లైంగిక వేధింపులు: జస్టిస్ గంగూలీ రాజీనామా


ganguly

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు నిజం అయ్యాయి. రాజీనామాపై తాను ఇంకా నిర్ణయించుకోలేదని ఈ రోజు ఉదయం పత్రికలకు చెప్పిన జస్టిస్ గంగూలీ సాయంత్రానికి రాజీనామా ఇచ్చేశారు. తనకు మద్దతుగా సుప్రీం కోర్టులో దాఖలయిన ‘ప్రజా ప్రయోజనా వ్యాజ్యం’తో తనకు సంబంధం లేదని కూడా గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రాజీనామా చేయాల్సిందిగా తనపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని, తాను ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని ఈ రోజు ఉదయం జస్టిస్ గంగూలీ విలేఖరులకు చెప్పినట్లు పత్రికలు, ఛానెళ్లు తెలిపాయి. రెండు రోజులుగా ఆయన రాజీనామాపై పత్రికల్లో ఊహాగానాలు జోరుగా సాగాయి. తాను తప్పు చేయలేదు కనుక రాజీనామా చేయబోనని ఆయన మొదటి నుండి చెబుతూ వచ్చారు. ఆయన రాజీనామా చేస్తే తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుందని, విచారణ లేకుండానే ఆయన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మద్దతుదారులు ఈ క్రమంలో ఆరోపించారు. బహిరంగంగా అరుదుగా మాట్లాడుతూ వచ్చిన జస్టిస్ గంగూలీ చివరికి ఒత్తిళ్లకు తల ఒగ్గుతున్నట్లు తన రాజీనామా ద్వారా తెలియజేశారు.

ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎం. పద్మా నారాయణ్ సింగ్ కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public Interest Litigation -పిల్) దాఖలు చేశారు. జస్టిస్ గంగూలీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకోకుండా అడ్డుకోవాలని ఈ పిటిషన్ కోరింది. జస్టిస్ గంగూలీని పదవి నుండి తప్పించే విషయంలో రాష్ట్రపతి వివరణ (Presidential Reference -పి.ఆర్) కోరాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో పద్మ నారాయణ్ పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ నివేదికను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. మోహన్ బాగన్ ఫుట్ బాల్ జట్టు యాజమాన్యం కక్ష గట్టి న్యాయవాదిని స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని, జస్టిస్ గంగూలీ, మోహన్ బాగన్ కు వ్యతిరేకంగా ఒక ఆర్బిట్రేషన్ లో ఉండడమే దానికి కారణమని పిటిషనర్ ఆరోపించారు.  అయితే ఈ పిటిషన్ తో తనకు  సంబంధం లేదని జస్టిస్ గంగూలీ చెప్పడం విశేషం.

పద్మా నారాయణ్ పిటిషన్ ను విచారించడానికి  సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించినట్లు పత్రికలు తెలిపాయి. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, చట్టం తన పని తాను చేయాల్సిందేనని జస్టిస్ సదాశివం నేతృత్వంలోని బెంచి పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అనేక ప్రజాదరణ పొందిన ప్రజాపక్ష తీర్పులు ఇచ్చిన జస్టిస్ గంగూలీ ఈ విధంగా అర్ధాంతరంగా, అవమానకరంగా, నిలువునా కూలిన మర్రిమాను వలె కెరీర్ ను ముగించవలసి రావడం తీవ్ర బాధాకరం. కానీ ఆయన నిజంగా తప్పు చేసి ఉన్నట్లయితే ఇలాంటి ముగింపుకు ఆయన అర్హుడే కావచ్చు. మర్యాదకరమైన సామాజిక జీవనానికీ, అద్భుతమైన వృత్తిగత సామర్ధ్యానికీ, మచ్చలేని న్యాయ మీమాంస చరిత్రకు అద్దంగా భాసిల్లిన వ్యక్తులు మహిళల విషయానికి వచ్చేసరికి వ్యక్తిగత సమగ్రత పాటిస్తారన్న నియమం లేదన్న అనుమానం ఈ సందర్భంగా కలుగుతోంది.

తాను న్యాయ శిఖరంగా భావించిన జస్టిస్ గంగూలీ పైన నేరం చోటు చేసుకోకుండానే ఇంతటి అభాండం బాధితురాలు ఎలా మోపగలదన్న సంశయం ఒకవైపు, ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తూనే వాషింగ్టన్ పోస్ట్ లాంటి అమెరికా పత్రికలకు ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటన్న అనుమానం మరోవైపు సామాన్య పరిశీలకులను పట్టి పీడిస్తోంది.  బాధితురాలు దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను బట్టి జస్టిస్ గంగూలీ తన స్ధాయికి తగినట్లుగా వ్యవహరించలేదనడానికి ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ భావించిన సంగతి గుర్తుకు వచ్చి ‘అవునా, నిజమా, నిజమేనా’ అన్న సంకటమూ కలుగుతోంది. ‘ఇది నిజం కాకూడదు’ అన్న కోరిక వెంటబడి తరుముతుంటే, ‘ఇది నిజమే’ అంటూ వెక్కిరించే సంఘటనలూ ముల్లులా గుచ్చుతూ బాధిస్తున్న పరిస్ధితి!

బాధితురాలిని స్వయంగా విచారించిన త్రిసభ్య కమిటీ నివేదికను తయారు చేసి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం కు సమర్పించింది. జస్టిస్ గంగూలీ బాధితురాలితో కూడని విధంగా ప్రవర్తించారని ఈ నివేదిక తెలిపింది. సుప్రీం కోర్టు తమ సిటింగ్ లేదా మాజీ జడ్జి పైన కమిటీ వేయడం ఇదే మొదటిసారి అని పత్రికలు తెలిపాయి. పనిస్ధలాల్లో లైంగిక వేధింపుల నివారణ కోసం విశాక గైడ్ లైన్స్ పేరుతో ఇరవై యేళ్ళ క్రితం తాను జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా తానే కమిటీ వేయని సంగతిని కూడా సుప్రీం ఈ సమర్భంగా గుర్తించింది. 10 మంది సభ్యులతో కమిటీ నియమించడానికి సుప్రీం కోర్టును ఈ కేసు పురికొల్పింది. సుప్రీం కోర్టు పరిస్ధితే ఇలా ఉంటే తెహెల్కా ఎడిటర్లు, ఇంకా దేశంలో ఉన్న కోటిన్నొక్క సంస్ధలు, కంపెనీలు, విభాగాల పరిస్ధితిని ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. విశాక గైడ్ లైన్స్ ను అనుసరించడం అంటేనే వివిధ ఆఫీసు కార్యాలయాల్లో వ్యతిరేక వాతావరణం నెలకొని ఉండడం ఒక నిష్టుర సత్యం. ది హిందు పత్రిక కూడా ఇటీవలే ఇలాంటి కమిటీని నియమించింది. అయితే సుప్రీం కోర్టు కంటే ముందే కమిటీని నియమించిన ఘనత ది హిందూకు దక్కుతుంది.

మహిళలపై నేరాలు జరిగిన అనేక కేసులను జస్టిస్ గంగూలీ స్వయంగా విచారించి బాధితులకు అనుకూలంగా తీర్పులిచ్చిన చరిత్ర ఉంది. అలాంటి జడ్జి పైన లైంగిక ఆరోపణలు రావడంతో వివిధ కార్యకర్తలు, రాజకీయ నాయకులు, లాయర్లు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఫలితంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగి కమిటీని నియమించింది. కానీ జస్టిస్ గంగూలీ రిటైర్ అయినందున సుప్రీం అధికార పరిధిలో ఆయన లేరని, కాబట్టి త్రిసభ్య కమిటీ నియామకం చట్టపరంగా చెల్లదని విమర్శలు వచ్చాయి. ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించినట్లు నివేదికపై కోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా అర్ధం అవుతోంది.

One thought on “లైంగిక వేధింపులు: జస్టిస్ గంగూలీ రాజీనామా

వ్యాఖ్యానించండి