“ఆ ఎర్ర బల్పును తీసేసే మార్గం మనకి ఏదో ఒకటి దొరక్కపోదు”
–
అవినీతి నిర్మూలన! ప్రస్తుతం రాజకీయ పార్టీలకు పట్టుకున్న జ్వరం ఇది. ఈ జ్వరం పట్టుకునేలా చేయడంలో తాము సఫలం అయ్యామని ఎఎపి ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటోంది.
ఢిల్లీ ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ చేసిన పని ‘లాల్ బత్తి’ తొలగిస్తామని ప్రకటించడం. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే అనీ, ఒకరూ ఇద్దరు వి.ఐ.పి లు ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ మొత్తం ఆపాల్సిన అవసరం లేదని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. చెప్పినట్లుగానే వి.ఐ.పి లకు ఆ హోదా ఇచ్చే ఎర్ర బల్బులను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ అంబులెన్సులకు, ఇంకా అలాంటి ముఖ్యమైన వాటికి ఎర్ర బల్బులు కొనసాగిస్తామని కూడా అరవింద్ చెప్పారు.
ఎర్ర రంగు ప్రమాదానికి సంకేతం. ప్రమాదాన్ని సూచించడానికి రైల్వేలకు ఎర్ర జెండా చూపుతారు. ఆదర్శ్ సౌసైటీ గృహ సముదాయంపై వెలుగుతున్న లాల్ బత్తి కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు దడ పుట్టిస్తోంది.
ఢిల్లీ ఎన్నికల విజయం అనంతరం తమ తదుపరి లక్ష్యం ముంబై అని ఎఎపి ప్రకటించింది. మహారాష్ట్రలో అప్పుడే ఎన్నికల సంరంభాన్ని ఎఎపి ప్రారంభించింది కూడా. అవినీతిని ఎజెండా మీదికి తెచ్చిన ఎఎపి, ఆదర్శ్ కుంభకోణం అనే ప్రమాదాన్ని కాంగ్రెస్ నెత్తిన మోపింది. ఈ లాల్ బత్తి తొలగిపోతే తప్ప మహారాష్ట్ర కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదు.
లేక ఢిల్లీ తరహాలోనే మహారాష్ట్రలో కూడా ఎఎపి తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? సోనియా మదిలో ఉన్న ఆ ‘ఏదో ఒక పరిష్కారం’ అదేనా?
