ఇండియాలోని అమెరికా కాన్సలార్ సిబ్బందికి జారీ చేసిన ఐ.డి కార్డులను ఉపసంహరించుకున్నట్లు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఉపసంహరించుకున్న ఐ.డి కార్డుల స్ధానంలో సరిగ్గా అమెరికాలో భారత కాన్సలార్ సిబ్బందికి జారీ చేసిన కార్డుల తరహాలోనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అమెరికా కాన్సలార్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఐ.డి కార్డులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో భారత సిబ్బంది కుటుంబ సభ్యులకు ఐ.డి కార్డులేమీ ఇవ్వలేదనీ అందువలన అమెరికా సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా ఇక ఐ.డి కార్డులు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా అమెరికా కాన్సలార్ కార్యాలయాల్లోనూ, అమెరికా సిబ్బంది ఇళ్లలోనూ అమెరికా ఉద్యోగులకూ, భారతీయ ఉద్యోగులకు ఇస్తున్న జీత భత్యాలలో తీవ్రమైన అంతరాలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. తమకు అమెరికన్లయితే ఒకటి, భారతీయులయితే మరొకటీ కాదనీ, తమ చట్టం ముందు అమెరికన్-నాన్ అమెరికన్, ధనిక-పేద, నలుపు-తెలుపు తేడాలే లేవని ఘనంగా చాటుకున్న అమెరికా ప్రభుత్వ పెద్దలు, న్యాయ వ్యవస్ధ ప్రతినిధులు వాస్తవంలో అమెరికన్లకూ, భారతీయులకూ మధ్య తీవ్రమైన వ్యత్యాసమూ, వివక్షా పాటిస్తున్నారని దీనితో స్పష్టం అయింది. తమ ప్రాధమిక పరిశీలనలోనే ఈ వ్యత్యాసం ఉన్నట్లు తేలిందని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ తేడా ఎంతవరకు ఉన్నదీ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
అమెరికా కాన్సలార్ మరియు ఎంబసీ సిబ్బంది చేసుకునే సుంకం లేని దిగుమతులను నిషేధిస్తున్నట్లు గత వారమే ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిషేధం అమలులో ఉన్నప్పటికీ అమెరికా సిబ్బంది స్వేచ్ఛగా దిగుమతులు చేసుకుంటూనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను భారత విదేశాంగ ప్రతినిధులు ఖండించారని ది హిందు తెలిపింది.
వియన్నా సదస్సు ఒప్పందం ప్రకారం కొత్తగా నియమితులయిన కాన్సలార్ సిబ్బంది మొదటి ఆరు నెలల పాటు తమకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఇతరులలాగే నిబంధనల మేరకు పన్నులు చెల్లించి దిగుమతులు చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇండియా మాత్రం అమెరికా సిబ్బందికి ఈ 6 నెలల గడువును ఏకంగా 3 సంవత్సరాల మేరకు పెంచి అమలు చేసింది. అమెరికా కూడా భారత సిబ్బందికి ఈ మేరకు పెంచిన గడువు అమలు చేయాల్సి ఉండగా ఏ మాత్రం సడలింపు ఇవ్వలేదు. ఐనా మనవాళ్లు కళ్ళు తెరవలేదు. ఒక దౌత్యాధికారి అమానవీయ పద్ధతిలో గౌరవం కోల్పోతే తప్ప వారు కళ్ళు తెరవలేదు.
అమెరికా కాన్సలార్ సిబ్బందికి ఇస్తున్న కొత్త ఐ.డి కార్డుల ప్రకారం వారు గతంలో వలే పూర్తి స్దాయి రాయబార రక్షణ (diplomatic immunity) పొందలేరు. కేవలం చిన్న చిన్న నేరాలకు మాత్రమే రక్షణ పొందుతారు. అమెరికా భారతీయ కాన్సలార్ సిబ్బందికి వర్తింపజేస్తున్న సూత్రాలనే అమెరికా సిబ్బందికీ వర్తింపజేసే రెసిప్రోకల్ నిర్ణయం మేరకు దీనిని అమలు చేస్తున్నారు. “ఈ కార్డులు (నూతన ఐ.డి కార్డులు) కాన్సలార్ సిబ్బందికి మాత్రమే సమకూర్చుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. అమెరికాలో భారతీయ కాన్సలార్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఇలాంటి కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో అమెరికా సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా ఇండియా కార్డులు ఇచ్చేది” అని విదేశాంగ శాఖ అధికారులను ఉటంకిస్తూ ఇండియా టుడే పత్రిక తెలిపింది.
అమెరికా ఎంబసీ పాఠశాలల్లో అమెరికా మరియు భారతీయ సిబ్బంది జీత భత్యాల వివరాలను సమర్పించాలని ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. వారి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. వీటిని ఇంకా అధ్యయనం చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమెరికా, భారతీయ సిబ్బంది జీత భత్యాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని తమ ప్రాధమిక పరిశీలనలో తేలిందని వారు తెలిపారు. ఈ విషయంలో వారు తీసుకునే తదుపరి చర్యలేమిటో తెలియాల్సి ఉంది. సంగీతా రిచర్డ్స్ జీత భత్యాలు, హక్కుల పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయం అనీ, దేవయాని హోదా, రక్షణాల పట్ల తమకు నిమిత్తం లేదని ప్రకటించిన అమెరికా నీతిమంతుల స్పందన ఏమిటో కూడా తెలియాల్సి ఉంది.
