దేవయాని సమస్య ఎట్టకేలకు పరిష్కారం అవుతోంది. గురువారం వరుసగా, వేగంగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓ వైపు న్యూయార్క్ ప్రాసిక్యూషన్ కోర్టులో దేవయానిపై అభియోగాలను మోపడం పూర్తి అవుతుండగానే ఆమెకు పూర్తి స్ధాయి రాయబార రక్షణ కల్పించే ఐరాస భారత శాశ్వత కార్యాలయం బదిలీని ఆమోదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది. దానితో రాయబార రక్షణ ఆసరాతో దేవయాని ఇండియాకు తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది.
ఐరాస కార్యాలయం ఉద్యోగిగా దేవయానికి పూర్తి స్ధాయి రాయబార రక్షణ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అదే సమయంలో దేశం విడిచి వెళ్లాలని ఆమెను కోరినట్లు తెలుస్తోంది. “అభియోగాలను మోపుతూ దేవయానికి కల్పించిన రాయబార రక్షణను ఉపసంహరించుకోవాలని ప్రాసిక్యూషన్ కోరారనీ, అందుకు భారత విదేశాంగ శాఖ వర్గాలు తిరస్కరించారని, దానితో ఆమెను దేశం విడిచి వెళ్లాలని కోరారని” న్యూయార్క్ అటార్నీ కార్యాలయం ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోందని పత్రికలు తెలిపాయి.
అయితే ఈ వ్యవహారం అంతా పత్రికలకు అయోమయాన్ని కలిగించింది. ఈ అయోమయంలో న్యూయార్క్ అటార్నీ కార్యాలయం చేసిన తప్పుడు ప్రకటనలు ప్రధాన కారకాలుగా నిలిచాయి.
జనవరి 13 తేదీ లోపు కోర్టులో దేవయానిపై ప్రాసిక్యూషన్ వారు అభియోగాలు మోపాల్సి ఉంది. అయితే ఈ గడువును ఫిబ్రవరి 12 వరకు పొడిగించాలని దేవయాని కోర్టును కోరింది. ఈ గడువు సమీపిస్తున్నందున ఒత్తిడి పెరిగి ప్రాసిక్యూషన్ విభాగానికీ, భారత విదేశాంగ అధికారులకు మధ్య జరుగుతున్న చర్చలపై ప్రతికూల ప్రభావం పడుతోందని దేవయాని తరపు లాయర్ డేనియల్ ఆర్షక్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రీత్ భరార నాయకత్వంలోని ప్రాసిక్యూషన్ గడువు పెంపుకు అంగీకరించలేదు. అభియోగాలు మోపినా చర్చలు కొనసాగవచ్చని కోర్టుకు తెలిపింది. దానితో కోర్టు దేవయాని విన్నపాన్ని తోసిపుచ్చింది. జనవరి 13 లోపు నేరారోపణ అభియోగాలు నమోదు చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై మరోసారి అప్పీలుకు వెళ్లడానికి డేనియల్ ఆర్షక్ నిర్ణయించారని గురువారం పత్రికలు తెలిపాయి.
ఈ నేపధ్యంలో దేవయాని ఈ పాటికే దేశం విడిచి వెళ్ళి ఉండవచ్చని ప్రాసిక్యూషన్ కోర్టుకు సమాచారం ఇచ్చింది. ఈ సమాచారాన్ని దేవయాని లాయర్ ఖండించాడు. ఆమె ఇంకా అమెరికాలోనే ఉన్నారని, తనపై మోపిన ఆరోపణల భారాన్ని తప్పించకుండా అమెరికా విడిచి వెళ్లబోరని ఆయన కోర్టుకు, ప్రాసిక్యూషన్ కు తెలిపారు. తానింకా అమెరికాలోనే ఉన్నాననీ, పూర్తి స్ధాయి రాయబార రక్షణతోనే తాను ఇండియాకు వెళ్తానని, దొంగచాటుగా పారిపోయే ఉద్దేశ్యం తనకు లేదని దేవయాని కూడా ప్రకటన ఇచ్చారు.
దేవయాని అమెరికాలో ఉండగానే ఆమె దేశం వదిలి వెళ్లిపోయారంటూ ప్రీత్ భరార కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం వివాదాస్పదం అయింది. అభియోగాలు నమోదయిన సమయంలో నిందితుల అరెస్టు చూపాల్సిన అవసరం ప్రాసిక్యూషన్ వారిపైన ఉంటుందని మళ్ళీ అరెస్టు చేసి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చిన దోషం నుండి తప్పుకునేందుకు ప్రీత్ భరార ఆమె దేశం విడిచి వెళ్ళినట్లు చెప్పారని కొన్ని పత్రికలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని దేవయాని లాయర్ ఘాటు పదజాలంతో తీవ్రంగా విమర్శించారు. దేవయాని విషయంలో మొదటినుండి వ్యవహరిస్తున్నట్లుగానే ప్రీత్ భరార తప్పుడు ఆరోపణ చేశారని, ఆయన తప్పుడు ధోరణి వల్లనే దేవయాని పై అనవసర ఆరోపణలు నమోదు చేసే పరిస్ధితి వచ్చిందని తిట్టిపోసాడు.
దేవయానికి పూర్తిస్ధాయి రాయబార రక్షణ కల్పిస్తూ ఆమెను ఐరాసకు బదిలీ చేయడానికి భారత్ నిర్ణయించింది. ఈ మేరకు రెండు వారాల క్రితమే ఐరాస తన ఆమోదాన్ని తెలుపుతూ అమెరికా విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చింది. కానీ దేవయానికి పూర్తి స్ధాయి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వకుండా అమెరికా విదేశాంగ శాఖ నాన్చుతూ వచ్చింది. ఐరాస బదిలీ విషయంలో ఆదేశాలు ఇవ్వకుండా నిలిపివేయడం ద్వారా ఆమెపై అభియోగాలు నమోదు చేసే అవకాశాన్ని ప్రాసిక్యూషన్ కల్పించేలా అమెరికా ఎత్తు వేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆమెపై కోర్టులో అభియోగాలు మోపడం, ఆ వెంటనే రాయబార రక్షణ కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడడం, ఆమె అప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారని కోర్టుకు సమాచారం ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ పద్ధతిని డేనియల్ ఆర్షక్ తీవ్రంగా విమర్శించాడు. దేవయాని మొదటి నుండి పూర్తిస్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారనీ ఆ సంగతి ఇప్పటికైనా గుర్తించారని ఆయన ది హిందూ కు పంపిన మెయిల్ లో చెప్పినట్లు తెలుస్తోంది.
దేవయానిపై మోపిన తప్పుడు ఆరోపణలు, అనుమానాస్పద విచారణ తతంగం కారణంగా పని మనిషి సంగీత రిచర్డ్ కుటుంబం ఇప్పుడు అమెరికాలో పూర్తి స్ధాయి నివాసం పొందారని డేనియల్ ఆర్షక్ చెప్పడం గమనార్హం. అనగా సంగీత రిచర్డ్ కుటుంబాన్ని అమెరికా రప్పించుకుని శాశ్వత నివాసం ఇచ్చుకునేందుకే దేవయానిపై తప్పుడు ఆరోపణల నాటకం నడిపారని డేనియల్ ఆర్షక్ ప్రకటన సూచిస్తోంది. సంగీత రిచర్డ్ కుటుంబం ఇండియాలో ఉండగా సి.ఐ.ఏ కోసం పని చేశారని ఈ సంగతి గ్రహించి అరెస్టు చేసేలోపు వారిని అమెరికా పట్టుకునిపోయిందని దానికి దేవయాని కేసును సాకుగా అమెరికా చూపిందని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగదే ఆరోపించడం ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.
తన పిల్లల్ని అమెరికాలోనే ఉంచి దేవయాని మాత్రమే ఇండియా వస్తున్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో వివరాలు అందుబాటులో లేవు. దేవయాని భర్త అమెరికా పౌరుడు. అందువలన దేవయాని కూడా అమెరికా పౌరసత్వం ఉన్నవారే. ఫలితంగా వారి పిల్లలు పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించబడతారు. బహుశా ఈ కారణం తోనే ఆమె పిల్లలు ఇండియాకు రావడం లేదేమో తెలియాల్సి ఉంది.

ఇప్పుడు దేవయాని ఇండియా వచ్చేసినా ఆమెమీద కేసులు కంటిన్యూ అవుతాయి అంటున్నారు కదా .. ఒకవేళ అవి నిరూపించబడితే అమె మళ్ళీ అక్కడికి వెళ్ళి శిక్ష అనుభవించవలసి వస్తుందా.????