దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని పూర్తి చేసింది.
దేవయాని విషయంలో అమెరికా, భారత అధికారుల మధ్య తెర వెనుక చర్చలు జోరుగా సాగాయి. వాషింగ్టన్ లోని భారత ఎంబసీ అధికారులు, అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తీవ్రత తగ్గించిన నేరారోపణలకు భారత అధికారులు అంగీకరించకపోవడంతో గురువారం నాటికి చర్చలు విఫలం అయ్యాయని పత్రికలు తెలిపాయి. అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విధంగా నేర తీవ్రతను తగ్గించేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
దేవయాని ఇండియా వచ్చిన తర్వాతనే ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. ప్రీత్ భరార నేతృత్వంలోని ప్రాసిక్యూటర్లు ఏదో విధంగా దేవయానిపై క్రిమినల్ చర్యలు నమోదు చేయడానికీ, ఆమెను అమెరికాలోనే విచారించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. “చిన్న పాటి నేరాభియోగం (misdemeanour) కూడా క్రిమినల్ కౌంట్ కిందకే వస్తుంది… మనకు సంబంధించినంతవరకు ఒక భారత రాయబారి అమెరికాలో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కోవడం అన్నదే అస్సలు ఆమోదయోగ్యం కాదు” అని భారత అధికార వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.
దేవయాని ఎంత చిన్నపాటి నేరాన్నయినా అంగీకరిస్తూ కనీసం ఒక్క డాలర్ చెల్లించడానికి కూడా భారత అధికారులకు ఆమోదయోగ్యంగా కనిపించలేదు. “ఈ ఆలోచనతో మన అవగాహనకు అనుకూలంగా, అననుకూలంగా బుక్ లో ఏమేమి ఉన్నాయో పరిశీలించాం… అయితే ఇరు పక్షాల మధ్య పతిష్టంభన తప్ప మరొకటి లేదని మాకు అర్ధమైంది. ఆ వెంటనే ఐరాస రాయబారిగా ఆమెకు వీసా సంపాదించడం తప్ప మరో మార్గం లేదని గ్రహించాము” అని భారత అధికారులు తెలిపారు.
భారత అధికారులు ఏ పరిస్ధితుల్లోనూ తమ దారికి రాకపోవడంతో అమెరికా విదేశాంగ, న్యాయ శాఖ అధికారులు మరింత కఠిన వైఖరి అవలంబించినట్లు కనిపిస్తోంది. ఐరాస రాయబారిగా వీసా పొంది దాని ఆధారంగా దేవయాని ఇండియా వచ్చిన దరిమిలా సదరు వీసా రద్దయినట్లేనని, ఆమెపై నేరారోపణలు కొనసాగుతాయని అమెరికా విదేశీ శాఖ ప్రతినిధి జెన్ సాకి ప్రకటించారు.
ఐరాస రాయబారిగా దేవయాని తన వీసా హోదా కోల్పోయిన మాట వాస్తవమే. ఎందుకంటే దేవయాని ఐరాస భారత శాశ్వత కార్యాలయంలో పని కొనసాగించినట్లయితే ఆమె ఉండాల్సింది న్యూయార్క్ లో తప్ప ఇండియాలో కాదు. పైగా దేవయానిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో మరో భాధ్యతలు అప్పగించినట్లు భారత ప్రభుత్వమే ప్రకటించింది.
ఈ నేపధ్యంలో దేవయానికి వ్యతిరేకంగా ‘లుక్ ఔట్’ వారంట్ జారీ చేసే అవకాశం ఉందని, అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె కోసం కనిపెట్టుకుని ఉంటారని జెన్ సాకి తెలిపింది. ఒకవేళ ఆమె తిరిగి అమెరికా వచ్చే పనైతే అమెరికా పోలీసులు అరెస్టు చేస్తారని తెలిపింది. అయితే ఇంటర్నేషనల్ అరెస్టు వారంట్ జారీ చేస్తారా లేదా అన్నది తెలియలేదు. వారంట్ జారీ అవుతుందని సాకి చెప్పినప్పటికీ అది అంతర్జాతీయ వారంటా లేక అమెరికా జాతీయ వారంటా అన్నది తెలియలేదు.
బుధవారం (జనవరి 8) తాము దేవయానికి ఐరాస రాయబారి హోదాలో వీసా జారీ చేశామని, ఆ వెంటనే ఈ వీసా కారణంగా దేవయానికి ఒనగూరే రక్షణాలను ఉపసంహరించాల్సిందిగా ఇండియాను కోరామని జెన్ సాకి తెలిపారు. దీనిని భారత ప్రభుత్వం తిరస్కరించడంతో వెనువెంటనే అమెరికాలో అమలులో ఉన్న ప్రొసీజర్ ప్రకారం ఆమెను దేశం విడిచి వెళ్లాలని కోరారు. ఇది పరోక్షంగా ‘పర్సోన నాన్-గ్రేటా’ (అవాంఛనీయ వ్యక్తి) గా ప్రకటించడమే. తీవ్ర నేరాలు చేసిన రాయబారులకు రాయబార రక్షణ ఉన్నట్లయితే ఈ విధంగా ‘అవాంఛనీయ వ్యక్తి’గా ప్రకటించి దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తారు. దేవయానికి దీనినే వర్తింపజేశారు.
ఇదిలా ఉండగా సంగీత రిచర్డ్స్ మొదటిసారి నోరు విప్పి తనను బానిస లెక్కన చూశారాని ఆరోపించారు. రోజులో గరిష్ట గంటలపాటు పని చేయించేవారని తనను తీవ్రంగా బాధించారని ఆరోపించారు. తనను ఇండియా పంపించమని కోరినప్పటికీ అంగీకరించలేదని తన పాస్ పోర్టు ను స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. కానీ ఈ ఆరోపణలపై అనేక అనుమానాలు ఉన్నాయి. సంగీత రిచర్డ్ కుటుంబం ఇండియాలో ఉండగానే అనేక దేశాల రాయబార కార్యాలయాలతో మంచి సంబంధాలు ఉన్న కుటుంబం. ఈ సంబంధాల కారణంగానే సంగీత కుటుంబ సభ్యులను భారత ప్రభుత్వానికి చెప్పకుండా అమెరికా రాయబారులు న్యూయార్క్ తరలించారు. వారు ఇండియాలో అమెరికా రాయబార కార్యాలయం తరపున పని చేసిన గూఢచారులని, వారిని రక్షించుకోవడానికి తమ అక్రమ గూఢచర్యం బైటపడకుండా ఉండడానికీ సమస్యను దేవయాని పైకి మళ్లించారని అనుమానాలు ఉన్నాయి. ఈ అంశాలపై స్పష్టత లేకుండా సంగీత ఆరోపణలను నమ్మడానికి వీలు లేదు. అమెరికా ప్రపంచవ్యాపితంగా సాగించే గూఢచర్యం బైటపడే సమయంలో అనుసరించిన విధానాన్నే సంగీత కేసులోను అనుసరించింది. ఇలాంటి సంఘటనలు అమెరికా రాయబార చరిత్రలో కోకొల్లలు. ఈ కారణం వల్లనే సంగీత రిచర్డ్స్ కుటుంబం పై సానుభూతి చూపడానికి అవకాశం లేకుండా పోయింది.
