ఆర్కిటిక్ లో అమెరికా కట్టెలమ్మి, రష్యా పూలమ్మి


Prirazlomnoye field

అమెరికా విఫలం అయిన చోట రష్యా సఫలం అయింది. అమెరికా కట్టెలమ్మిన చోట రష్యా పూలమ్ముతోంది. ఆర్కిటిక్ ఆయిల్ వెలితీతలో అమెరికా కట్టెలమ్మిగా తేలితే రష్యా పూలమ్మిగా తేలింది. ఆర్కిటిక్ సిరి సంపదల కోసం ఇండియాతో సహా ప్రధాన దేశాలన్నీ పోటీ పడుతున్న సమయంలో అమెరికాను త్రోసిరాజని రష్యా ముందుకెళ్లిపోయింది. ఆర్కిటిక్ షెల్ నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించినట్లు రష్యా చమురు కంపెనీ గాజ్ ప్రోమ్ చేసిన ప్రకటన చూస్తే వరుసగా కలిగే భావాలివి.

చమురు, సహజ వాయువు అన్వేషణ మరియు ఉత్పత్తి సంస్ధ అయిన గాజ్ ప్రోమ్ కంపెనీ రష్యాకు చెందిన అతి పెద్ద బహుళజాతి కంపెనీ. ఆర్కిటిక్ సముద్రంలోని Prirazlomnoye ఆయిల్ ఫీల్డ్ నుండి చమురు ఉత్పత్తి ప్రారంభించినట్లు గాజ్ ప్రోమ్ శనివారం ప్రకటించింది. ఆర్కిటిక్ సముద్రంలో భాగం అయిన పెచోరా సముద్రంలో Prirazlomnoye చమురు బావి నెలకొంది. ఇక్కడ చమురు ఉత్పత్తి చేయడం ద్వారా ఆర్కిటిక్ లో మొట్టమొదట చమురు ఉత్పత్తి చేసిన దేశంగా రష్యా నిలిచింది.

అమెరికా కూడా ఆర్కిటిక్ లో చమురు వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అలాస్కా తీరంలో చమురు అన్వేషణకు రాయల్ డచ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చి పురమాయించింది. భారీ స్ధాయిలో మంచు గడ్డ కట్టుకుని ఉండే ఆర్కిటిక్ సముద్రంలో చమురు వెలికి తీయడం సదరు కంపెనీ వల్ల కాలేదు. దానితో అలాస్కా తీరంలో చమురు అన్వేషణ ప్రయత్నాలను గత సంవత్సరం రాయల్ డచ్ కంపెనీ విరమించుకుంది. డ్రిల్లింగ్ ను సస్పెండ్ చేసుకుని మూటా ముల్లె సర్దుకుని వెనక్కి వచ్చేసింది. మరింత అనుకూలంగా ఉండే చోట చమురు అన్వేషించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.

రష్యా కంపెనీ గాజ్ ప్రోమ్ మాత్రం తన మొదటి ప్రయత్నంలోనే సఫలం అయింది. అర మిలియన్ టన్నులు తూగే Prirazlomnoye ఆయిల్ రిగ్గు ద్వారా డ్రిల్లింగ్ చేసిన గాజ్ ప్రోమ్ చమురు కనిపెట్టడమే కాకుండా ఉత్పత్తి కూడా ప్రారంభించింది. Prirazlomnoye చమురు ప్లాట్ ఫారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ఐస్ నిరోధక ఆయిల్ రిగ్గు అని ది హిందు తెలిపింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను అధిగమించి చమురు వెలికి తీయగల సామర్ధ్యం ఈ ప్లాట్ ఫారం కు ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి Prirazlomnoye ఆయిల్ ఫీల్డు ఇతర బావులతో పోలిస్తే తక్కువ చమురును కలిగి ఉన్నది. 72 మిలియన్ టన్నుల చమురు ఇక్కడ నిల్వ ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే తీవ్రమైన ప్రతికూల పరిస్ధితుల మధ్య, ద్రవం అనేది ఏదయినా క్షణాల్లో గడ్డ కట్టుకుపోయే వాతావరణంలో చమురు వెలికి తీయడమే రష్యా సాధించిన విజయం.

గాజ్ ప్రోమ్ దృష్టిలో Prirazlomnoye, ఒక పైలట్ ప్రాజెక్టు మాత్రమే. దీని ద్వారా రష్యా పరిధిలోని ఆర్కిటిక్ నుండి భారీ మొత్తంలో చమురు వెలికి తీసే అనుభవాన్ని తాము సంపాదించామని గాజ్ ప్రోమ్ తెలిపింది. రష్యాకు చెందిన ఆర్కిటిక్ సముద్ర గర్భం నుండి 30 చోట్ల చమురు, సహజ వాయువులను వెలికి తీసేందుకు లైసెన్సులు తమకు ఉన్నాయని తెలిపింది.

గాజ్ ప్రోమ్ ఆర్కిటిక్ విజయగాధ వెలువడడానికి ముందు గ్రీన్ పీస్ కి చెందిన 30 మంది కార్యకర్తలు కొద్ది నెలల క్రితం Prirazlomnoye ఆయిల్ రిగ్గు పైకి దండెత్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నానని చెప్పుకునే గ్రీన్ పీస్ వాస్తవానికి పశ్చిమ దేశాల చేతిలో ఒక పని ముట్టు. దాని పోషకులంతా పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలే. పర్యావరణం పేరుతో వైరి కంపెనీలను సాధించడం గ్రీన్ పీస్ కు అప్పగించిన పని. గ్రీన్ పీస్ కార్యకర్తలు Prirazlomnoye రిగ్గు పైకి వచ్చినప్పటికీ రష్యా చలించలేదు. వారిని అరెస్టు చేసి విధ్వంసక చర్యల నేరం మోపి జైలులో పెట్టింది. కొద్ది రోజుల క్రితమే వారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు.

ఆర్కిటిక్ సముద్రంలో ప్రపంచంలోని 13 శాతం ఇంధనం నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆర్కిటిక్ ఖండంలో మంచు అనుకున్నదానికంటే వేగంగా మంచు కరిగిపోతుండడంతో అక్కడ సంపదల కోసం పోటీ వేగం పుంజుకుంది. ఈ సంపద కోసం అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాలతో పాటు ఇండియా కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది. గత అక్టోబర్ లో భారత ప్రధాని మన్మోహన్ రష్యా సందర్శించినప్పుడు ఇరు దేశాలు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన చేశాయి. రష్యా కంపెనీలతో కలిసి ఇండియాకు చెందిన ఓ.ఎన్.జి.సి విదేశ్ చమురు అన్వేషణ, ఉత్పత్తి లలో పాల్గొంటుందని సదరు ప్రకటన పేర్కొంది.

వ్యాఖ్యానించండి