చైనా తన మిలట్రీ సామర్ధ్యాన్ని వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో పెద్ద ఎత్తున మిలట్రీ బలగాలను మోహరించిన అమెరికాకు దీటుగా 1.1 లక్షల టన్నుల భారీ సూపర్ విమాన వాహక నౌక నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్ధ్యంతో ఈ విమాన వాహక నౌకను రూపొందించడంతో అమెరికాకు చైనా భారీ సవాలునే విసురుతోంది. 2020 నాటికల్లా ఈ నౌకా నిర్మాణం పూర్తి చేయాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ) తలపెట్టినట్లు తెలుస్తోంది.
“అప్పటికల్లా (2020) అమెరికాకు చెందిన అత్యంత అధునాతనమైన వాహక నౌక ఆధారిత ఫైటర్ జెట్ లను తలదన్నే సామర్ధ్యాన్ని చైనా సంతరించుకుంటుంది” అని పి.ఎల్.ఎ పేర్కొన్నట్లుగా చైనీయ భాషా వెబ్ సైట్ షియాన్ ఝాన్ డాట్ కామ్ వెబ్ సైట్ ను ఉటంకిస్తూ రష్యా టుడే (ఆర్.టి) తెలిపింది. తూర్పు చైనా సముద్రంలో ఇటీవల ఉద్రిక్తతలు తలెత్తిన నేపధ్యంలో అమెరికా ఈ ప్రాంతంలో తన మిలట్రీ శక్తిని మరింతగా పెంచడానికి నిర్ణయం తీసుకుంది. అమెరికా నిర్ణయానికి ప్రతిగానే పి.ఎల్.ఎ నిర్ణయాన్ని బహిర్గతం చేసినట్లు భావిస్తున్నారు.
ఐతే తూర్పు చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తడానికి పూర్వమే అమెరికా సైనిక బలగాలు చైనా చుట్టూ మోహరించాయి. జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ తదితర తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో ఉన్న సైనిక సహకార ఒప్పందాలను అడ్డు పెట్టుకుని అమెరికా ఈ విధంగా మిలట్రీ బలగాలతో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టడానికి దశాబ్దం నుండే ప్రయత్నాలు చేస్తోంది. కనుక పశ్చిమ పత్రికలు సూచిస్తున్నట్లుగా అమెరికా సైనిక మోహరింపుకు చైనా ఇటీవల ప్రకటించిన ADIZ కూ సంబంధం లేదు. ఉద్రిక్తతల సందర్భంగా విమాన వాహక నౌక నిర్మాణాన్ని ప్రకటించడం ద్వారా తాను తయారుగా ఉన్నానన్న సందేశాన్ని చైనా పంపినట్లయింది.
ADIZ ప్రకటనకు రెండు నెలల ముందే అమెరికా తన నావికాదళంలోని ‘యు.ఎస్.ఎస్ ఫ్రీడం’ పోరాట నౌకను సింగపూర్ పంపింది. సముద్ర తీరంలో మోహరించి యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే ఈ నౌక 8 నెలలపాటు దక్షిణ చైనా సముద్రంలో బలగాలను మోహరించనుంది. మరోవైపు జపాన్ కూడా మరిన్ని ఆయుధాల కొనుగోలు ప్రకటించింది. వచ్చే 5 యేళ్లలో రక్షణ ఖర్చు పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త మిలట్రీ హార్డ్ వేర్, అమెరికా తయారీ ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్లు, Aegis కాంబాట్ వ్యవస్ధలు తదితరాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. దీనిని చైనా తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపింది.
పరస్పర బలగాల మోహరింపు ఫలితంగా తృటిలో ఘర్షణలు తప్పిపోయే ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల (డిసెంబర్ 5) గైడెడ్ మిసైళ్లను మోసుకెళ్లే అమెరికా యుద్ధ నౌక ‘యు.ఎస్.ఎస్ కౌపెన్స్’ చైనా మొట్టమొదటి విమాన వాహక నౌక ‘లియావోనింగ్’ ను ఢీకొన్నంత పని చేసింది. సోవియట్ రష్యాకు చెందిన నౌకను ఉక్రెయిన్ నుండి కొనుగోలు చేసిన చైనా దానిని ఆధునీకరించి ‘లియావోనింగ్’ గా జల ప్రవేశం చేయించింది. ఈ ఘటనను ఇరు దేశాలు పైకి కొట్టి పారేసినప్పటికీ చైనా మౌనంగా ఊరుకోలేదు. ఈ ఘటనపై అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరిక జారీ చేసిందని సి.ఎస్.ఎం (క్రిస్టియన్ సైన్స్ మానిటర్) తెలిపింది.
“ఈ (దక్షిణ చైనా సముద్ర) జలాల్లో అమెరికా కార్యకలాపాలు నిర్వహించదలిస్తే అత్యంత తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిర్వహించడానికి సిద్ధపడి ఉండాలనీ, లేదంటే అక్కడి నుండి వెళ్లిపోవడం ఉత్తమం అనీ చైనా స్పష్టం చేసింది” అని ‘హెరిటేజ్ ఫౌండేషన్’ లో రాజకీయ, రక్షణ వ్యవహారాల నిపుణుడు డీన్ చెంగ్ చెప్పారని ఆర్.టి తెలిపింది.
చైనా నిర్మించనున్న తన మొట్టమొదటి భారీ విమాన వాహక నౌక లియావోనింగ్ తరహాలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ప్రగతి సాధించిన చైనా సోవియట్ యుగం నాటి నౌకలకు ఆధునిక పరిజ్ఞానం సమకూర్చడం ద్వారా ఆధునీకరణలో వెనకబడకుండా జాగ్రత్త వహిస్తోంది. సొంతంగా కూడా చైనా ఆధునిక ఫైటర్ జెట్ లు నిర్మిస్తోంది. ఉదాహరణకి 2011లో జె-20 స్టెల్త్ ఫైటర్లను చైనా తన ఆయుధ బలగంలో ప్రవేశపెట్టింది. చంద్రుడిపై మానవ రహిత ఉపగ్రహాన్ని దించడం ద్వారా ఆ ఘనత సాధించిన దేశాల్లో మూడవదిగా నిలిచిన సంగతి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
మొత్తం మీద ఆర్ధిక శక్తిగానే కాక ఆయుధ శక్తిగా కూడా చైనా అవతరిస్తోంది. అమెరికాతో సమానత సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆ వైపుగా చైనా ప్రయాణం సాగిస్తోందన్నది స్పష్టం.


