ఎకె-47 సృష్టికర్త కలష్నికోవ్ మరణం


ఈ రోజుల్లో ఎకె-47 రైఫిల్ గురించి విననివారు బహుశా ఎవరూ ఉండరు. చిన్న పిల్లాడి దగ్గర్నుండి పండు ముదుసలి వరకూ ప్రపంచ వ్యాపితంగా ఈ రైఫిల్ సాధించుకున్న పేరు ప్రతిష్టలు అసామాన్యం. ఎటువంటి వాతావరణంలోనైనా తనను ధరించిన వారి అంచనాలను ఏ మాత్రం తప్పని లక్షణం వల్లనే ఎకె-47 రైఫిల్ అంతగా పేరు సంపాదించింది. అలాంటి ఎకె-47 సృష్టికర్త  మిఖాయిల్ కలష్నికోవ్ తన 94 వ యేట సోమవారం ఉద్ముర్తియా రిపబ్లిక్ రాజధాని ఇఝెవ్స్క్ లో మరణించారు.

ఉద్ముర్తియా రిపబ్లిక్ ప్రాంతం రాతియుగం నుండి ఉనికిలో ఉంది. లెనిన్ నాయకత్వంలోని సోవియట్ రష్యా స్వతంత్రం కోరుకున్న జాతులకు విడిపోయే హక్కును రాజ్యాంగంలోనే కల్పించింది. ఆ హక్కుతోటే 1920లో స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతంగా అవతరించిన ఉద్ముర్తియా లేక రిపబ్లిక్ ఆఫ్ ఉద్ముర్త్ 1990లో రిపబ్లిక్ అయింది. కలష్నికోవ్ ఇక్కడే తన వృద్ధాప్యాన్ని గడిపారు.

సోవియట్ రష్యా కోసం ఎకె-47 రైఫిల్ కు కలష్నికోవ్ డిజైన్ చేశారు. అనతికాలంలోనే ఈ రైఫిల్ ప్రపంచం అంతా వ్యాపించింది. అనేక జాతుల తిరుగుబాట్లకు, వియత్నాం యుద్ధం లాంటి వీరోచిత అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధులకు అలంకారంగా ఎకె-47 భాసిల్లింది. అలంకారం అంటే వ్యక్తిగత అలంకారం అని కాదు. న్యాయమైన పోరాటాలకు, తిరుగుబాట్లకు అలంకారమై ఎకె-47 వినుతికెక్కింది. అంతే కాకుండా సామ్రాజ్యవాదులు సృష్టించిన టెర్రరిస్టులకు కూడా ఇది ప్రధాన ఆయుధమే అయింది.

కలష్నికోవ్ చేతుల్లో తయారయినందునే ఎకె-47 రైఫిల్ ను కలష్నికోవ్ రైఫిల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆయుధం ద్వారా ప్రపంచం అంతా రక్తపాతం సాగినందుకు చింతించడం లేదా అన్న ప్రశ్నకు లేదని ఆయన ఒకసారి దృఢంగా చెప్పారు. “నేను బాగానే నిద్రపోతాను. ఒక ఒప్పందానికి రావడానికి బదులు హింసకు పూనుకునే రాజకీయ నాయకులనే తప్పు పట్టాల్సి ఉంటుంది” అని ఆయన రక్తపాతానికి అసలు బాధ్యులెవరో స్పష్టం చేశారు. గుండు వచ్చేది తుపాకి నుండే అయినా ట్రిగ్గర్ నొక్కేది, నోక్కించేది మనిషే కదా!

ఎకె-47 అంటే అవ్తోమత్ కలష్నికోవ్ (Avtomat Kalashnikov – 47) అని అర్ధం. 47 అనేది సంవత్సరాన్ని సూచిస్తుంది. దీనిని మొదట రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో డిజైన్ చేశారు. 1945 నుండి మొదలు పెట్టి 1946 కల్లా ఒక నమూనా తయారు చేశారు. ఎకె-46 అని నామకరణం చేశారు. ఆ తర్వాత మరింత అభివృద్ధి చేసి ఎకె-47 గా సోవియెట్ సేనలకు ఇచ్చారు. దీనిని అభివృద్ధి చేస్తూ మరిన్ని నమూనాలను వివిధ దేశాలు తయారు చేసినప్పటికీ ఎకె-47 కు అవేవీ సాటిరాలేకపోయాయి. తేలికగా ఉపయోగించగలడం, తక్కువ ఉత్పత్తి ఖర్చు, భారీ ఉత్పత్తి వల్ల తేలికగా అందుబాటులో ఉండడం, మన్నిక… ఇవన్నీ ఎకె-47 ను ఇప్పటికీ అత్యధికులు కోరుకునే రైఫిల్ గా నిలిపాయి.

“వియత్నాం యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోయిన వియత్నాం సైనికులు తటస్ధపడితే తమ చేతుల్లో ఉన్న M-16 తుపాకులను పారేసి వియత్నామీయుల వద్ద ఉన్న ఎకె-47 స్వాధీనం చేసుకునేవారు” అని 2007లో రైఫిల్ కనిపెట్టి 60 యేళ్ళు అయిన సందర్భంగా జరిగిన సమావేశంలో కలష్నికోవ్ చెప్పారని ది హిందు తెలిపింది.

సైబీరియాలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ మొదట తాను వ్యవసాయ పరికరాలను డిజైన్ చేయాలని భావించాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ రష్యాతో కుదుర్చుకున్న ఒడంబడికను పక్కనబెట్టి తమ దేశంపైకి హిట్లర్ జర్మనీ దండెత్తడంతో కలష్నికోవ్ దృష్టి అటు మళ్ళింది. రైల్ రోడ్ గమస్తాగా జీవితం ప్రారంభించి అనంతరం 1938లో ఆయన రష్యా ఎర్ర సైన్యంలో చేరిపోయారు. సోవియట్ ట్యాంకులకు అనేక మార్పులు సూచించి తన మెకానికల్ పరిజ్ఞానాన్ని చూపడం ద్వారా కలష్నికోవ్ తన ప్రతిభను చాటారు.

కలష్నికోవ్ మిలట్రీ కెరీర్ లో అనేక అవార్డులు గెలుచుకున్నారు. ‘హీరో ఆఫ్ సోషలిస్ట్ లేబర్’ ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’, ‘ఆర్డర్ ఆఫ్ స్టాలిన్’ లాంటి అవార్డులు ఆయన్ను వరించాయి. అయితే కలష్నికోవ్ కు పేటెంట్ హక్కులు సంపాదించడానికి సోవియట్ ప్రభుత్వం గానీ, కలష్నికోవ్ గానీ ఆసక్తి చూపలేదు. అందువలన ఎకె-47 ప్రాచుర్యం ఆయనకు డబ్బు సంపాదించి పెట్టిందేమీ లేదు. అందుకు ఆయన బాధపడిందీ లేదు.

“ఆ రోజుల్లో మా దేశంలో నూతన ఆవిష్కరణలకు పేటెంట్ పొందడం పెద్ద విషయం కాదు. మేమంతా సోషలిస్టు సమాజ నిర్మాణానికి కృషి చేశాము. ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నాము. అంతే తప్ప డబ్బు కోసం కాదు. అందుకు నేను చింతించడం లేదు” అని కలష్నికోవ్ స్పష్టం చేశారు. సోషలిస్టు సమాజం బోధించే విలువలు ఇలాగే ఉంటాయి. పెట్టుబడిదారీ సమాజం ‘ఏమైనా చెయ్యి, కానీ సంపాదించు. ధనికుడివి కా. ఇంకా ఇంకా డబ్బు దండుకో, సూపర్ ధనికుడివి కా” అని ప్రబోధిస్తే సోషలిస్టు సమాజం మాత్రం సమాజం కోసం బతకాలని బోధిస్తుంది. అందుకే సాటి మనిషి కుత్తుక ఉత్తరించయినా డబ్బు సంపాదించమనే పెట్టుబడిదారీ సమాజం కన్నా త్యాగం చేసయినా సమాజం అభ్యున్నతికి పాటుపడమని బోధించే సామ్యవాద సమాజం మిన్న.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేకమంది పోరాట యోధులు కలష్నికోవ్ ను ధరించి ఉండగా తీసిన ఈ ఫోటోలను రష్యా టుడే అందించింది.

వ్యాఖ్యానించండి