చలికి చివికిపోతున్న అమెరికా దౌత్యం -కార్టూన్


Diplomatic chill

తాజా రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిణామాలను ఉనికిలో ఉన్న వాతావరణంతో పోలిక పెట్టి పాఠకులకు గిలిగింతలు పెట్టడం కార్టూనిస్టులకు ఇష్టమైన విద్య. ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కూడా ఈ కార్టూన్ లో ఈ విద్యనే ప్రదర్శించారు.

పోలార్ వొర్టెక్స్ ప్రభావంతో గత వారం అంతా అమెరికా చలితో గజ గజ వణికిపోయింది. కొన్ని చోట్ల -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయేంతగా చలి గాలులు అమెరికాను పీడించాయి. ఆర్కిటిక్ చలి వాతావరణాన్ని సహజసిద్ధంగా పట్టి బంధించే పోలార్ వొర్టెక్స్, గ్లోబల్ వార్మింగ్ వలన బలహీనపడడంతో అక్కడి చలి గాలులు కాస్తా దక్షిణ దిశగా ప్రయాణించడం వల్లనే అమెరికా, కెనడాలు వణికించే చలిలో మునగడదీసుకున్నాయని శాస్త్రజ్ఞులు ఇచ్చిన వివరణ.

పోలార్ వొర్టెక్స్ చలితో పాటు రాయబార చలి కూడా అమెరికాను వణికిస్తోందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఎడ్వర్డ్ స్నోడెన్ విషయంలో రష్యాతో రాయబారం నెరపడంలో పూర్తిగా విఫలమై మొఖం మాడ్చుకున్న అమెరికా అప్పటి నుండి వరుస దెబ్బలు తింటూనే ఉంది. మృగరాజు గారు బలహీనపడితే చిట్టెలుకకు కూడా లోకువ అవుతారని చిన్నప్పటి కధల్లో చదువుకున్నాం. తగుదునమ్మా అంటూ దురాక్రమణ యుద్ధాలకు దిగి ఇల్లూ, ఒల్లూ గుల్ల చేసుకున్న అమెరికా భౌగోళిక రాజకీయాల్లో వరుస దెబ్బలు తింటూ షేపులు కోల్పోతున్న పరిస్ధితిలో ఉంది.

ఇటీవలి అమెరికా రాయబార వైఫల్యాలు చదివితే పెద్ద జాబితాయే అవుతుంది. ఎడ్వర్డ్ స్నోడెన్ మాస్కో విమానాశ్రయంలో ఉండగానే ఆయనను దొంగచాటుగా తీసుకెళ్తున్నారంటూ బొలీవియా అధ్య్కషుడి జెట్ విమానాన్ని మధ్యలోనే అడ్డగించి ఆస్ట్రియాలో బలవంతంగా దింపించడం ద్వారా అమెరికా అటు దక్షిణ అమెరికా దేశాలతో పాటు యూరప్ దేశాల ఆగ్రహాన్నీ చవి చూసింది. అధ్యక్షుడు ఇవా మొరేల్స్ విమానంలో ఎడ్వర్డ్ స్నోడెన్ ను దాచి పెట్టారని సి.ఐ.ఏ నమ్మకంగా చెప్పడంతో ఆయన విమానానికి స్పెయిన్, జర్మనీ, హాలండ్, ఫ్రాన్స్ దేశాలు తమ గగనతలంలో ప్రవేశించకుండా నిరోధించాయి. దానితో విమానం ఆస్ట్రియాలో దిగాల్సి వచ్చింది. తీరా ఆ విమానంలో ఎడ్వర్డ్ స్నోడెన్ లేకపోవడంతో ఐరోపా దేశాలకు తలకొట్టేసినట్లు కాగా అమెరికా కన్నంలో దొరికిన దొంగలా కిక్కురుమనలేదు.

ఈజిప్టులో మహమ్మద్ మోర్శి ప్రభుత్వాన్ని అక్కడి సైన్యం బలవంతంగా గద్దె దించినా అమెరికా ఏమీ చేయలేకపోయింది. దాని చిరకాల మిత్రుడు సౌదీ అరేబియా అమెరికా ఒత్తిడిని పక్కన పెట్టి ఈజిప్టు సైనిక నియంతృత్వానికి 6 బిలియన్లకు పైగా సాయం ప్రకటించి ధిక్కార స్వరం వినిపించింది.

సిరియాపై దాదాపు యుద్ధం ప్రకటించిన అమెరికా రష్యా దౌత్య ఎత్తుగడలకు చిన్నబోయి తోక ముడిచింది. రష్యా ముందు ఓడిపోవడం ఒక అవమానం అయితే, అలా తోక ముడిచినందుకు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావడం అమెరికాకు మరో అవమానం. సిరియా రసాయన ఆయుధాలను ఐరాసకు అప్పజెప్పడం ద్వారా ఆ దేశంపై దాడి చేసే అవకాశం అమెరికాకు తప్పిపోయింది. మునుపటిలా మిలట్రీ దాడులకు తెగబడి ఆర్ధికంగా నిలదొక్కుకునే పరిస్ధితిలో అమెరికా లేని సంగతి లోకానికి వెల్లడి కావడం ఈ రెండింటి కంటే మించిన పెద్ద అవమానం.

ఇవా మొరేల్స్ విమానాన్ని అడ్డగించినందుకు ప్రతీకారంగా అమెరికా వ్యాపార రాయితీలను ఈక్వడార్ ఛీకొట్టి వదిలించుకోగా ఆఫ్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ కూటమిలో అమెరికా ఏకాకిగా మిగిలిపోయింది.

చివరికి అమెరికా జేబులో ఉండే ఇండియా పాలకులు కూడా అమెరికా దౌత్య విధానాన్ని ప్రశ్నిస్తున్న పరిస్ధితి నెలకొనడం అమెరికాకి దౌర్భాగ్యమే మరి. దేవయాని గొడవ ఫలితంగా అమెరికా రాయబారులు అనాదిగా అనుభవిస్తున్న సౌకర్యాలను ఇండియా రద్దు చేసేయడం, వాటిని పునరుద్ధరించే పరిస్ధితి కనుచూపుమేరలో లేకపోవడం అమెరికా దౌత్య పతనానికి పరాకాష్ట!

వ్యాఖ్యానించండి