ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు లొంగిపోయిన గుడ్స ఉసెండి అలియాస్ సుఖదేవ్ అలియాస్ గుముడవెల్లి వెంకట కృష్ణ ప్రసాద్ ను విప్లవ ద్రోహి గా సి.పి.ఐ(ఎం-ఎల్-మావోయిస్టు) పార్టీ ప్రకటించింది. పార్టీతో ఆయనకు సైద్ధాంతీక విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఒట్టిదే అని పార్టీ తెలిపింది. నైతికంగా దిగజారిన సుఖదేవ్ విప్లవ ద్రోహిగా మారి పోలీసులకు లొంగిపోయాడు తప్ప రాజకీయ విభేదాల వల్ల కాదని తెలిపింది. ఆయన భార్య పార్టీలోనే కొనసాగుతున్నారని, బైటికి వెళ్ళేటప్పుడు కూడా వేరే మహిళను వెంటపెట్టుకుని వెళ్ళి లొంగిపోయాడని తెలిపింది. దాన్ని బట్టే ఆయన స్వభావం తెలుసుకోవచ్చని తెలిపింది.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, ఛత్తీస్ ఘర్ మావోయిస్టు పార్టీ ప్రతినిధి (spokesperson) అయిన జి.వి.కె.ప్రసాద్ గత వారం ఆంధ్ర పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం క్షీణించిందని, మావోయిస్టు పార్టీతో విభేదాలు తలెత్తాయని అందుకే ఆయన లొంగిపోయాడని పోలీసులు పత్రికలకు తెలిపారు. ఛత్తీస్ ఘర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్ని దాదాపు తుడిచిపెట్టిన దాడికి పధకం రచించాడని, 70 మందికి పైగా పారామిలట్రీ దళాలను మట్టుబెట్టిన దాడికి కూడా పధక రచన చేశాడని ప్రచారం పొందిన గుడ్స ఉసెండి లొంగుబాటు అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఇంత భారీ దాడులకు కారణం అయిన నాయకుడు మావోయిస్టుల హింసాయుత రాజకీయాలు నచ్చక లొంగిపాయాడని వార్తలు రావడం మరింత ఆశ్చర్యం కలిగించింది.
మావోయిస్టు పార్టీ ప్రకటనతో ఈ అనుమానాలు, ఆశ్చర్యం తొలగినట్లయింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ చేసిన ఆడియో ప్రకటనను ది హిందూ పత్రికా విలేఖరికి ఫోను ద్వారా వినిపించారని పత్రిక తెలిపింది. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేసే సాంస్కృతిక సంస్ధ అయిన చైతన్య నాట్య మంచ్ (సి.ఎన్.ఎం) కు చెందిన సీనియర్ నాయకులు ఒకరు ఈ ఆడియోను వినిపించారని ది హిందు పత్రిక తెలిపింది.
రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న ప్రకటన ప్రకారం జి.వి.కె.ప్రసాద్ ఏనాడూ తనకు ఉన్నాయని చెబుతున్న రాజకీయ విభేదాలను పార్టీ ముందు పెట్టలేదు. విభేదాలు నిజంగా ఏమన్నా ఉంటే వాటిని ఎన్నడూ చర్చింది కూడా లేదు. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలకు ఆయన ఎన్నడూ అభ్యంతరం కూడా చెప్పలేదు. సైద్ధాంతీక అంశాలపై తనకు విభేదాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కూడా ఎన్నడూ చెప్పలేదు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా తనకు పార్టీతో విభేదాలు ఉన్నాయని చెప్పుకోవడం ‘కట్టు కధలు’ అల్లడం తప్ప మరొకటి కాదని సదరు ఆడియో ప్రకటన పేర్కొంది.
జి.వి.కె.ప్రసాద్ అలియాస్ సుఖ దేవ్ అలియాస్ గుడ్స ఉసెండి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి అని ది హిందు తెలిపింది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఆడియో ప్రకటన ప్రసాద్ లొంగుబాటును తీవ్రంగా ఖండించిందని పత్రిక తెలిపింది. ఆయన నైతికంగా పతనమైన వ్యక్తి అనీ నైతిక కారణాల రీత్యా 1993లో పార్టీ నుండి సస్పెండ్ చేశారని ప్రకటన పేర్కొంది. అయితే సుఖదేవ్ అనేకసార్లు విన్నవించుకోవడంతో మళ్ళీ పార్టీలోకి అనుమతించారని తెలిపింది. అయినప్పటికీ సుఖదేవ్ తాను బలహీన వ్యక్తిని అని తన లొంగుబాటు ద్వారా మరోసారి రుజువు చేసుకున్నాడని స్పష్టం చేసింది. పార్టీలో ఉండగా ఆయన నైతిక వర్తన గురించి పార్టీ వివిధ సందర్భాల్లో ప్రశ్నించిందని ఇప్పుడు కూడా ‘మరో మహిళా కామ్రేడ్ తో’ కలిసి వెళ్లిపోయాడని ప్రకటన తెలిపింది.
“ఆయన భార్య రాజే ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. సుఖదేవ్ మాత్రం సంతోషి మడకం తో కలిసి లొంగిపోయాడు. మరో మహిళా కామ్రేడ్ ను తీసుకుని వెళ్లిపోవడాన్ని బట్టే ఆయన స్వభావం ఏమిటో పార్టీ కామ్రేడ్లకు అర్ధం అవుతోంది” అని ప్రకటన పేర్కొంది.
జి.వి.కె.ప్రసాద్ మొదటి భార్య 1990ల్లో ఒక పోలీస్ యాక్షన్ లో చనిపోయారనీ, అనంతరం ఆయన పార్టీ కేడర్ లోని రాజిని పెళ్లి చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) పత్రిక తెలిపింది. ఆమె ఇప్పటికీ పార్టీలో చురుకుగా ఉన్నారని తెలిపిన టి.ఓ.ఐ “ఆయన తన భార్యను, విప్లవోద్యమాన్ని వదిలిపెట్టి మరో మహిళ సంతోషి మడకంతో వెళ్ళిపోయి పోలీసులకు సరెండర్ అయ్యాడు. సంతోషినే తన భార్యగా ఆయన చెప్పుకున్నాడు” అని రామన్న ప్రకటించారని టి.ఓ.ఐ తెలిపింది. 1980ల్లో ఉద్యమంలో చేరిన జి.వి.కె.ప్రసాద్ 1990ల్లో బైటికి వెళ్లిపోయాడని అనంతరం బైటికి వెళ్లినందుకు క్షమాపణలు చెబుతూ తిరిగి పార్టీలో చేరాడని రామన్న ప్రకటనను ఉటంకిస్తూ టి.ఓ.ఐ తెలిపింది.
సుఖదేవ్ లొంగుబాటు గురించి పార్టీకి ఎలాంటి సమాచారం లేదని సి.ఎన్.ఎం నాయకుడు చెప్పారని ది హిందు తెలిపింది. సదరు సి.ఎన్.ఎం నాయకులు సుఖదేవ్ కు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అని పత్రిక తెలిపింది. “అర్బన్ ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఆయనను బైటికి వెళ్లవలసిందిగా పార్టీ ఆదేశించినట్లు కొన్ని పత్రికలు రాస్తున్నాయి. కానీ అందులో వాస్తవం లేదు. నిరాధారమైన వార్తలవి. ఉసెండిపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆయన నైతిక వర్తనకు వ్యతిరేకంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలే ఆయన లొంగుబాటుకు దారితీసాయి” అని సి.ఎన్.ఎం నాయకుడిని ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.
గుడ్స ఉసెండి అన్న పేరు మావోయిస్టు పార్టీ ప్రతినిధికి సాంప్రదాయకంగా ఇచ్చే పేరు అని తెలుస్తోంది. ఈ సంగతిని జి.వి.కె.ప్రసాద్ స్వయంగా గతంలో ఒకసారి ది హిందూ విలేఖరి సువోజీత్ బాగ్చికి చెప్పినట్లు తెలుస్తోంది. “గుడ్స ఉసెండి అబుజ్ మఢ్ కు చెందిన పార్టీ సభ్యుడు. ఆయనను 26 ఏప్రిల్, 1999లో చంపేశారు. ఒర్ఛ ప్రాంతం నుండి అమరుడైన మొట్టమొదటి గిరిజనుడు ఆయన. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధిగా ఎవరు నియమించినా ఆయనకు ఈ పేరును కేటాయిస్తారు” అని ప్రసాద్ వివరించారని ది హిందు తెలిపింది. తమ పార్టీ గురించి ఆయన చాలా ఉన్నతంగా చెప్పేవారనీ, నైతిక అవినీతిని పార్టీ అస్సలు సహించదని చెప్పారని అలాంటి వ్యక్తినే పార్టీ ఇప్పుడు నైతికంగా పతనమైన వ్యక్తి అని పేర్కొంటోందని ది హిందు ఆశ్చర్యం వెలిబుచ్చింది.
ది హిందు పత్రిక (సువోజిత్ బాగ్చి) ప్రకారం అటవీ ప్రాంతంలో పార్టీ ప్రతినిధిగా గత 5 యేళ్లుగా బహుళ ప్రాచుర్యం పొందాడు. అనేకమంది రచయితలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు బస్తర్ పర్యటించినప్పుడు ఆయనే తోడుగా వచ్చేవాడు. ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చినా ఆయననే తమ ప్రతినిధిగా ఎందుకు నియమించారో ఆశ్చర్యంగా ఉందని పత్రిక వ్యాఖ్యానించింది. అయితే జి.వి.కె.ప్రసాద్ బహు భాషల్లో ప్రవేశం కలిగిన వ్యక్తిగా తెలుస్తోంది. అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా యువ కార్యకర్తలకు బోధించడం లోనూ, నాయకత్వం వహించడం లోనూ ముందు నిలవడం వలన ఆయన స్ధానంలో మరొకరిని నియమించడం పార్టీకి దాదాపు అసాధ్యంగా మారిందని మరో లొంగిపోయిన మావోయిస్టు నాయకుడిని ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.


“అర్బన్ ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఆయనను బైటికి వెళ్లవలసిందిగా పార్టీ ఆదేశించినట్లు కొన్ని పత్రికలు రాస్తున్నాయి.
అర్బన్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమమా…? ఎలా సాధ్యం. బహుశా సానుభూతిపరులుగా ఉంటూ సాయం అందించమా…?