“నేను ఒక విజయాన్నిగాని లేదా ఒక కేజ్రివాల్ ని గాని బహుమతిగా ఇమ్మని శాంతాను అడిగాను”
–
ఎ.ఎ.పి/కేజ్రివాల్ తో పొత్తు కాంగ్రెస్ కు లాభమా, నష్టమా? ఎ.ఎ.పి తో పొత్తు వద్దని కాంగ్రెస్ లో కొందరు నాయకులు మొదటి నుండి మొత్తుకుంటున్నారు. దానిక్కారణం ఆయన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై దాడి చేయడం ఒకటయితే, ముఖ్య కారణం కాంగ్రెస్ పాలనలో అవినీతిపై విచారణ జరిపిస్తానని వాగ్దానం చేయడం.
కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి కేజ్రివాల్ విధించిన 18 షరతుల్లో అదీ ఒకటి. మద్దతు స్వీకరించినంత మాత్రాన చూసీ చూడనట్లు పోతాం అనుకోవద్దని అవినీతి జరిగినట్లు తేలితే విచారణ చేయిస్తామని ఆయన షరతు పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ‘విచ్-హంట్’ కు దిగితే ఊరుకునేది లేదని ఒకాయన ప్రకటిస్తే, కాంగ్రెస్ మద్దతు షరతులు లేనిదేమీ కాదని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేయడం వెనుక ఈ ఆందోళనే ఉన్నదని భావించవచ్చు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేరే ఉన్నాయి. వారికి ప్రస్తుతానికి పొదలో ఉన్న 2014 ఎన్నికల ఫలితాల పిట్ట కంటే చేతిలో ఉన్న ఎ.ఎ.పి ఎదుగుదల పిట్టే విలువైనది. మోడీ నేతృత్వంలోని బి.జె.పి ని ఎదుర్కోవడానికీ, బి.జె.పి బలాన్ని తగ్గించడానికీ, కాంగ్రెస్ వ్యతిరేకత ద్వారా బి.జె.పి బలం పెంచుకోకుండా ఉండడానికి వారికి ఎ.ఎ.పి ఒక శక్తివంతమైన ఉపకరణం.
ఎ.ఎ.పి ఢిల్లీతోనే ఆగడం లేదు. ఢిల్లీ పక్కనే ఉన్న పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్, ఆ పక్కనే ఉన్న బీహార్ లపైన కూడా కన్నేసింది. 2014 ఎన్నికల కోసం ఇప్పటికే తగిన ఏర్పాట్లను ఎ.ఎ.పి ప్రారంభించిందని పత్రికలు చెబుతున్నాయి. అనగా ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో కాంగ్రెస్/యు.పి.ఎ వ్యతిరేక ఓట్లను ఎ.ఎ.పి చీల్చబోతోంది. ఇతర హిందీ రాష్ట్రాలలో కూడా ఎ.ఎ.పి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో బి.జె.పికి పడబోయే ఓట్లను చీల్చడంలో ఎ.ఎ.పి ప్రముఖ పాత్ర పోషించవచ్చని కాంగ్రెస్ ఆశిస్తోంది.
ఎ.ఎ.పి వల్ల కాంగ్రెస్ కు అనేక విధాలుగా లాభం. ఒకటి బి.జె.పి బలాన్ని తగ్గించి తద్వారా సీట్లు తగ్గించడం. రెండు మోడీ గాలి అనేది ఏదన్నా ఉంటే దానిని బలహీనపరచడం. మూడు, ఎ.ఎ.పి అవినీతి వ్యతిరేక పోరాటంలో తాను భాగస్వామిని అయ్యానని చెప్పుకునే మహదావకాశం కాంగ్రెస్ కు లభించడం. నాలుగు, 2014 ఎన్నికల అనంతరం ఎ.ఎ.పి తో పొత్తు పెట్టుకునే అవకాశం కాంగ్రెస్ కు పెరగడం.
అందుకే కాంగ్రెస్ నాయకులు క్రిస్మస్ తాత శాంతా ను ఒక గెలుపును గానీ, లేదా ఒక కేజ్రీవాల్ ను గానీ బహుమతిగా ఇవ్వాలని కోరినట్లు కార్టూనిస్టు చెబుతున్నారు. తెలంగాణలో కె.సి.ఆర్, సీమాంధ్రలో జగన్, ఇప్పుతూ ఉత్తర భారతంలో ఎ.ఎ.పి!
కలిసొచ్చే కాలంలో నడిచోచ్చే కొడుకు పుడతాడని సామెత. కానీ కాంగ్రెస్ కు మాత్రం కలిసిరాని కాలంలో కూడా నడిచోచ్చే కొడుకుల్ని కంటోంది.

డిల్లిలో ఆప్ కాంగ్రెస్ మద్దత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతోనే దాని స్వరూపం తెలిసింది. కనుక వచ్చే సాధారణ ఎన్నికలలో పైన వుదహరించినట్లు జరిగే అవకాశం తక్కువ. ఆప్ కి వోటేసినా ఫలితం చివరకు కాంగ్రెస్ కే వెళ్తుంది కనుక ఆప్ కి వోట్ వెయ్యరు.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: కేజ్రివాల్, ఒక బహుమతి -కార్టూన్ | ugiridharaprasad