(ఈ ఆర్టికల్ రాసి మూడు వారాలయింది. దిన పత్రిక కోసం ఇక్కడ ప్రచురించకుండా ఆపాను. ఇక ఆ సందర్భం దాటిపోయింది. అందువలన ప్రచురిస్తున్నాను.)
కేసు ప్రస్తుతం ఫలానా కోర్టులో ఉంది అని చెప్పుకునే బదులు ‘మీడియా కోర్టులో ఉంది’ అని చెప్పుకునే రోజుల్లో ఉన్నామని అనేకమంది ఈ మధ్య తరచుగా వాపోతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించిన కేసుల్లో న్యాయమూర్తులు నిస్పక్షపాతంగా తీర్పు చెప్పలేని పరిస్ధితి వస్తోందన్నది విమర్శకుల అభిప్రాయం. న్యాయమూర్తి మీడియా ప్రభావం నుండి ఎంత దూరంగా ఉన్నా, పత్రికలు, ఛానెళ్ల అభిప్రాయాల్లో న్యాయబద్ధత ఉన్నట్లయితే, దానిని ఆయన తిరస్కరించలేరు. అలాగని పత్రికలు, ఛానెళ్ల అభిప్రాయాలు కూడా పరిశీలిద్దాం అని న్యాయమూర్తి పూనుకుంటే న్యాయేతర ప్రభావాల నుండి ఆయన తప్పించుకోగలరన్న గ్యారంటీ ఉండదు. ఇదొక మహా ధర్మ సంకటం!
న్యాయమూర్తులు నాలుగు గోడలకు పరిమితం కావలసినవారు కాదు. సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా నేరాల సాపేక్షిక తీవ్రతను అంచనా వేసే స్ధితిలో వారు ఉండాలి. సమాజంలో వివిధ మార్పులు వచ్చేకొద్దీ, సామాజిక విలువల రూపాలుకూడా మారుతూ ఉంటాయి. ఈ మార్పులు ప్రధానంగా వివిధ సామాజిక సమూహాల మధ్య ఉండే ఆర్ధిక సంబంధాలు లేదా ఉత్పత్తి సంబంధాల పైనే ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదాంశం.
‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం’ పేరుతో భారత రాజ్యం పశ్చిమ దేశాలు రుద్దిన నూతన ఆర్ధిక విధానాలను, ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏలుబడిలోని ప్రపంచీకరణ విధానాలను అమలు చేయడం ప్రారంభించాక ప్రజల ఆర్ధిక సంబంధాలలోనూ పెను మార్పులు వచ్చాయి. సరళీకరణ విధానాల ద్వారా దేశంలోకి చొరబడిన విదేశీ పెట్టుబడి తనతో పాటు పశ్చిమ దేశాల సంస్కృతి విలువలను కూడా అనివార్యంగా పట్టుకొచ్చింది. అనగా దేశాల సరిహద్దులకు అతీతంగా సాగిన ఆర్ధిక, వాణిజ్య సంగమం, సంస్కృతుల సంగమానికి దారి తీసింది. ఫలితంగా సామాజిక విలువల్లో మార్పులు వచ్చాయి. ఈ మార్పులను ఆహ్వానించి ఆచరిస్తున్నవారు కొందరైతే, భారతీయ సంస్కృతి కలుషితం అవుతోందంటూ అభ్యంతరం పెడుతున్నవారు మరికొందరు. మంచి, చెడులను విచికిత్స చేయగల విచక్షణ ఈ రెండు తరగుతుల్లోనూ కొరవడుతోంది. ఫలితంగా కొత్త తరహా నేరాలు తలెత్తుతున్నాయి. పరువు హత్యలు, యాసిడ్ దాడులు, ఏ.టి.ఎం దోపిడీలు, వికృత రూపాల్లో జరుగుతున్న అత్యాచారాలు, వ్యవస్ధ లక్షణంగా మారిన ఆర్ధిక నేరాలు… ఈకోవలోనివే. పాత, కొత్త విలువల మధ్య జరుగుతున్న ఘర్షణ ఒక తరహా సామాజిక నేరాలకు దోహదపడుతుండగా, విశృంఖల దోపిడీకి అవకాశం ఇస్తున్న ఆర్ధిక విధానాలు భారీ ఆర్ధిక నేరాలకు అవకాశం ఇస్తున్నాయి.
ఈ నేరాలను పట్టి, ఎండగట్టాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా మీడియాపై ఉంది. మీడియా కూడా వ్యవస్ధలో భాగం కనుక అది కూడా స్క్రూటినీని ఎదుర్కోవలసిందే. అయితే తన బాధ్యత నిర్వర్తించే క్రమంలో మీడియా పరిమితి దాటిపోతున్న విపత్కర పరిస్ధితి తలెత్తుతోంది. అదే సమయంలో మీడియా నిర్వహించాల్సిన అవసరమైన పాత్ర వల్ల తమ అక్రమాలను కొనసాగించలేని వర్గాలకు ఈ ‘మీడియా అతి’ ఒక వరంగా కూడా ఉపయోగపడుతోంది. అందుకే మీడియాను నియంత్రించాలన్న వాదనలు కలిగినవర్గాల నుండే రావడం యాదృచ్ఛికం కాదు.
మీడియా అతి వల్ల ఆరుషి హత్యకేసులో దోషులుగా ఆరుషి తల్లిదండ్రులనే కోర్టు నిర్ధారించిందని కొన్ని ఆంగ్ల పత్రికల్లో విశ్లేషణలు వస్తున్నాయి. ఆరుషి తల్లిదండ్రులయిన తల్వార్ దంపతులు దోషులని రుజువు చేసేందుకు ఒక్క మెటీరీయల్ ఎవిడెన్స్ సి.బి.ఐ చూపలేదు. కానీ 26 పరిస్ధితుల సాక్ష్యాలను (circumstential evidence) ఉదహరిస్తూ సి.బి.ఐ కోర్టు వారికి యావజ్జీవ శిక్ష విధించింది. వీటిలో కొన్ని మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ తీర్పును అనేకమంది పరిశీలకులు విమర్శిస్తుండగా సి.బి.ఐ మాజీ డైరెక్టర్ ఆర్.కె.రాఘవన్ తీర్పును పొగుడుతూ ఏకంగా ఒక ఆర్టికల్ (ది హిందులో) రాశారు. ఐతే గత అయిదేళ్లుగా మీడియా సాగిస్తున్న ట్రయల్ కు ప్రభావితం కాకుండానే సి.బి.ఐ కోర్టు జడ్జి ఈ తీర్పు ఇచ్చారని తాను చెప్పలేనని ఆయన రాయడం గమనార్హం. ఐదేళ్ల మీడియా ట్రయల్స్ వల్లనే బలహీనంగా ఉన్న పరిస్ధితులకు సాక్ష్యాల స్ధాయి వచ్చిందని మీడియాలోని ఒక భాగం విమర్శిస్తోంది. కన్న కూతురు హత్యకు గురయితే తల్లిదండ్రులు ఫలానా విధంగానే దుఃఖించాలన్న రూల్ ఉందా? గంభీరంగా ఉండడానికి అలవాటుపడినవారు దుఃఖ ఛాయలు చూపడానికి ఇష్టపడకపోవచ్చు. ఆరుషి హత్య జరిగిన తర్వాత రోజు తల్వార్ దంపతులు దుఃఖించినట్లు కనపడలేదని ఉదయాన్నే ఇంటికి వచ్చిన పని మనిషి భావించింది. సి.బి.ఐ కోర్టు ప్రస్తావించిన 26 పరిస్ధితుల సాక్ష్యాల్లో ఇదొకటి. మీడియా దీని ప్రాముఖ్యతను గురించి పదేపదే ప్రస్తావించినందునే సి.బి.ఐ దర్యాప్తు బృందం దానిని స్వీకరించిందని, తీర్పులో సాక్ష్యంగా మారిందని విమర్శకుల అభిప్రాయం. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు ఘోరమైన ప్రమాదానికి గురై మరణించినప్పుడు అజారుద్దీన్ చాలా సంయమనం (composure) పాటించారనీ, దుఃఖ ఛాయలు సందర్శకుల ముందు కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారనీ ప్రముఖులు కొనియాడారు. టి.వీల్లో అది కనిపించింది కూడా. కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అజారుద్దీన్ ను ప్రశంసించాయి. కానీ ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు కనుక తన తనయుడిపై ఆయనకు ప్రేమ లేదని ఎవరూ వేలెత్తి చూపలేదు. తల్వార్ దంపతులకు, అజారుద్దీన్ కూ మధ్య ఈ తేడా ఎందుకు చూపాల్సివచ్చింది? సమాధానం కోసం ఎవరిని ప్రశ్నించాలి?
తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ తమ ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సంగతి ఆయనే అంగీకరించాడు. నేరం జరిగిన రెండు వారాలకు పత్రిక మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి దృష్టికి వచ్చింది. తాను పూర్తిగా బాధితురాలి పక్షానే నిలిచానని సోమా పదేపదే చెప్పారు. బాధితురాలు చెప్పినట్లు కాకుండా మరో విధంగా సంఘటన జరిగినట్లు తేజ్ పాల్ చెప్పినా దానికి ఆమె విలువ ఇవ్వలేదు. బాధితురాలు కోరినట్లుగా విశాక తీర్పు గైడ్ లైన్స్ ప్రకారం లైంగిక వేధింపుల విచారణకు కమిటీని సోమా ఏర్పాటు చేశారు కూడా. నేరంలో సోమాకు ఏ పాత్రా లేదు. కానీ ఆమె పేరు కూడా ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చడానికి గోవా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీడియా ప్రశ్నల ద్వారానే ఈ ఆలోచన పోలీసులకు వచ్చిందని కొందరు చెబుతున్నారు. ఇదొక కారణమో ఏమో తెలియదు గానీ ఇప్పుడు సోమా తెహెల్కాలో లేరు. అత్యంత సాహసోపేతమైన స్టింగ్ ఆపరేషన్లకు చిరునామాగా మారి, మహా మహా (అ)రాజకీయ సామ్రాట్టుల గుట్టు వెలికి తీసిన తెహెల్కాకు ఇప్పుడు సారధి లేరు. ఉన్నా సోమా లాంటి ప్రజాస్వామికవాది ఆ స్ధానాన్ని భర్తీ చేస్తారా అన్నది అనుమానమే. ‘మీడియా అతి’ ఈ దుస్ధితికి కారణం అయితే అందుకు ఎవరిని దోషిగా నిర్ధారించాలి?
తెహెల్కా జర్నలిస్టుపై పత్రిక ఎడిటర్ చేసిన నిర్వాకానికి సోమా చౌదరిని పాక్షికంగా ఐనాసరే బాధ్యురాలిని చెయ్యడం ఎంతవరకు సబబు? జరిగిన నేరం యొక్క స్ధాయిని గుర్తించడంలో ఆమె పొరబాటు పడి ఉండొచ్చు. స్పందనలో ఎక్కువ తక్కువ లోపాలు దొర్లి ఉండొచ్చు. కానీ నేరాన్ని కప్పిపుచ్చే స్ధాయి(నం)లో ఆమె లేరు. ‘పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితురాలికి ఇష్టం లేదేమో’ అన్న సంశయంతోనే తాను కొంత వెనకబడ్డానని సోమా చెప్పిన సంగతి విస్మరించలేము. బాధితురాలు ఫిర్యాదుకు సిద్ధంగా ఉన్నారని అర్ధం అయ్యాక తాను పోలీసులకు పూర్తిగా సహకరించానని ఆమె చెప్పారు. దీనిని గోవా పోలీసులు కూడా ధృవీకరించారు. కానీ మీడియా ట్రయల్స్ ను స్వయంగా ఎదుర్కొన్న సోమా ఒక అద్భుతమైన మీడియా సంస్ధ నుండి వైదొలిగారు.
ముందే చెప్పినట్లుగా మీడియా అతికి సంబంధించి ఇందుకు విరుద్ధమైన ఉదాహరణలూ ఉన్నాయి. మీడియా అతిపై వాపోతున్న వారిలో మన ప్రధాని కూడా ఉన్నారు. 2జి, బొగ్గు లాంటి భారీ కుంభకోణాలను వెలికి తీయడంలో మీడియా అతిగా వ్యవరించిందని ఆయన చాలా బాధపడ్డారు. ఆయన మనసు కష్టపెట్టిన వారిలో మీడియా ఒక్కటే లేదు. రాజ్యాంగ సంస్ధ సి.ఏ.జి (కాగ్) పైన కూడా ఆయన పలుమార్లు కినుక వహించారు. కార్యనిర్వాహక వ్యవస్ధ అధికారాల్లోకి అతిగా చొచ్చుకు వస్తున్నదంటూ సుప్రీం కోర్టునూ విమర్శించారాయన. నిల్వచేసేందుకు సౌకర్యాలు లేక గోడౌన్ల బయట ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వృధా పోతున్న ధాన్యపు గింజలను కటిక పేదలకు ఉచితంగా ఎందుకు ఇవ్వకూడదు అని సుప్రీం కోర్టు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన సుప్రీం కోర్టు అధికారాలను ప్రశ్నించారు. కాబట్టి ‘మీడియా అతి’ గురించిన ప్రధాని బాధ అక్రమాలను వెల్లడిస్తున్నందుకే గానీ, వ్యవస్ధలను బాగుచేసుకునే దృక్పధానికి సంబంధించినది కాదు. ఆ బాధ ఎంత లోతుగా ఉంటే మీడియా అంత చక్కగా పని చేస్తోంది అనుకోవాలేమో! ప్రధాని చెప్పే మీడియా అతి నిజానికి ‘మీడియా అతి’ కాదు, ‘మీడియా క్రియాశీలత.’ అది దేశానికి అత్యవసరం. మీడియా క్రియాశీలత ఎంత ‘అతి’గా ఉంటే దేశానికి అంత లాభం అనడంలో సందేహం లేదు.
కాబట్టి ‘మీడియా అతి’ అన్నది ఏకశిలాసదృశం కాదు. అది కేవలం నలుపు తెలుపు బొమ్మ కాదు. అందులో అనేకానేక ఛాయలు ఉన్నాయి. ఈ ఛాయల్లో ఏది సమాజానికి అవసరమో, ఏది ప్రమాదకరమో తేల్చుకోవడమే అసలు సమస్య. అనగా ‘మీడియా అతి’ని నియంత్రించడం అసలు సమస్య కాదు. మారుతున్న సామాజిక విలువల్లో మంచిచెడులను నిర్ణయించుకునే అవసరం ఒక సంఘజీవికి ఎంతగా ఉన్నదో ఆ విలువలను సరైన అద్దాల నుండి తాను చూస్తూ సమాజానికి చూపించే అవసరం మీడియాకూ అంతే ఉంది. నిజానికిది మీడియాపై ఉన్న గురుతర బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలోనే మీడియా సామర్ధ్యం రుజువవుతుంది.
నిజమే. నలువైపుల నుండి వచ్చిపడుతున్న సామాజిక, రాజకీయ భావాజాలాల ప్రభావాలు, ప్రవాహాల మధ్య ఏది సరైనదో చూడగలగడం కత్తిమీద సామే. దీనికి ఒక్కటే కొలబద్ద. ప్రజల సగటు సామాజిక స్ధాయికి ఒక అడుగు పైన ఉంటూ తగిన మార్గనిర్దేశనం చేసే స్ధానంలో మీడియా నిలబడాలి. ‘ప్రజాస్వామ్యం’ అనే బృహత్తరమైన విలువను నిటారుగా నిలబెట్టే విలువ ఏదయినా సమాజ పురోగమనానికి దోహదపడుతుంది అన్న సూత్రమే సమస్త వ్యవస్ధలకు మార్గదర్శి. ఒక విలువ అంతరించిపోవాలన్నా, ఒక విలువ పురుడు పోసుకోవాలన్నా ఇదే మార్గదర్శి. ప్రజల చైతన్యం నిత్యం మార్పులకు గురయ్యే ఒక డైనమిక్ వ్యవస్ధ. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఉండడం అత్యవసర షరతు. కనుక ప్రజల ప్రజాస్వామిక చైతన్యానికి వ్యతిరేక దిశలో ఉండే ఏ విలువైనా అంతరించాల్సిందే. ప్రజల ప్రజాస్వామిక చైతన్యానికి ఊపిరిలూదుతూ మరింత వృద్ధి చెందడానికి దోహదం చేసే ఏ విలువైనా ఆటుపోట్లను ఎదుర్కొనయినా నిలిచి తీరాల్సిందే. ఈ ప్రక్రియకు దోహదపడడమే మీడియా భుజస్కంధాలపై ఉన్న గురుతర బాధ్యత. అందుకే మీడియా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే అనధికారిక నాలుగవ స్తంభం (ఫోర్ట్ ఎస్టేట్) అయింది.


Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: కోర్టుల పాత్రలో మీడియా! | ugiridharaprasad