ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు.
తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల కంటే చరిత్ర తన పట్ల మరింత దయతో ఉంటుందని విశ్వాసం వెలిబుచ్చారు. చరిత్రలో పత్రికలు ఒక అనివార్యమైన భాగం అని ఆయన మరిచినట్లున్నారు. చరిత్ర లేఖరులపైన ఆయనకి అంత నమ్మకం ఏమిటో తెలియాల్సి ఉంది. పత్రికలపై ఆయన అభ్యంతరం తన పాలనలో ఉన్న కొన్ని అవ్యవస్ధలపైన పత్రికలు అవసరమైనదాని కంటే ఎక్కువ దృష్టి పెట్టాయట! 2జి, కామన్ వెల్త్, బొగ్గు… ఇత్యాది కుంభకోణాలకు ఆయన పెట్టిన పేరు ‘కొన్ని అవ్యవస్ధలు’?
అధికార దండం స్వీకరణకు రాహుల్ గాంధీ సిద్ధమే గానీ, మన్మోహన్ మోస్తున్న ఆ కుంభకోణాల భారాన్ని మోయడమే ఆయనకి ఇష్టం లేదు. అందుకే తాను అవినీతికి బద్ధ వ్యతిరేకిని అని చెప్పుకోడానికి తెగ తాపత్రయపడుతున్నారు. నేర నిర్ధారణ జరిగిన నేతలను కాపాడే ఆర్డినెన్స్ ను చించేయాలని విలేఖరుల సమావేశంలో వీర ఫోజులు పెడతారు. ఆదర్శ్ కుంభకోణం విచారణ నివేదికను తిరస్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం చెవి మెలిపెడతారు. ఎఎపి పార్టీ నుండి నేర్చుకోవలసింది తమకు చాలా ఉందంటారు. అధికార దండం తన చేతికి వచ్చేలోపు ఇలాంటివి మరిన్ని విద్యలు ఆయన సిద్ధంగా పెట్టుకుని ఉండవచ్చు.
–
కానీ రాహుల్ గాంధీ చేతికి అధికార దండం రాకపోగా, కుంభకోణాల మూటలు ఆయన నెత్తికి రావడం మాత్రం ఖాయం. బహుశా ప్రజలు ఈ పాటికి ఆ సంగతి నిర్ణయించేసి ఉంటారు.

