అగ్గి పుల్లా కుక్క పిల్లా సబ్బు బిళ్ళ
కాదేదీ కవితకనర్హం కవితామయమేనోయ్ అన్నీ… అన్నారు మహాకవి శ్రీ శ్రీ
శ్రీ శ్రీ అన్నది కవిత్వం గురించి. కవిత్వం అల్లడానికి అందమైన స్త్రీ మూర్తి మాత్రమే అర్హురాలని భావిస్తున్న రోజుల్లో, రచనా స్ఫూర్తి కోసం కావ్య ప్రబంధాలను బట్టీయం వేయాల్సిందేనని భావించే రోజుల్లో, మనో భావాలను అక్షరీకరించడానికి ఛందోబద్ధ సంకెళ్ళను విధించిన యుగంలో శ్రీ శ్రీ రాసిన ఈ కవిత ఒక పెద్ద సంచలనం! జన తత్వం వంటబట్టాలే గానీ దావనలం రాజేయగల అగ్గిపుల్ల, మనిషి మొట్టమొదటి జంతు నేస్తమయిన కుక్క పిల్లా, వంటి మురికిని వదిలించే సబ్బు బిళ్ళ కూడా కవితామయమేనని చాటడం ఆనాడు మాటలు కాదు.
నాలుగు గీతలు కలిపి ఒక చిత్రానికి రూపు కట్టాలంటే, మూడు రంగులు కలిపి ఒక భావానికి చూపు ఇవ్వాలంటే, రెండు బ్రష్ లు కలిపి ఒక దృశ్యాన్ని పలికించాలంటే, ఒక పెన్నూ, మరొక పెన్సిలూ కలిపి అద్బుత చిత్రాన్ని ఆవిష్కరించాలంటే ఓ కళాకారుడికి స్ఫూర్తి ఏమిటి?
అందమైన మొఖం, పచ్చగా విరగ కాసిన పొలాలు, ఏడు రంగుల ఇంధ్ర ధనుస్సు, ప్రకృతి రంగుల్నీ చిక్కగా దట్టించే సంధ్యా సమయాలు, అందమైన మొఖమల్ గుడ్డపై ఖరీదైన సీసాలో ఉంచిన పూల గుత్తి, నిశ్చల నీటిలో తిరిగే పడవ సరంగు, పిండారబోసినట్లున్న ఎండలో ధగ ధగ మెరిసిపోయే పూల తోట, పరుపులా పరుచుకున్న పచ్చగడ్డి మైదానం అంచున రంగు రంగుల్లో వయ్యారించే క్రోటన్ మొక్కలు… ఇవే కదా సాధారణంగా చిత్రకళా నిపుణుల్ని ఆకర్షించి చేయి తిప్పాలన్న స్ఫూర్తిని ఇచ్చేవి!
కానీ ఈ కింద బొమ్మలు చూడండి. ఇవన్నీ చేత్తో వేసినవే. కొన్ని పెన్నుతో, కొన్ని ఆయిల్ రంగులతో, మరికొన్ని ఇంకుతో, ఇంకొన్ని అన్నింటినీ కలిపి గీసిన చిత్రాలివి. ఈ అద్భుత చిత్రాలను గీసిన చిత్రకారిణికి స్ఫూర్తిని ఇచ్చినవి అత్యంత సామాన్యమైన దృశ్యాలు. నిత్యం మన చుట్టూ కనపడే సాధారణ దృశ్యాలే ఇవన్నీ. రాత్రీ, పగలూ మనం నడిచే తోవలో, మన చూపులకు అడ్డంగా భావించే దృశ్యాలివి. అంతగా ఎవరి దృష్టినీ ఆకర్షించని దృశ్యాలివి. ఒక్కోసారి మనల్ని చికాకు పెట్టే దృశ్యాలు కూడా. ఇవన్నీ చిత్రకారిణి బి.కిరణ్ కుమారి చేతుల్లో అద్భుతమైన దృశ్యాలుగా అలంకరించుకుని మనముందు నిలిచాయి.
కరెంటు వైరు! ఇదసలు చిత్రకారుడి కుంచెకు తగిలే వస్తువా? మన ఇంట్లో, మన వీధిలో, మనం సరుకులు తెచ్చుకునే షాపులో, మనం పని చేసే ఆఫీసులో ఎక్కడ చూసినా చిక్కురు బుక్కురుగా అల్లుకున్న వైర్లు లేని దృశ్యం అంటూ ఉండదు. కన్సీల్డ్ వైరింగ్ చేసినా అది నిర్మాణం వరకే. ఆ తర్వాత మళ్ళీ కరెంటు వైరు అల్లికల్ని మనం చూడక తప్పదు. ఇవి మనల్ని తరచుగా చికాకు పరుస్తుంటాయి. ఎంత చికాకు పరిచినా ఏ మాత్రం వదిలించుకోలేనివి. మన జీవితానికి అత్యంత అవసరమైన విద్యుత్ శక్తిని వందల, వేల కి.మీ దూరం నుండే మోసుకొస్తున్నప్పటికీ ఈ కరెంటు వైర్లు చిత్రకారుని దృష్టిని ఆకర్షిస్తాయని మాత్రం మనం ఎన్నడూ ఊహించి ఉండం.
ఈ పెయింటింగుల్లో ప్రతి దానిలోనూ కరెంటు వైరును చూడొచ్చు. అది గోడకు వేలాడే పాత సినిమా పోస్టర్ కావచ్చు’ తీరిగ్గా కూర్చుని మౌనంగానో, కూతలతోనో సంభాషించుకుంటున్న పక్షుల దృశ్యం కావచ్చు; ఏ సంఘం వాళ్ళో అవసరం కోసం వీధిలో కట్టిన బేనర్ చిరిగి వేలాడుతున్న దృశ్యం కావచ్చు; మన వీధి చివర బండి ఆపుకుని బేరం కోసం ఎదురు చూస్తున్న ఆటోవాలా కావచ్చు; నల్లటి రాత్రి చీకటిని మోయలేక విద్యుత్ దీపంతో కాస్తయినా భారం దించుకుందామని ప్రయత్నిస్తున్న కాలం కావచ్చు; పగటి సంరంభాన్ని నీలపు ఛాయల్లో విరజిమ్ముతున్న ఆకాశ దీపం కావచ్చు; పగటి సూర్యుడి దూకుడికి చిన్నబోయిన ఫ్లోరెసెంట్ దీపం కావచ్చు; కాంక్రీటు అరణ్యంలోని ఓ జంక్షన్ లో చీకటిని, కాంతిని ఉమ్మడిగా మోస్తున్న భవనాల పిట్టగోడలు, మినీ హోర్డింగులూ కావచ్చు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందు ఉండునో లేదో గానీ కరెంటు వైరు లేని జీవితం ఇప్పటికైతే ఊహించలేము. ఈ అనివార్య దృశ్యాన్ని అద్భుతంగా పట్టి కుంచెలతో కాన్వాస్ పై ఒలికించిన చిత్రకారిణి కిరణ్ గారికి అభినందలు చెప్పకుండా ఉండగలమా?
కుంచె తిప్పడానికి, పెన్సిల్ గీకడానికీ, ఇంకు చిలకడానికి ఇంధ్ర ధనుస్సులు మనముందు వెల్లివిరియాల్సిన అవసరం లేదని ఈ చిత్రాలు మనకు సందేశం ఇస్తున్నాయి. కాంక్రీటు వనంలో చిక్కుకున్న మనిషికి కాసింత గాలిని, వెలుతురును మోసుకొచ్చే కరెంటు వైర్ల ప్రాముఖ్యాన్నీ ఈ చిత్రాలు మనకు విప్పి చెబుతున్నాయి.
ఇంతకీ ఈ బొమ్మలు ఎక్కడివి? సమాధానం: “280, భవానీ నగర్, తిరుపతి.” ‘భవానీ నగర్ వైర్డ్’ (Bhavani nagar wired) శీర్షికన ఈ పెయింటింగులతో హైద్రాబాద్ లోని DAIRA ఆర్ట్ గ్యాలరీలో ఓసారి ప్రదర్శన కూడా జరిగింది. తన వైర్ పెయింటింగుల పైన కిరణ్ కుమారి గారి ప్రకటన చూడండి.
280,Bhavani Nagar
is my address
Where I slip into a pale
And dazzling kaleidoscope
–
Every day
The mixer churns
Concrete and cement
For new constructions
To obstruct existing ones.
–
Construction workers
Hang in the sky
Building new blocks for the eye.
–
In the night sites alter
Into effigy like forms
And windows into black hallow norms.
–
Bulbs and tubes glisten
Streets and homes. And
When midnight approaches
They depart and a solo
Glow keeps company
Of a sleepless soul.
–
The lonely streetlight
Is a witness of the passing time.
–
At 280, Bhavani Nagar,
With gods for
Company, I paint the
Passage of time,
Colours and forms.
–
కిరణ్ కుమారి గారు తన పెయింటింగులతో ఈ మధ్యనే ఒక బ్లాగ్ ప్రారంభించారు. వైవిధ్య భరితమైన చిత్రకళా నైపుణ్యం కిరణ్ కుమారి గారి సొంతం. కాన్వాస్ పై ఆయిల్ పెయింటింగ్ దగ్గర్నుండి, పెన్నూ మరియు ఇంకు గీతల వరకూ ఆమె చేతిలో ఇమిడి పోతాయి. కొన్ని చిత్రాల్లో పర్ఫెక్షన్ కోసం ఇంకాస్త కృషి చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ అవి దూరం నుండి చూడాల్సినవి. వాల్ మౌంటింగ్ కోసం అవి ఉద్దేశించబడ్డాయి. వుడ్ వర్క్ పేరుతో తన బ్లాగ్ లో ఉంచిన చిత్రాలు ఎన్న దగినవి. సంక్లిష్టమైన దృశ్యాలను సైతం చెక్క కాన్వాస్ పై చిత్రీకరించిన తీరు అద్భుతం. ఆమె బ్లాగ్ కోసం ఈ లింక్ లోకి వెళ్ళండి.
























చాలా మచి పైంటింగులు. కిరణ్ కుమారి గారికి అభినందనలు.
భాగ్యనగరంలో ఈ ధౌర్భాగ్యానికేమి కొదవలేదు. ఇళ్ళ ముందు బట్టలారెసుకునే తీరులో విద్యుత్ వైర్ల ప్రస్థానం మాములే. ఎటొచ్చి కవి కవితలో ప్రమోదం, కధ అడ్డం తిరిగితే ప్రమాదం.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: కరెంటు వైరూ, చిరుగు బేనరూ … కాదేదీ గీతకనర్హం | ugiridharaprasad