సహారా కంపెనీల మోసం కేసులో సుప్రీం కోర్టు మళ్ళీ కొరడా విదిలించింది. సుప్రీం ఆదేశాల మేరకు మదుపుదారులకు 22,000 కోట్లు చెల్లించేశానని సహారా కంపెనీ చెప్పడంతో సుప్రీం కోర్టు మోసం శంకించినట్లు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి చెల్లించారో వివరాలు ఇవ్వాలని కోరింది. ‘డబ్బు ఎక్కడిదో మీకు అనవసరం’ అని సెబికి బదులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు ఎక్కడిదో చెప్పాలని లేదా సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తామని సహారా అధినేత సుబ్రతో రాయ్ ని హెచ్చరించింది.
(కేసు పూర్వాపరాల కోసం ఈ లింక్ చూడగలరు.)
కోర్టు నిస్సహాయ పరిస్ధితుల్లో ఏమీ లేదన్న సంగతి సహారా కంపెనీ తెలుసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలను యధేచ్ఛగా ధిక్కరించవచ్చు అని భావించడం పొరపాటని, తామేమి నిస్సహాయంగా లేమని అవసరం అయితే సి.బి.ఐ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్.ఓ.సి) లను విచారణ చేయాలని పురమాయిస్తామని ధర్మాసనం గట్టిగా చెప్పింది. వ్యాపార పనుల నిమిత్తం అమెరికా, బ్రిటన్ లకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలన్న సుబ్రత రాయ్ విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించింది. విదేశీ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని చెబుతూ తదుపరి విచారణను జనవరి 28 తేదీకి వాయిదా వేసింది.
“కోర్టు నిస్సహాయంగా ఉందని అనుకోవద్దు. మీకు వ్యతిరేకంగా విచారణ చేయాలని సి.బి.ఐ, ఆర్.ఓ.సి లను ఆదేశించగలం. మేము నిస్సహాయులం కాదు. మీరు చెల్లించామని చెబుతున్న డబ్బు అక్కడినుండి తెచ్చారో వెల్లడించకపోతే మేము తెలుసుకుంటాము. విచారణ సంస్ధలను అందుకు పురమాయిస్తాము” అని జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ జె.ఎస్.ఖేహార్ లతో కూడిన బెంచి స్పష్టం చేసింది.
‘డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో మీకు అనవసరం’ అని సహారా కంపెనీ సెబి కి రాసిన లేఖలో పేర్కొందని సెబి లాయర్ కోర్టుకు చెప్పినపుడు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సహారా కంపెనీ, సుబ్రత రాయ్ ల ప్రవర్తన ‘అసహ్యకరం’ (obnoxious) గా ఉందని వ్యాఖ్యానించింది.
“డబ్బు ఎక్కడిదో అనవసరం అని చెప్పేంత మూర్ఖత్వం మీ కంపెనీలో ఎవరికో ఉన్నట్లుంది. మీరు డబ్బు తిరిగి చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడినుండి తెచ్చారో మీ వద్ద రికార్డులు ఉండాలి. మీ జవాబు ఎంత అసహ్యకరంగా ఉందో మీకు చెప్పలేకపోతున్నాం… మీ ప్రవర్తన చాలా ఆశ్చర్యకరంగా ఉంది… మీ పట్ల మేము చాలా ఉదారంగా, మర్యాదగా వ్యవహరిస్తున్నాము. కానీ మీరు కర్ర మా చేతికి ఇస్తే మేమేం చేయాలి?” అని ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది.
వేలాది కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వ్యవహారంలో రికార్డులు నిర్వహించకుండా ఎలా ఉంటారని కోర్టు ప్రశ్నించింది. రిజిస్టర్ అయిన కంపెనీలు రికార్డులు నిర్వహించకుండా ఉండడం ఏమిటని నిలదీసింది. “మీరు ఎకౌంట్లు నిర్వహించినట్లయితే డబ్బు ఎక్కడిదో చెప్పడం మీకు పది నిమిషాల పని” అని వ్యాఖ్యానించింది.
“మీ పట్ల గరిష్ట స్ధాయి క్షమాగుణంతో వ్యవహరించాం. కానీ గత 2 సంవత్సరాల్లో ఎప్పుడూ నిజాలతో ముందుకు రాలేదు. మీరు ఏమి చేసినా సరే, డబ్బు మాత్రం తిరిగి ఇవ్వాల్సిందే. మీరు తప్పు చేసి ఉన్నట్లయితే ఇక మేమేమీ సాయం చేయలేము” అని బెంచి వ్యాఖ్యానించింది.
మిలియన్ల మంది సామాన్య మదుపుదారుల డబ్బు దిగమింగడమే కాకుండా రెండేళ్లుగా సుప్రీం కోర్టుతో సైతం ఆటలు ఆడుకుంటున్న సుబ్రత రాయ్ పట్ల ధర్మాసనం గరిష్టస్ధాయి క్షమాగుణంతో వ్యవహరించింది?! ఎందుకని? లక్షల కోట్ల కంపెనీకి యజమాని అయినందునా?
సెబి నిబంధనలకు, దేశ చట్టాలకు విరుద్ధంగా సామాన్య మదుపుదారుల నుండి సహారా కంపెనీకి చెందిన రెండు అనుబంధ కంపెనీలు 17,400 కోట్లకు పైగా డబ్బు సేకరించాయి. ఇది చట్టవిరుద్ధం కాబట్టి మదుపరులకు వెనక్కి ఇచ్చేయాలని సెబి ఆదేశించింది. అందుకు తిరస్కరించిన సహారా కోర్టుకు ఎక్కింది. కోర్టు మరిన్ని చీవాట్లు పెట్టి 15 శాతం వడ్డీతో కలిపి 24,000 కోట్లు చెల్లించాలని 2012 ఆగస్టులో తీర్పు చెప్పింది.
కోర్టు తీర్పు అమలు చేయకపోగా అమలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని సుబ్రత రాయ్ సెబి కి తేల్చి చేప్పేశాడు. దాంతో సెబి సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు సెబి ని కూడా తప్పు పట్టింది. తీర్పు అమలు చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎందుకు తీసుకోలేదని 2012 డిసెంబర్ లోనే ప్రశ్నించింది. వెంటనే 5,270 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించిన కోర్టు జనవరి, ఫిబ్రవరి (2013) నెలల్లో రెండు విడతలుగా మిగిలింది చెల్లించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాలు సంవత్సరం వరకు అమలు చేయకపోయినా కోర్టు వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ పోయింది. తీరా మొన్న డిసెంబర్ లో డబ్బు కట్టేశామ్ అని చెప్పడంతో సెబి నిర్ఘాంతపోయింది. ఎటువంటి సందడి లేకుండా 20,000 కోట్లు తిరిగి చెల్లించామ్ అని చెప్పడం ఏమిటో సెబికి అర్ధం కాలేదు. అయితే ఎక్కడి నుండి డబ్బు తెచ్చి కట్టారో చెప్పాలని, రికార్డులు చూపాలని కోరింది. ‘అది మీకు అనవసరం’ అని సుబ్రత బదులు ఇవ్వడం, విషయం మళ్ళీ కోర్టుకు రావడం జరిగిపోయింది.
సుబ్రత రాయ్, సహారా కంపెనీలు కనబరుస్తున్న ధోరణినే దేశంలో అనేక కంపెనీలు ప్రభుత్వాల పట్లా, ప్రజలపట్లా చూపుతున్నాయి. రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి ఆడిట్ వ్యవహారం, ఉత్పత్తి తగ్గించిన వ్యవహారం కూడా ఇలాగే అనేక సంవత్సరాలుగా నానుతోంది. గ్యాస్ ఉత్పత్తి తగ్గి విద్యుత్ కంపెనీలకు గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేదు. పైగా రిలయన్స్ వత్తాసుగా రావడానికి ప్రభుత్వ పెద్దలకు బోలెడు ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే రిలయన్స్ కంపెనీకి ఏ మాత్రం కష్టం కలిగించినా ఏకంగా చమురు మంత్రులనే మార్చేసేంత.
ఇది ప్రజాస్వామ్యమా లేక కంపెనీలస్వామ్యమా?

రాజకీయనాయక స్వామ్యం…వ్యాపార స్వామ్యం.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: సహారా: డబ్బెక్కడిదో చెప్పు లేదా సి.బి.ఐని పిలుస్తాం | ugiridharaprasad