పి.ఎ ప్రభుత్వం చెప్పిన కారణాలు ఎంతటి వాస్తవ విరుద్ధమో ఒక్క అరవింద్ మాత్రమే కాదు, అనేకమంది సామాజికవేత్తలు, ఆర్ధిక నిపుణులు, వ్యాపారవేత్తలు కూడా చెప్పారు.

కానీ చిల్లర వర్తక రంగాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తామని ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ బహుళజాతి కంపెనీలకు ఎన్నాళ్లుగానో వాగ్దానం ఇస్తూ వస్తోంది. ఈ వాగ్దానం ఎంతకీ నెరవేర్చకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా స్వయంగా రంగంలోకి దిగి గత సంవత్సరం ఆరంభంలో భారత పాలకులకు హెచ్చరిక చేశారు.

అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత్ పర్యటించి రిటైల్ ఎఫ్.డి.ఐ లకు వ్యతిరేకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా. భారత దేశీయుల ప్రయోజనాల కంటే విదేశీ కంపెనీల ప్రయోజనాలే మిన్నగా భావించే పాలకులు చివరికి విదేశీ కంపెనీలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చారు.

ఇలాంటి నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఉపసంహరించడం తప్పకుండా ప్రజలకు లాభిస్తుంది. పోటీ పేరుతో పెట్టుబడులు పెద్దగా అందుబాటులో లేని భారత వ్యాపార సంస్ధలను, భారీ పెట్టుబడుల మూటలపై కూర్చుని ఉన్న విదేశీ కంపెనీలను ఒకే బరిలోకి దించడం నీతిమాలిన చర్య. అసమానుల మధ్య సమాన పోటీ ఎన్నటికీ సమానం కానేరదు. పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా పశ్చిమ దేశాల ఆర్ధిక సంక్షోభం భారత దేశంలోకి కూడా మరింతగా విస్తరించడానికే ఎఫ్.డి.ఐ లు తోడ్పడతాయి.

4 thoughts on “ఎఎపి పాలన: చిల్లర వర్తకం ఎఫ్.డి.ఐకి నో

  1. పింగ్‌బ్యాక్: ఎఎపి పాలన: చిల్లర వర్తకం ఎఫ్.డి.ఐకి నో | ugiridharaprasad

  2. The Aam Aadmi Party’s decision to disallow foreign direct investment (FDI) in Delhi’s retail sector has a taker of sorts in economics Nobel laureate Joseph Stiglitz. He also tells Indivjal Dhasmana interest rates won’t be of much use in curbing inflation. Edited excerpts

    http://wap.business-standard.com/wapnew/fdi-in-retail-wont-necessarily-make-a-country-better-off-joseph-stiglitz-5-114011400852

వ్యాఖ్యానించండి