అరవింద్ కేజ్రివాల్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ఆయనింకా అధికార పీఠంపై కూర్చోనేలేదు. అప్పుడే ఢిల్లీ బ్యూరోక్రాట్ అధికారులకు చెమటలు కారిపోతున్నట్లున్నాయి. అవినీతి జరిగిన దాఖలాలను రుజువు చేసే ఫైళ్లను వారు తగలబెడుతున్నారని ఇండియా టుడే/ఆజ్ తక్ పత్రికా సంస్ధలు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బైటపడింది. మరి కొందరు అధికారులు బదిలీ చేయించుకోడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి కుటుంబానికి రోజుకు 700 లీటర్ల మంచి నీరు ఉచితంగా సరఫరా చేస్తామన్న కేజ్రీవాల్ వాగ్దానానికి భయపడ్డారో ఏమో, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ జల్ బోర్డ్ అధికారులు ఈ తగలబెట్టుడు కార్యక్రమంలో ఎక్కువ బిజీగా ఉన్నారని ఇండియా టుడే తెలిపింది. ఫైళ్ళు తగలబెడుతున్న దృశ్యాలను హెడ్ లైన్స్ టుడే (హెచ్.టి) చానల్ ప్రసారం చేసిందని సదరు పత్రిక తెలిపింది. అవినీతిని జరిగిందని రుజువు చేసేందుకు ఉపయోగపడతాయని భావించే ఫైళ్లను ఈ విధంగా అగ్నికి ఆహుతి చేస్తున్నారని, ఫైళ్ళు నాశనం చేయడానికి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసుకుని మరీ పని కానిస్తున్నారని తెలిపింది.
హెచ్.టి చానెల్ కు చెందిన బృందం రహస్య కెమెరాలు ధరించి ఢిల్లీ సెక్రెటేరియట్ కార్యాలయంలోకి ప్రవేశించారని, వివిధ మంత్రుల కార్యాలయాలను వారు పరిశీలించారని పత్రిక తెలిపింది. ఇంకమ్ టాక్స్ ఆఫీస్ కు సమీపంలో ఉన్న ఢిల్లీ జల్ బోర్డ్ (డి.జె.బి) కార్యాలయంలోనూ వారు తనిఖీ చేశారు. డి.జె.బి చైర్ పర్సన్ గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బాధ్యతలు నిర్వహించడం గమనార్హం.
సెక్రేటేరియట్ లో ఒక గదిలో దస్త్రాలను నాశనం చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉండగా ఇంకా అనేకమంది అధికారులు ఇతర గదుల్లో పచార్లు చేస్తూ తమను అక్కడి నుండి బదిలీ చేయాలని మొత్తుకుంటూ హెచ్.టి బృందం కంట బడ్డారు.
ఢిల్లీలో ఝండేవాలన్ ప్రాంతంలోని డి.జె.బి ప్రధాన కార్యాలయాన్ని కూడా హెచ్.టి బృందం సందర్శించింది. ఢిల్లీ జల్ బోర్డు లో 10,000 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం చోటు చేసుకుందని అరవింద్ గతంలో ఆరోపణలు చేశారు. అధికారులు దస్త్రాలను తగలబెట్టడం బట్టి అవినీతి జరిగిందని రుజువవుతోందని అరవింద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అరవింద్ ప్రమాణ స్వీకారం అనంతరం డి.జె.బి అధికారులు ఆయనకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తే డి.జె.పి చైర్ పర్సన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి వారికి ఆ పరిస్ధితి తప్పదు. బహుశా అందుకే బదిలీ కోసం అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా హెచ్.టి బృందం జల్ బోర్డ్ చీఫ్ విజిలెన్స్ అధికారి ఏ.కె.అంబష్ట్ ను కలిసింది. స్టింగ్ కెమెరాల ముందు మాట్లాడుతూ ఆయన డి.జె.బి లోని అనేకమంది అధికారులకు రెండు కార్లు ఉన్నాయని అంగీకరించారు. తమ ఆఫీసులోని హెడ్ క్లర్క్ కూడా కారుల్లో తిరుగుతుంటారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. క్లర్క్ కారుల్లో తిరిగితే అవినీతికి పాల్పడినట్లు ఎలా నిర్ధారిస్తారో అర్ధం కాని విషయం.
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తాను, తనలాంటి నిజాయితీ అధికారుల పని సులభం అవుతుందని భావిస్తున్నామని జల్ బోర్డ్ చీఫ్ విజిలెన్స్ అధికారి హెచ్.టి బృందంతో అన్నారు. బోర్డు నుండి రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తులను తొలగించాల్సి ఉందని ఆయన తెలిపారు.
“ప్రతి కుటుంబానికి 700 లీటర్ల నీరు ఉచితంగా ఇవ్వడం ఎలా సాధ్యం? అందుకు నిధులు, రెవిన్యూ ఆదాయం ఎక్కడి నుండి వస్తాయి?” అని హెచ్.టి బృందం డి.జె.బి లోని ఒక అధికారిని ప్రశ్నించింది. దానికాయన ఉచితంగా నీరు ఇవ్వడానికి అదనపు రెవిన్యూ ఆదాయమే అవసరం లేదని అసలు సంగతి తేల్చేశారు. పైగా అదనపు ఖర్చులు తగ్గించుకుంటే బోలెడంత ఆదాయం మిగులుతుందని కూడా ఆయన సెలవిచ్చారు. ఉచితంగా ఇవ్వగల నీటికి కూడా ఛార్జీలు వసూలు చేస్తూ తామేదో ప్రజా సంక్షేమం కోసం ఆపసోపాలు పడుతున్నట్లు ప్రభుత్వాలు బిల్డప్ ఇస్తున్నాయన్నమాట!
ఆమ్ ఆద్మీ పార్టీ తాను చెప్పినట్లుగా నిజాయితీగా పని చేస్తే ఇంకా ఎన్నెన్ని అరాచకాలు, అక్రమాలు బైటికి వస్తాయో చూడాలి.
