ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్


Adarsh cleanup

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది.

కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ జరిపింది. ఈ స్ధాలంలో మృత సైనికులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని తలపోశారు. కానీ అనంతర కాలంలో ఆదర్శ ఇళ్ల నిర్మాణం అవినీతికి కేంద్రంగా మారింది. సైనికులకు నామమాత్రంగా ఇళ్ళు కేటాయించి మిగిలినవన్నీ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు సొంతం చేసుకున్నారు. (ఇలా అపార్టుమెంటు పొందినవారిలో దేవయాని ఖోబ్రగదే ఒకరు. ఆమె తండ్రి ఐ.ఎ.ఎస్ అధికారి కావడంతో ఆయన పలుకుబడితో ఆమె కూడా కేటాయింపు పొందారు.)

ఈ కుంభకోణంపై నియమించిన విచారణ కమిషన్ ఇటీవలనే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మాహారాష్ట్ర శాసన సభ సమావేశాల చివరి రోజున ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్-ఎన్.సి.పి ప్రభుత్వం నివేదికను ప్రభుత్వం తిరస్కరిస్తోందని ప్రకటించింది. దానితో విమర్శలు వెల్లువెత్తాయి. దరిమిలా యువరాజా వారు రంగంలోకి దిగారు. ఫలితంగా మరో అవినీతి నిర్మూలనా నాటకానికి తెర లేచింది.

ఆదర్శ్ కుంభకోణం విచారణ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం ఘోర తప్పిదం అని రాహుల్ గాంధీ అట్టహాసంగా ప్రకటించారు. ‘అవును, తప్పిదమే’ అని సోనియా గాంధీ వంత పలికారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఒక్కొక్కరు ముందుకొచ్చి ‘అవును కదా’ అంటూ సణుగుడు ప్రారంభించారు. ఆ విధంగా ఆదర్శ కుంభకోణం శుభ్రం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ మొదలు పెట్టింది. బహుశా ఆదర్శ కుంభకోణం విచారణ నివేదికను ఆమోదించినట్లు ప్రకటించి కొంతమంది బలిపశువులను ఎంచుకుని శిక్షించే కార్యక్రమం మరి కొద్ది రోజుల్లో మొదలు కావచ్చని పత్రికలు ఊహిస్తున్నాయి.

వివిధ నేరాలలో దోష నిర్ధారణ జరిగిన ప్రజా ప్రతినిధులు (ఎం.పిలు, ఎమ్మేల్యేలు) అప్పీలుకు వెళ్ళేలోపు సభ్యత్వం సస్పెన్షన్ నుండి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఇలాగే అవినీతి నిర్మూలనా ఫోజు పెట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ ను చించేయాలని ప్రకటించి తద్వారా అవినీతి వ్యతిరేక ప్రతిష్టను సొంతం చేసుకోవడానికి రాహుల్ ప్రయత్నించారు. ఈ ప్రయత్నం సఫలం కావడం అటుంచి కేంద్ర కేబినెట్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చించేయాలనడం ద్వారా ప్రభుత్వాన్ని, ప్రధానిని అవమానపరిచారన్న విమర్శలను రాహుల్ ఎదుర్కొన్నారు.

సరిగ్గా ఇదే నాటకాన్ని ఆదర్శ్ విషయంలో కూడా రాహుల్ పునరావృతం చేశారు. అవినీతి నిర్మూలన కార్యక్రమం కాంగ్రెస్ దృష్టిలో తేలిక అయిందన్న అభిప్రాయం కలగడానికే రాహుల్ గాంధీ సాహసాలు దారితీస్తున్నాయని కాంగ్రెస్ పెద్దలు గ్రహిస్తున్నారో లేదో మరి!

రాజకీయాల ప్రక్షాళనకు తాము పూనుకున్నామని చెబుతూ ఎఎపి వాళ్ళు చీపురును తమ గుర్తుగా స్వీకరించారు. తద్వారా శక్తివంతమైన సందేశాన్ని వాళ్ళు ప్రజలకు ఇవ్వగలిగారు. ఎఎపి నుండి నేర్చుకోవలసింది తమకు చాలా ఉందని శశభిషలు లేకుండా ప్రకటించిన రాహుల్ ఆచరణలో మాత్రం అవినీతి నిర్మూలనా కార్యక్రమాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. తానూ నవ్వులపాలవుతున్నారు.

 

వ్యాఖ్యానించండి