మోడీకి రామ్ దేవ్ మద్దతు, షరతులతో… -కార్టూన్


Conditional support

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అందరికీ ఐడియాలు సమకూర్చిపెడుతోంది. బేషరతు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ కు 18 షరతులు విధించిన ఆప్, అనంతరం కాంగ్రెస్ మద్దతు స్వీకరణకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వినూత్న ప్రజాస్వామిక ఆచరణకు నాంది పలికింది. ఆప్ నుండి ‘క్లూ’ అందిపుచ్చుకున్నారేమో ఇప్పుడు బాబా రామ్ దేవ్ మోడీకి మద్దతు ఇస్తాను గానీ అందుకు కొన్ని షరతులు ఉన్నాయ్ అంటున్నారు.

తాను మొదట కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాననీ కానీ ఆ పార్టీ తనను మోసం చేసిందని రామ్ దేవ్ మూడు రోజుల క్రితం వాపోయారు. నల్లధనం వెనక్కి తెప్పించడానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అనీ కానీ ఆయన్ను మంత్రి పదవి నుండి తప్పించి రాష్ట్రపతిగా పంపడంలో స్వార్ధ శక్తులు సఫలం అయ్యాయని తెలిపారు. మద్దతు ఇవ్వడం కోసం బాబా రాందేవ్ విధించిన షరతులు చూడండి:

  • విదేశీ ఖాతాల్లో దాచిన నల్ల ధనాన్ని వెనక్కి తేవడానికి బి.జె.పి/మోడి ఏ ఆర్ధిక విధానం అనుసరిస్తారో ముందు చెప్పాలి.
  • విదేశాలకు తరలిన నల్లధనం జాతీయ ఆస్తిగా మోడి ఎలా ప్రకటిస్తారో చెప్పాలి.
  • నల్లధనం, అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తప్పుడు పన్నుల విధానం… మొదలైన సమస్యల పరిష్కారం కోసం మోడి ఏ విధానాలు అనుసరిస్తారో చెప్పాలి.
  • ‘నీతి, నేత్రతవ్, నీయత్’ (విధానం, నాయకత్వం, లక్ష్యం) సూత్రాల ప్రాతిపదికన మాత్రమే మద్దతు ఇవ్వడం జరుగుతుంది.
  • రైతులకు, కుటుంబ వ్యాపారాలకు (ఇది బహుశా రిటైల్ ఎఫ్.డి.ఐ పాలసీని ఉద్దేశించింది కావచ్చు) సహాయం చేయడానికి బి.జె.పి ఏ పధకాలు అవలంబిస్తుందో చెప్పాలి.
  • ఆర్ధిక వ్యవస్ధను పునరుత్తేజం కావించడానికి ఏ పధకాలు అనుసరిస్తారో చెప్పాలి.
  • ఇప్పుడున్న అన్ని పన్నులు రద్దు చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ టాక్స్ పేరుతో ఒకే ఒక పన్ను విధించాలి.
  • పెద్ద కరెన్సీలు (1000/-, 500/- ?) రద్దు చేయాలి.
  • దేశీయ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలి. అనేక పన్నుల వలన ధరలు పెరిగి దేశీయుల వద్ద ఉన్న 9 లక్షల కోట్ల డబ్బు పెట్టుబడిగా రియలైజ్ కావడం లేదు.

షరతులైతే బాగానే ఉన్నాయి గానీ మోడి నుండి వీటికి ఇంతవరకు సమాధానం లేదు. కోటి కోట్ల నల్లధనం జాతీయ ఆస్తిగా ప్రకటించడం కంటే మించిన గొప్ప విధానం మరొకటి ఉండదు. కానీ నల్ల ధనం సొంతదారుల సంగతి అటుంచి మోడీ అయినా దీనికి అంగీకరిస్తారా? ఈ షరతులు మోడీకి ఎలా కనిపిస్తాయో ఈ కార్టూన్ సూచిస్తోంది. 

(తల్కతోర స్టేడియంలో ఆదివారం (జనవరి 5) జరిగే సభకు తాను బి.జె.పి నాయకుల్ని, మోడిని ఆహ్వానించానని అక్కడ వారు తన షరతులకు స్పందిస్తారని రాందేవ్ చెప్పారు. కానీ సభ అయితే జరిగింది గానీ రాందేవ్ షరతులకు స్పందన ఇచ్చినట్లు పత్రికలు చెప్పలేదు. మోడీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని మాత్రం రాందేవ్ చెప్పేశారట. అంతకాడికి షరతులు అంటూ హంగామా ఎందుకు? తానూ మోసగాడినే అని చెప్పుకోవడం తప్ప!)

One thought on “మోడీకి రామ్ దేవ్ మద్దతు, షరతులతో… -కార్టూన్

వ్యాఖ్యానించండి