అమెరికాలో న్యూయార్క్ నగరంలో మన్ హట్టన్ లోని లిబర్టీ ఐలాండ్ లో నెలకొల్పిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ప్రాశస్త్యం ఏమిటో తెలిసిందే. ఫ్రాన్సుకి చెందిన శిల్పి అమెరికా ప్రజలకు బహుమానంగా పంపిన ఈ విగ్రహం స్వేచ్ఛా, స్వతంత్రాలకే కాకుండా అమెరికాకు కూడా సంకేతంగా నిలుస్తుంది.
విదేశాల నుండి అమెరికాకు వలస రాదలుచుకున్నవారికి ఆహ్వానం పలుకుతున్నామనడానికీ, ప్రగతికీ సంకేతంగా లిబర్టీ విగ్రహానికి ఒక చేతిలో కాగడా ఉంటుంది. మరో చేతిలోని పుస్తకం అమెరికా రాజ్యాంగానికి సంకేతం. ఈ పుస్తకంపై అమెరికా స్వతంత్రం ప్రకటించుకున్న తేదీ జులై 4, 1776 రాసి ఉంటుంది. విగ్రహం కాళ్ళ దగ్గర తెగిపడి ఉన్నట్లున్న గొలుసు అమెరికా విముక్తికి సంకేతం.
న్యూయార్క్ లో మన్ హట్టన్ లోనే ఉన్న భారత కాన్సలేట్ లో డిప్యూటీ కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న దేవయాని పట్ల అక్కడి విదేశాంగ శాఖ పోలీసులు అమానవీయ రీతిలో వ్యవహరించిన నేపధ్యంలో కార్టూనిస్టు ఈ కార్టూన్ మన ముందుంచారు.
విదేశీయులకు దారి చూపుతూ ఆహ్వానం పలుకుతున్న కాగడాను కిందికి దించిన లిబర్టీ విగ్రహం దానిని ఆగ్రహంతో పరికించడాన్ని ఇక విదేశీయులు ఆహ్వానితులు కారని చెబుతున్నట్లుగా కార్టూనిస్టు చిత్రీకరించారు. కాగడా వల్ల లిబర్టీకి చెమటలు పట్టినట్లుగా కూడా చిత్రీకరించబడింది.
అప్పటి వరకు ఛాతీకి దగ్గరగా ముడిచి ఉంచిన రాజ్యాంగాన్ని పక్కన బెట్టి ‘నియమ నిబంధనల’ (The Rule Book) పుస్తకాన్ని లిబర్టీ విగ్రహం విదేశీయులకు ఎత్తి చూపుతోంది. అనగా ఇక విదేశీయులు ఎంత మాత్రం ఆహ్వానితులు కారని చెబుతోంది. కాదని వస్తే రూల్ బుక్ వర్తింపజేస్తామనీ, బహుశా అమానవీయంగా వ్యవహరిస్తామని కూడా చెబుతోంది.
దేవయాని వ్యవహారానికి ఈ కార్టూన్ చక్కగా నప్పుతోంది.

పింగ్‌బ్యాక్: లిబర్టీ విగ్రహం: ఆహ్వానమా, తిరస్కారమా? -కార్టూన్ | ugiridharaprasad