అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్!
మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. ఎఎపి శక్తిని అంచనా వేయడంలో విఫలం అయినందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను సోనియా గాంధీ అన్న మాట అనకుండా తిట్టిపోశారని కొన్ని పత్రికలు గోణిగాయి కూడా.
ఇక బి.జె.పి సంగతి ఆ పార్టీ నేతలకే తెలియాలి. (ఆఫ్ కోర్స్, తెలియకే ఏమీ అనడం లేదనుకోండి!) దేశంలో వీస్తోంది మోడీ గాలా లేక ఆమ్ ఆద్మీ గాలా అని వారికి అర్ధం అయీ అవకుండా ఉన్నట్లుంది.
గంగా నది శివుడి తల మీది నుండి భువికి ఏతెంచిన విధానం ఎట్టిదో గంగావతరణం లోనో మరెక్కడో కవులు చెప్పి ఉన్నారు. అదేదో పాటలో ‘చినుకులా రాలి….’ అని మొదలు పెట్టి సముద్రంలో కలిసే వరకు సాగే నదీ ప్రవాహాన్ని ప్రేమతో పోల్చాడో కవి. ఎఎపి పరిణామం కూడా అదే తరహాలో సాగింది.
ఈ ఎఎపి నది జన సముద్రంలో కలిసే క్రమంలో మునుముందు అనేక పరీక్షలు ఎదురు కావడం తధ్యం. ప్రజల కోసం నిజాయితీగా పని చేయడానికి అనుమతించే వ్యవస్ధలో మనం లేము. దీనిని నడుపుతున్నదే భూస్వామ్య-పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద’ వర్గాలు. వీరికి ముల్లు గుచ్చుకున్న రోజున ఎన్నెన్ని కుట్రలకు దిగుతారో తెలియాల్సి ఉంది. ఈ కుట్రలని కూడా ప్రజల సహాయంతో ఎదుర్కోవడానికి సిద్ధపడితేనే ఆ పార్టీ నిలుస్తుంది. కానీ కుట్రలు ఎదుర్కొనే ప్రక్రియ అహింసాయుతంగా, ఆమరణ దీక్ష చేసి విరమించుకున్నట్లుగా మాత్రం ఉండబోదని ఎఎపికి తెలిసే రోజు తప్పకుండా వస్తుంది.

కానీ కుట్రలు ఎదుర్కొనే ప్రక్రియ అహింసాయుతంగా, ఆమరణ దీక్ష చేసి విరమించుకున్నట్లుగా మాత్రం ఉండబోదని ఎఎపికి తెలిసే రోజు తప్పకుండా వస్తుంది.
This is a sad truth really. You are right.
నిజమే శేఖర్ గారూ….మనదేశంలో అవినీతికి ఆనవాలు….అన్ని అవలక్షణాలకు కారణం కాంగ్రెస్ పార్టీ.
ఆ అవినీతినే ప్రధాన శత్రువుగా ప్రచారం చేసి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఢిల్లీలో ఆ రెండు కలిసి….( మద్దతే కావచ్చు.) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నిజమే రాజకీయాలు కడు విచిత్రంగా ఉంటాయి. ముందు ముందు మరిన్ని చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తుంది.
అన్నట్లు భూస్వామ్య-పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద’ వర్గాల కు అతీతంగ ఎ ఎ పి రాజకీయాలు నడపగలదా అలా అయితే దాన్ని కొనసాగనిస్తారా?