(విప్లవ కమ్యూనిస్టు పార్టీ నేత మాదాల నారాయణ స్వామి గారు డిసెంబర్ 9 తేదీన 99 యేళ్ళ వయసులో మరణించారు. చివరి క్షణాల వరకూ విప్లవ రాజకీయాలను శ్వాసించిన స్వామి గారు ఎం.ఎన్.ఎస్ గా సుప్రసిద్ధులు. 1952లో ఒంగోలు అసెంబ్లీకి, 1962లో ఒంగోలు పార్లమెంటు సభ్యత్వానికి ఎన్నికయిన ఎం.ఎన్.ఎస్ గారు ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ తన జీవితం అంతా శ్రామికవర్గ విముక్తికి అంకితమై పని చేశారు. ప్రకాశం జిల్లా పల్లెలకు ‘స్వామిగారు’ గా చిరపరిచితులయిన ఎం.ఎన్.ఎస్ గారు నిర్జీవులై ఉండగా రాసిన కవిత ఇది. విరామమెరుగని యోధుడికి జోహార్లు ఆర్పీస్తూ…. -విశేఖర్)
*** *** ***
ష్! చప్పుడు చేయకండి!
అలుపెరుగని ప్రజాయుద్ధ యోధుడు
అలసట తీర్చుకోడానికి ఆగారిక్కడ!
తిరగబడ్డ జన ప్రభంజనాన్ని
అసెంబ్లీ, పార్లమెంటులకు రుచి చూపిన
వీర తేజం విశ్రమిస్తోందిక్కడ!
ఏడు దశాబ్దాలు ఎగిసెగిసి పడ్డ అలజడి తరంగం
తీరం చేరే తోవలో
పంజా ముడిచి పరికిస్తోందిక్కడ!
నల్ల కోట్ల ముంగిట్లో
ఖాకీ చొక్కా గల్లా పట్టుకున్న చెయ్యి
నిస్తేజమై ఉత్తేజం పంచుతోందిక్కడ!
యౌవనాశ్వానికి ముకుతాడు బిగించి
మరో ప్రపంచానికి వారధి కడుతూ
విముక్తి బాటపై దౌడు తీయించిన వీర కిశోరం
వయో సంధ్యలోకి అస్తమించిందిక్కడ!
లాల్ సలాం కామ్రేడ్!
మేమింకా మీ చిటికెన వేలు పట్టుకునే ఉన్నాం
అదాటున మేలుకోలేక
మా ఆశలింకా మీ దోసిలిలోనే ఉంచాం
ఫర్ఫాలేదు…
మీ ఉద్విగ్న జ్ఞాపకాలు మా మనసుల్లో పదిలమే
ఉద్యమోన్ముఖులైన మీ ఆదేశాల
ఆనవాళ్లను మేమిక తడుముకుంటాం!
మీ రణాన్నినాద తరంగాలను
మా కర్ణభేరులు రికార్డు చేశాయి
కష్టకాలంలో కంటికి రెప్పలైన పల్లెలు
‘స్వామి’గారి కదలికల్ని సాధన చేశాయ్
మీ గంభీర కంఠ స్వరమే అలజడికి ఆదేశం
వర్గకసి నిండిన మీ కంటి చూపే బడబాగ్నులకు దారి
శిశిర గాలులు ఆవరించిన ఆపత్కాలానికి
మీ విప్లవతేజో యౌవనమే నిత్య వసంతం
ఏటికి ఎదురీత నేర్పిన గజ ఈతగాళ్ళు మీరు
మీ భుజాలెక్కించి చూపిన మరో ప్రపంచపు అద్భుతాల్ని
మీ అనుభవాల దోసిళ్ళనుండి ఒడిసి పట్టుకున్నాం
భవితకు దారి చూపే మీ పాద ముద్రల్ని
మా బిగి పిడికళ్లలో భద్రపరిచాం
విరామమెరుగని యోధుడా!
వీడ్కోలు గాలి ఊది
మీ ఆశయాల దీపాన్ని ఆర్పలేం
శపధాల ఆజ్యం పోసి
దావానలం రాజేస్తాం!

” శపధాల ఆజ్యం పోసి
దావానలం రాజేస్తాం! ”
చాలా మంచి కవిత.