కళాకారుడికి ముఖ్యంగా చిత్రకారుడికి తాను చూసే దృశ్యాల పట్ల వివక్ష చూపకూడదని ఒక సూత్రం. అనగా గొప్ప దృశ్యం, పనికిమాలిన దృశ్యం అంటూ అతని దృష్టిలో ఏమీ ఉండకూడదని అర్ధం. ఆయన చేయాల్సిందల్లా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించడమే. బహుశా ఫోటోగ్రాఫర్ కి కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో.
కాకపోతే ఫోటోగ్రాఫర్ కి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. ఆ పరిజ్ఞానం సహాయంతో ఫోటోగ్రాఫర్ సాధారణ కంటికి పెద్దగా ఆకర్షణీయంగా కనపడని దృశ్యాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరించగల శక్తిని సంతరించుకుంటాడు. మనిషి కంటి ముందు ఉండే దృశ్యం నిశ్చలం కాదు. నిత్యం మారుతూపోయే చలనశీలం. అందువల్ల క్షణకాలంలో మాయమయ్యే అద్భుత దృశ్యాలను సాధారణ కంటికి పట్టుబడకపోవచ్చు.
అదీ కాక కంటి దృశ్యం త్రీ-డైమెన్షనల్. అదే ఫోటో అయితే టూ-డైమెన్షనల్. అనగా ఫోటోలో దృశ్యాలన్నీ సమతలంలోనే పోగుబడడం వలన కంటికి మరింత విందు ఇస్తుందనుకుంటాను. సమతలంలోనే త్రీ-డైమెన్షనల్ ఎఫెక్ట్ తెచ్చే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. కానీ అందులోని ధర్డ్ డైమెన్షన్ కేవలం వర్చువల్ మాత్రమే గానీ నిజం కాదు. కాబట్టి ఆ విధంగా చూసినా అది టూ-డైమెన్షనల్ సమతలం గానే పేర్కొనాల్సి ఉంటుంది.
అసలు విషయానికి వస్తే నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు 2013 సంవత్సరానికి గాను ఫోటో పోటీలను నిర్వహిస్తున్నారని గతంలో చెప్పుకున్నాం. ఈ పోటీ విజేతలను ప్రకటించారు. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. జనం (people), స్ధలం (places), ప్రకృతి (nature). నిజానికి జనం, స్ధలం కూడా దాదాపు ప్రకృతి కిందకే రావాలి. కానీ మనిషికి ఈ రెండింటికీ ప్రకృతిలో లేని రూపాలను ఇవ్వగల శక్తి ఉన్నది. అసమానుల మధ్య సమాన పోటీని భారత రాజ్యాంగం నిషేధించినట్లుగా అసమాన దృశ్యాల మధ్య సమాన పోటీని నివారిస్తూ నేషనల్ జాగ్రఫిక్ ఈ మూడింటికి వేరు వేరు పోటీలు నిర్వహించింది.
ప్రకృతి విభాగంలో ధృవ ప్రాంతపు ఎలుగుబంటి నీటి మడుగు నుండి పైకి చూస్తున్న దృశ్యం గెలుచుకుంది. గ్లోబల్ వార్మింగ్ వలన ధృవ ప్రాంతంలో మంచు కరిగిపోతూ అక్కడి జీవజాలాన్ని ప్రమాదంలో పడేస్తోంది. 35 డిగ్రీల వేడిమి తట్టుకోలేక నీటి అడుగున ఎలుగు శరణు తీసుకుంటోంది. గ్లోబల్ వార్మింగ్ సమస్యను పరిష్కరించాలన్న ఉదాత్త భావనను వ్యక్తీకరిస్తున్నందున ఈ ఫోటోకు ప్రకృతి విభాగంలో మొదటి బహుమతి వచ్చినట్లు కనిపిస్తోంది.
జనం విభాగంలో ‘కలిసి, విడివిడిగా’ శీర్షికన ఒక కవల జంట కారులో విశ్రాంతి పొందుతున్న దృశ్యం బహుమతి గెలుచుకుంది. 15 యేళ్ళ నిల్స్, ఎమిల్ లు డెన్మార్క్ లోని ఫిన్ నివాసులు. వీరు తమను తాము ‘నేను’ గా కంటే ‘మనం’గా పరిగణించుకుంటారట. ఆ విధంగా వీరు ఒక్కరే. కానీ భౌతిక ఉనికి రీత్యా ఇద్దరూ వేరు వేరు. అందుకే ‘కలిసి, విడివిడిగా’ అని టైటిల్ పెట్టినట్లుంది.
స్ధలం విభాగంలో చైనాలోని లావోచెంగ్ అనే పాత పట్టణంలో ఉదయం పూట కుమారుడిని వీపుపై మోస్తూ పనికి బయలుదేరిన తల్లి దృశ్యం బహుమతి గెలుచుకుంది. ఈ దృశ్యంలో తల్లీ, కుమారులు ఒక భాగం మాత్రమే. వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనాలో పాత నగరాలు కూడా తమ పాత రూపును వదిలించుకుని ‘అభివృద్ధి’ రూపాన్ని పొందుతున్నాయి. త్వరలోనే పాత రూపాన్ని వదిలించుకోనున్న లావోచెంగ్ పట్టణాన్ని ఇలా తన ఫోటోలో బంధించానని ఫోటోగ్రాఫర్ ఆదమ్ టాన్ చెబుతున్నారు.
ఇక మిగిలిన ఫోటోలన్నీ గౌరవనీయ స్ధానానికి ఎంపికయినవి. ఇందులో టోక్యో నగరంలో హేంగర్లతో అల్లిన కాకి గూడు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టోక్యో లాంటి మహా నగరం ఎన్నాడో కాంక్రీటు వనంగా మారినందున పాపం ఆ కాకి మాతకు గూడు అల్లుకోవడానికి సరిపోయినన్ని ఎండు పుల్లలే దొరకలేదు. ప్రకృతిని మనిషి దురాక్రమిస్తున్న ఫలితం ఇది.
ఆ తర్వాత ఇండియా నుండి పట్టుకెళ్లిన నీటి గుర్రం కెనడా చలికి కిందమీదులవుతున్న తీరు, హంగేరిలో డాన్యూబ్ నదీ తరంగాల నేపధ్యంలో ఆవిష్కృతమైన కొంగల గుంపు దృశ్యం, స్పెయిన్ లోని తరిఫా బీచ్ లో సన్ బాత్ చేస్తున్న ఆవులు, తుఫాను వాతావరణం నేపధ్యంలో అందం సంతరించుకున్న మరుభూమి, అమెరికా నుండి మాతృ దేశం గాంబియా తరలివచ్చిన అరబిక్, గ్రీన్ లాండ్ నుండి డెన్మార్క్ వలస వచ్చిన ఇదా, కారులో కూర్చుని కెమెరావైపు చూస్తున్న ఫోగ్రాఫర్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రాన్సెస్కా, ఢాకా చెత్త కుప్పల మధ్య బెలూన్లతో ఆడుకుంటున్న బాలుడు, చేతిలో పావురంతో సందేశం ఇస్తున్నట్లు కనిపిస్తున్న రొమేనియా బాలుడు లారెంటియు గౌరవ ప్రస్తావనకు ఎంపికయ్యాయి.
ఇక మిగిలినవి పోటీకి సమర్పించబడిన ఎంట్రీలలో కొన్ని. నేషనల్ జాగ్రఫిక్ వెబ్ సైట్ ఈ ఫోటోలు అందించింది.



























