అల్లంత శిఖరాన శూన్యంలోకి అడుగు పెడితే… -ఫోటోలు


పక్షిలా ఎగరాలని మనిషి అనుకోకపోతే విమానం ఉనికిలోకి వచ్చేది కాదు. నేలని ఒక్క తన్ను తన్ని గాల్లోకి రివ్వున దూసుకుపోయే కల బహుశా ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమై ఉంటుంది. హల్క్ పేరుతో విడుదలయిన హాలీవుడ్ సినిమాలో పచ్చ రంగు హీరో ఇలాగే గాల్లోకి ఎగురుతూ ఉంటాడు. కానీ అతనికి కోపం వస్తే తప్ప ఎగరలేడు. పైగా ఆ పరిస్ధితి వచ్చినందుకు అతను చాలా బాధపడుతుంటాడు.

హల్క్ లాగా కాకుండా ఇష్టంగా గాల్లో నడుస్తూ భూమిపై కనపడే వస్తువుల్ని, భవనాల్ని, మనుషుల్ని సంభ్రమంగా పరికించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? పశ్చిమ యూరప్ లో వివిధ దేశాలలో విస్తరించి ఉన్న ఎత్తైన ఆల్ప్స్ పర్వతాలపై దాదాపు గాలిలో వివరించే అవకాశాన్ని ఫ్రాన్స్ కల్పించింది.

ఇటలీ, ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలుగా వ్యవహరించే కొండల పైన శిఖరాగ్రానికి ఆనుకుని ఒక గ్లాస్ ఛాంబర్ ను నిర్మించారు. సముద్ర మట్టం నుండి 1,035 మీటర్ల ఎత్తున ఉండే ‘ఐగిల్లే దు మిడి’ పర్వత వరుస చివర ఈ గ్యాస్ ఛాంబర్ నిర్మించారు. ‘చామోనిక్స్ స్కై వాక్’ అని పేరు పెట్టిన దీనిని ‘శూన్యంలోకి అడుగు పెట్టండి’ (Step Into The Void) అని ది అట్లాంటిక్ పత్రిక వ్యవహరించింది.

పెంటగాన్ తరహాలో 5 గోడలతో నిర్మించిన ఈ గ్యాస్ ఛాంబర్ ఒక వైపు పర్వతం మీదికి తెరుచుకుని ఉంటుంది. మిగిలిన నాలుగు గోడలు శిఖరాగ్రం నుండి గాలిలోకి విస్తరించి ఉంటాయి. కింద కూడా గాజు పలకనే అమర్చడం వలన నిజంగానే గాలిలో నడిచిన అనుభవం కలుగుతుంది.  యాక్రోఫోబియా (ఎత్తైన ప్రదేశాలంటే భయం) లేనివారికి ఈ గ్యాస్ ఛాంబర్ విభ్రాంతికరమైన అనుభవం ఇస్తుందనడంలో సందేహం లేదు.

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్ కాన్యాన్ లో ఇలాంటి నిర్మాణం ఒకటి ఉంది. గుర్రపు నాడా రూపంలో ఉండే ఈ నిర్మాణం కూడా లోతైనదే ఐనా దాని లోతు 240 మీటర్లే. పైగా అది పూర్తిగా అన్ని వైపులా గ్లాస్ తో నిర్మించినది కాదు. అయితే ఫ్రెంచి ఆల్ప్స్ పై నిర్మించిన చామోనిక్స్ స్కై వాక్ ను మాత్రం అమెరికాలోని ‘గ్రాండ్ కాన్యాన్ స్కై వాక్ స్ఫూర్తితోనే నిర్మించామని చెబుతున్నారు.

చామోనిక్స్ స్కైవాక్ ఈ రోజు (డిసెంబర్ 21) నుండే సందర్శకులకు అనుమతి ఇచ్చారు. గ్రాండ్ కాన్యాన్ తరహాలో ఇది కూడా పెద్ద టూరిస్టు అట్రాక్షన్ గా మారుతుందని భావిస్తున్నారు. కేవలం అర అంగుళం మందం గాజు పలకలతో నిర్మించినప్పటికీ చాలా శక్తివంతం అని చెబుతున్నారు.

ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.

2 thoughts on “అల్లంత శిఖరాన శూన్యంలోకి అడుగు పెడితే… -ఫోటోలు

  1. పింగ్‌బ్యాక్: అల్లంత శిఖరాన శూన్యంలోకి అడుగు పెడితే… -ఫోటోలు | ugiridharaprasad

వ్యాఖ్యానించండి