ఆదివారం జి.ఎస్.ఎల్.వి-డి5 ప్రయోగం విజయవంతం అయింది. దీనితో ఇండియా కూడా క్రయోజనిక్ ఇంజన్ సామర్ధ్యం గల దేశాల సరసన నిలిచింది. ఇప్పటివరకూ క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం ఐదు దేశాలకు మాత్రమే సొంతం. జి.ఎస్.ఎల్.వి -డి5లో మూడో దశ కోసం అమర్చిన దేశీయ క్రయోజనిక్ ఇంజన్ విజయంవంతంగా పని చేయడంతో అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్, ఈ.యు ల సరసన ఇండియా కూడా చేరింది. గత సంవత్సరం ఆగస్టులో జరగవలసిన ప్రయోగం చివరి క్షణాల్లో ఇంధనం లీకేజీని గుర్తించడంతో వాయిదా పడింది. లోపాలను సవరించి చేసిన పరీక్ష విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అయ్యాయి.
“ఇస్రో బృందం ఇది సాధించగలిగినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. భారతీయ క్రయోజనిక్ ఇంజన్ మరియు దశ ఆశించిన విధంగానే పని చేసింది. ఈ మిషన్ కోసం అనుకున్న విధంగానే జిశాట్-14 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉద్దేశించబడిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది” అని ఇస్రో ఛైర్మన్ కె.రాధా కృష్ణన్ మిషన్ కంట్రోల్ రూమ్ నుండి ప్రకటించారు. 1982 కిలోల బరువుగల జిశాట్ (GSAT –Geosynchronous Satellite)-14 ఉపగ్రహం మరిన్ని ట్రాన్స్ పాండర్లను కలిగి ఉండడంతో విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడే అవసరం ఇండియాకు తగ్గుతుంది.
జియో సింక్రొనస్ శాటిలైట్లు తిరిగే కక్ష్య భూమి తన చుట్టూ తాను తిరిగే కాలానికి అనుసంధించబడి ఉంటుంది. అనగా భూమిపైన నిర్దిష్ట ప్రాంతం పైనే ఉంటూ స్ధిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. భూ పరిభ్రమణ వేగానికి (24 గంటలకు ఒక పరిభ్రమణము) సమాన వేగంతో తిరగడం వలన ఇది సాధ్యపడుతుంది. (బొమ్మ చూడగలరు) ఇలాంటి శాటిలైట్లను ఇండియా ఇప్పటివరకు 12 ప్రయోగించింది. అయితే క్రయోజనిక్ ఇంజన సామర్ధ్యం ఇప్పటివరకు సంతరించుకోలేదు. ద్రవ రూప ఆక్సిజన్, హైడ్రోజన్ ఇంధనాలను ఉపయోగించే క్రయోజనిక్ ఇంజన్ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టవచ్చు.
గతంలో రష్యా నుండి క్రయోజనిక్ ఇంజన్లను కొనుగోలు చేయడానికి ఇండియా ప్రయత్నించింది. కానీ అమెరికా సైంధవుడిలా అడ్డం వచ్చింది. ఇండియాకు క్రయోజనిక్ అమ్మితే వాటిని అత్యాధునిక ఆయుధాల కోసం వినియోగించే ప్రమాదం ఉందని చెబుతూ అమెరికా తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. సోవియట్ రష్యా కూలిపోయిన కొత్తలో యెల్ట్సిన్ నేతృత్వంలోని రష్యా ప్రభుత్వం అమెరికా చెప్పినట్టల్లా తలాడించింది. ఆ సందర్భంలోనే ఇండియాకు క్రయోజనిక్ ఇంజన్లను రష్యా ఇవ్వలేదు. ఫలితంగా సొంతగా క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసుకునే సామర్ధ్యం కోసం ఇండియా ప్రయత్నాలు ప్రారంభించింది.
క్రయోజనిక్ ఇంజన్ల కోసం ఆక్సిజన్ ను -183 సెంటీగ్రేడ్ వద్ద ద్రవరూపంలోకి మార్చాల్సి ఉంటుంది. అలాగే హైడ్రోజన్ ను -253o C వద్ద ద్రవరూపంలోకి మార్చాలి. ఈ ద్రవ ఇంధనాన్ని రాకెట్ లోకి పంపింగ్ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పంపు అవసరం. ఇది నిమిషానికి 40,000 సార్లు తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది.
రష్యా అందజేసిన క్రయోజనిక్ ఇంజన్ ను ఉపయోగించి 2010 లో ఉపగ్రహ ప్రయోగానికి ఇండియా ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఘోరంగా విఫలం అయింది. రష్యా తయారీ ఇంజన్ ఆశించిన విధంగా ఇంధనాన్ని అనుకున్న రీతిలో మండించడంలో విఫలం అయింది. ఫలితంగా ఉపగ్రహం బంగాళాఖాతంలో కూలిపోయింది. ఆశించిన మార్గం నుండి పక్కకు వెళ్తున్నట్లు గమనించిన శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో కూలిపోయేలా చేశారు. అనంతరం తాను సొంతగా తయారు చేసుకున్న క్రయోజనిక్ ఇంజన్ ద్వారా గత సంవత్సరం ఆగస్టులో మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి ఇండియా తలపెట్టింది. కానీ ఈసారి ఇంధనం లీక్ అవుతున్నట్లు చివరి నిమిషంలో శాస్త్రజ్ఞులు గమనించి ప్రయోగాన్ని నిలిపివేశారు.
ఇన్ని వైఫల్యాలు, అగ్ర అమెరికా రుద్దిన ఆటంకాల మధ్య ఇండియా క్రయో జనిక్ ఇంజన్ కల సంవత్సరాల తరబడి నెరవేరలేదు. 2010 నాటి వైఫల్యంతో మరింత అపకీర్తి మూటకట్టుకున్నట్లు అయింది. ఈ వైఫల్యాలు, ఆటంకాల వలన భారత ప్రయత్నాలు ప్రపంచ దేశాల దృష్టిలో ప్రముఖ స్ధానం ఆక్రమించాయి. భారత శాస్త్రవేత్తల కృషి విఫలం అవుతుందా, సఫలం అవుతుందా అని ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. నిన్నటి ప్రయోగాన్ని కూడా పశ్చిమ దేశాలు, పత్రికలు ఆసక్తిగా, అప్రమత్తంగా గమనించాయి. చివరికి భారత శాస్త్రవేత్తల కృషి ఫలించడంతో కొందరు హర్షం ప్రకటించగా, మరికొందరు గొణుక్కుంటూ హర్షం నటించారు. కొన్ని పశ్చిమ పత్రికలు భారత విజయాన్ని చూడనట్లు నటించడం విశేషం.
కోట్లాది మంది ఆకలి, అర్ధాకలితో అలమటిస్తుంటే భారత ప్రభుత్వానికి రాకెట్ల ప్రయోగంలో ఆసక్తి ఎక్కువయిందని కొన్ని పశ్చిమ పత్రికలు గొణుగుతున్నాయి. ఒక బ్రిటిష్ పత్రికయితే (డెయిలీ మెయిల్) భారత రాకెట్ల ప్రయోగానికి బ్రిటన్ ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందని, పేదరిక నిర్మూలనకు ఇస్తున్న డబ్బులు రాకెట్లకు ఇండియా వినియోగిస్తోందని ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగం సందర్భంగా ఆడిపోసుకుంది. ఇంతా చేసి జి.ఎస్.ఎల్.వి-డి5 కోసం ఇండియా ఖర్చు పెట్టింది రు. 205 కోట్లు. మార్స్ ఆర్బిటర్ మిషన్, జిశాట్-14 ప్రయోగాలను చూపిస్తూ ఇండియాకు సహాయం ఆపేయాలని ఆ దేశంలో కొన్ని సంస్ధలు డిమాండ్ చేయడం గమనార్హం.
యు.కె ఇస్తున్న అభివృద్ధి సాయం ఇండియా పెడుతున్న అభివృద్ధి ఖర్చులో పిసరంత మాత్రమే అని ఇలాంటి విమర్శలను ఉద్దేశిస్తూ గతంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ప్రణబ్ వ్యాఖ్యలను కూడా ఆనాడు పశ్చిమ పత్రికలు తప్పు పట్టాయి. అయినప్పటికీ మురుగు కాల్వల నిర్మాణం, ఇతర చిన్న చిన్న అభివృద్ధి పనులు చూపిస్తూ ఐరోపా దేశాల సాయం తీసుకోవడం భారత పాలకులు మానరు.





Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: జిఎస్ఎల్^వి డి5 విజయంతో క్రయో క్లబ్ లో ఇండియా | ugiridharaprasad